Search Here

Sep 15, 2021

Johann Ernst Gruendler | జోహాన్ ఎర్నెస్ట్ గ్రండ్లర్

 జోహాన్ ఎర్నెస్ట్ గ్రండ్లర్ | Johann Ernst Gruendler

  • జననం : 07/04/1677
  • మరణం : 09/03/1720
  • స్వదేశం : జర్మనీ
  • దర్శన స్థలం : భారతదేశం

క్రైస్తవ కుటుంబములో జన్మించిన పిల్లలను గురించిన ఒక ముఖ్యమైన సమస్య ఏమిటంటే పుట్టుకతోనే లేదా క్రైస్తవ విలువలతో పెరిగినదానిని బట్టి రక్షణ వారికి చెందినట్లుగానే వారు భావిస్తారు . వారి తల్లిదండ్రుల యొక్క భయభక్తులు కలిగిన జీవితం వారిని నరకము నుండి రక్షిస్తుందనే భావన అనేకమంది యవ్వనస్థులలో ఉంటుంది . జోహాన్ ఎర్నెస్ట్ గ్రండ్లర్ వారికి అతీతమైన వారేమీ కాదు . దైవభక్తి గల కుటుంబములో జన్మించిన గ్రండ్లర్ , క్రైస్తవునిగా పిలువబడుటను బట్టి ఎంతో గర్వించేవారు . కాగా క్రైస్తవ వేదాంత శాస్త్రమును చదువవలెనని ఎంచుకొనిన అతను , లిఫ్టిగ్ మరియు విట్టెన్ బర్లలో తన విద్యాభ్యాసాన్ని సాగించారు . అయినప్పటికీ రక్షణ అనగా ఏమిటో అతను ఎరిగియుండలేదు . కాగా ఒకసారి హాలీలో అతను నిజమైన వినయమేది మరియు నిజముకాని వినయమేది అను దానిని గురించిన ఒక ప్రసంగమును వినడం జరిగింది . అప్పుడు అతను తన అహంకారాన్ని విడిచిపెట్టి , క్రీస్తులో దీనత్వము కలిగిన నూతన సృష్టిగా మారారు .

కొంతకాలం ఉపాధ్యాయునిగా పనిచేసిన గ్రండ్లర్ , తదుపరి భారతదేశంలోని హిందువుల మధ్యలో సేవ చేయవలెనన్న దేవుని పిలుపును అందుకున్నారు . భారతీయులకు క్రీస్తు ప్రేమను తెలియపరచవలెనన్న మిగుల వాంఛతో అతను మరికొందరు మిషనరీలతో కలిసి 1709 వ సం || లో భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ట్రాంక్యూబారు వచ్చారు . అక్కడ తమిళ భాషను నేర్చుకొని , జీగె బాగ్ యొక్క పరిచర్యలో నమ్మకమైన సహకారి అయ్యారు . వారిరువురూ కలిసి చుట్టుప్రక్కల ఉన్న నగరాలకు మరియు పట్టణాలకు కాలినడకన ప్రయాణించి సువార్తను ప్రకటించారు . వారి దీన స్వభావం వారిని ప్రజలకు దగ్గర చేసింది . కాగా చాలా తక్కువ వ్యవధిలోనే వారు ప్రజలను చేరుకోగలిగారు మరియు వారిని క్రీస్తు వైపుకు నడిపించగలిగారు .

మిషనరీగా మతసంబంధమైన విధులను నిర్వర్తించడమే కాకుండా , దక్షిణ తమిళనాడులో విద్యాసంబంధమైన కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించుటకు కూడా గ్రండ్లర్ శ్రమించారు . మునుపు అతను ఉపాధ్యాయునిగా పనిచేసిన అనుభవం ఈ పనిలో అతనికి ఎంతో సహాయపడింది . ట్రాంక్యూబా లోని ఇతర మిషనరీల సహాయంతో అతను బాల బాలికలకు వేరువేరుగా డానిష్ మరియు పోర్చుగీస్ పాఠశాలలను ప్రారంభించారు . బలవంతము చేతనో లేదా వారి యొక్క అజ్ఞాననమును ఆసరాగా తీసుకొనుట వలననో కాక , విద్యాజ్ఞానమును అందించి వారిని ఓపికతో వెన్నంటి అవగాహనాపూర్వకముగా ఒప్పించడం ద్వారా మాత్రమే ప్రజలను సువార్త యొద్దకు నిజముగా నడిపించగలమని గ్రండ్లర్ భావించారు . ఈ పాఠశాలల ద్వారా అతను స్థానిక పిల్లల యొక్క విద్యావసరతలను మాత్రమే కాక ఆత్మీయ అవసరతలను కూడా సంధించగలిగారు .

తాను చేసిన పనులన్నింటిలో ప్రభువును మహిమపరచి , అటువంటి పరిశుద్ధమైన సేవ కొరకైన తన పిలుపును బట్టి ప్రతి పనిలో అతను సంతోషించేవారు . తనకు నిజమైన సాధనముగా ఉన్న అతనిని తనకు తదుపరి ట్రాంక్యూబార్ మిషన్ యొక్క బాధ్యతలు చేపట్టుటకు జీగె బాగ్ ఎన్నుకున్నారు . తన పరలోకపు యజమానుని నిత్యానందములోనికి ప్రవేశించు వరకూ సేవ కొరకైన తన పిలుపులో నమ్మకమైన సేవకునిగా ముందుకు సాగిపోయారు జోహాన్ గ్రండ్లర్ .

ప్రియమైనవారలారా , ఆత్మీయ విషయములను బట్టి మీరు కలిగియున్న అహంకారమును మీరు అధిగమించారా ?

" ప్రభువా , దీనునిగాను , నలిగిన హృదయముగలవానిగాను నన్ను చేయుము . ఆమేన్ ! "
  • WhatsApp
  • No comments:

    Post a Comment