Search Here

Apr 7, 2022

Richard Wurmbrand | రిచర్డ్ వుర్మ్‌బ్రాండ్

రిచర్డ్ వుర్మ్‌బ్రాండ్  జీవిత చరిత్ర




  • జననం : 24-03-1909
  • మరణం : 17-02-2001
  • స్వస్థలం : బుకారెస్ట్
  • దేశం  : రొమేనియా
  • దర్శన స్థలము : రొమేనియా


ఒక యూదుల కుటుంబంలో ఆఖరి పిల్లవానిగా జన్మించారు రిచర్డ్ వుర్మ్‌బ్రాండ్. కొంతకాలం ఇస్తాంబుల్‌లో నివసించిన వారి కుటుంబం, అతని తండ్రి మరణం తరువాత రొమేనియా దేశానికి వెళ్ళారు. అమోఘమైన మేధచ్ఛక్తి కలిగియున్న రిచర్డ్, తొమ్మిది భాషలను అనర్గళంగా మాట్లాడగలరు. యవ్వనప్రాయములో అతను వామపక్ష రాజకీయాలపై ఆసక్తి కలిగియుండేవారు. వర్తక మధ్యవర్తియైన స్టాక్ బ్రోకర్‌గా అతను వృత్తిని చేపట్టారు. క్రిస్టియన్ వోల్ఫ్‌కేస్ అనే జర్మనీవాడైన ఒక వడ్రంగి పంచుకున్న బలమైన సాక్ష్యం మూలముగా అతను మరియు అతని భార్యయైన సబీనా ఓస్టర్ ప్రభువును అంగీకరించారు.


దేవుని మీదనే తమ నమ్మికను ఉంచిన ఈ దంపతులు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో సువార్తను ప్రకటించుట కొరకు అవకాశములకై ఎదురుచూశారు. కాగా వారు బాంబు దాడుల నుండి ప్రజలను రక్షించుటకు ఏర్పరచబడిన స్థావరములలో బోధించారు మరియు యూదుల పిల్లలను రక్షించుటలో తమ సేవలను అందించారు. అందుకు వారు పట్టబడి బంధించబడినప్పటికీ, పలుమార్లు కొట్టబడినప్పటికీ, ఆ శ్రమలన్నిటిలో కూడా వారు విశ్వాసములో మరింతగా బలపరచబడ్డారే గానీ కృంగిపోలేదు. 1945వ సంll లో సోవియట్ రష్యావారు రొమేనియాను స్వాధీనం చేసుకుని, క్రైస్తవ సంఘములను నియంత్రించుటకు ప్రయత్నించారు. అటువంటి సమయములో రిచర్డ్ దంపతులు రహస్య సంఘములను ప్రారంభించి సేవను కొనసాగించారు. కేవలం తన దేశస్థులకే కాదు, రష్యా సైన్యమునకు కూడా సేవలందించిన రిచర్డ్, వారికి పది లక్షలకు పైగా సువార్త కరపత్రికలను పంచిపెట్టారు. ఇవి తరచుగా కమ్యూనిస్టు ప్రచార పుస్తకములనే పేరుతో పంచబడేవి. సువార్త కరపత్రికలను రష్యాలోకి అక్రమంగా రవాణా చేయుటకు ఏర్పాట్లు చేయడంలో కూడా అతను సహాయపడేవారు. అందువలన అతనికి  ‘ది ఐరన్ కర్టెన్ పాల్’ అనే పేరు వచ్చింది.


ప్రభుత్వమును ధైర్యముగా ఎదిరించి నిలబడి, క్రైస్తవ సంఘములపై ప్రభుత్వ నియంత్రణను ఖండించినందు వలన 1948వ సంll లో అతనిని, 1950వ సంll లో అతని భార్యను పట్టుకొని బంధించారు. ఎనిమిది సంవత్సరాల పాటు వర్ణింపనశక్యముకాని కౄరమైన చిత్రవధలతో కూడిన కఠినమైన జైలు జీవితమును అనుభవించిన పిమ్మట 1956వ సంll లో రిచర్డ్ విడుదలచేయబడ్డారు. అయితే, అది ఎంతో కాలం నిలువలేదు, మూడేళ్ల తరువాత అతనిని తిరిగి బంధించారు. అయితే ఆ శిక్ష మధ్యలోనే అతను 1964వ సంll లో క్షమాభిక్ష పొందినవారై విడుదల చేయబడ్డారు. తదుపరి అతను రొమేనియాను విడిచి వెళ్ళుటకు అయిష్టత కలిగియున్నప్పటికీ, ఇతర దేవుని బిడ్డల సలహా మేరకు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో సేవ చేయుటకు ఆ దేశాన్ని విడిచి వెళ్ళారు. కమ్యూనిస్టు దేశాలలో క్రైస్తవులు అనుభవిస్తున్న శ్రమలను గురించి తెలియపరుస్తూ అతను నార్వే, ఇంగ్లాండు మరియు అమెరికా దేశాలను పర్యటించారు. 1967వ సంll లో "జీసస్ టు ది కమ్యూనిస్ట్ వరల్డ్" (కమ్యూనిస్టు ప్రపంచానికి యేసు) అనే పేరుతో అతను హింసలను, శ్రమలను ఎదుర్కొన్న క్రైస్తవ కుటుంబములకు సేవలను అందించడం మొదలుపెట్టారు. తదుపరి దీని పేరు "ది వాయిస్ ఆఫ్ ది మార్టిర్స్" (హత సాక్షుల స్వరము) అని మార్చబడింది. శ్రమనొందిన క్రైస్తవులను ప్రోత్సహిస్తూ, ధైర్యపరుస్తూ, వారికి సహాయసహకారముల నందించి ఆదుకొంటూ ఈ నాటికీ ఈ సంస్థ 60 కి పైగా దేశాలలో తన సేవలను అందింస్తోంది.


ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, సువార్త కరపత్రాలను ఇతరులకు అందించుటలో మీరు ఎటువంటి పాత్ర కలిగియున్నారు?


ప్రార్థన :

"ప్రభువా, నేను కలుసుకున్న ప్రతి ఒక్కరికీ సువార్త కరపత్రాలను ఇవ్వగలుగునట్లు నన్ను ధైర్యముతో నింపుము. ఆమేన్!"


దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • No comments:

    Post a Comment