Search Here

Jul 30, 2021

Annie Taylor Biography | అనీ టేలర్ సంక్షిప్త జీవిత చరిత్ర

అనీ టేలర్ సంక్షిప్త జీవిత చరిత్ర / Annie Taylor Biography


జననం: 07-10-1855
మరణం: 09-09-1922
       స్వస్థలం: చెషైర్
దేశం: ఇంగ్లాండ్
దర్శన స్థలం: టిబెట్


తెలియని భూభాగంలో క్రీస్తును ప్రకటించుటకు ఎన్నో కష్టాలను ఎంతో ఆనందంగా భరించినవారిలో అనీ రాయల్ టేలర్ ఒకరు . సువార్త ప్రకటించుట కొరకు పాశ్చాత్య దేశాల నుండి వచ్చి టిబెట్ భూభాగాన్ని సందర్శించిన మొట్టమొదటి మహిళగా ఆమె పేరుగాంచారు . అప్పటిలో టిబెట్ దేశంలోకి మిషనరీలు అడుగుపెట్టుటకు దారులు మూయబడ్డాయి . ఏదేమైనా , యవ్వన వయస్సులో ఉన్న సాహసోపేతమైన అన్నీ టేలర్ , టిబెట్ ప్రజలను చేరుకొని వారికి సువార్తను ప్రకటించవలెననునది తన జీవిత గమ్యముగా మార్చుకున్నారు . మిషనరీ సేవ కొరకై ముందుకు వచ్చుటకు ప్రోత్సహిస్తూ ఒక మిషనరీ ఇచ్చిన ప్రసంగాన్ని విన్న టేలర్ , చాలా చిన్న వయస్సులోనే దానిని ఒక సవాలుగా తీసుకున్నారు . అప్పటి నుండి మిషనరీ అవ్వాలన్న వాంఛ కలిగియున్న ఆమె , దేవుని నడిపింపు కొరకు వేచియున్నారు .

కాగా 1884 వ సం ll లో నర్సింగ్ లో పట్టభద్రురాలైన పిమ్మట , అదే సంవత్సరం ' చైనా ఇలాండ్ మిషన్లో ' చేరారు . తదుపరి ఆమె చైనాకు పయనమైనప్పటికీ , ఆమె హృదయం మాత్రం సువార్త నిషేధించబడిన టిబెట్ భూభాగంలోకి ప్రవేశించాలని ఎంతో ఆకాంక్షించింది . 1890 వ సం ll లో ఆమె టిబెట్ సరిహద్దులో ఉన్న భారతదేశంలోని సిక్కింకు వెళ్లి టిబెట్ వారి భాష , సంస్కృతి మరియు మతాన్ని అధ్యయనం చేశారు . టిబెట్లోకి ప్రవేశించడం ఒక అసాధ్యమైన కార్యం అని ఆమెకు తెలిసినప్పటికీ , కొండలు , లోయల గుండా ప్రమాదకరమైన ప్రయాణాన్ని ప్రారంభించారు టేలర్ . మార్గములో ఆమె రెండుసార్లు దొంగల బారినపడి దోచుకొనబడ్డారు , అనేక పర్యాయములు తనను చంపుటకు జరిగిన హత్యాయత్నాల నుండి తప్పించుకున్నారు . అయినప్పటికీ , దేవుడు భద్రపరుస్తాడన్న నమ్మికతో తన లక్ష్యమును చేరుకొనుటలో వెనుకంజవేయక ముందుకుసాగిపోయారు టేలర్ . చివరికి 1892 వ సం ll లో టిబెట్ లోని లాసా జిల్లాకు చేరుకొనగలిగారు . అయితే , అక్కడి అధికారుల చేతులలో పట్టుబడి , అరెస్టు చేయబడి , తిరిగి చైనాకు పంపివేయబడడమే ఆమెకు దక్కిన ఫలమయ్యింది .

ఏదేమైనప్పటికీ , టిబెట్ పట్ల ఆమెకున్న భారం ఆమె ' టిబెటన్ పయనీర్ మిషన్ ' ను స్థాపించుటకు కారణమయ్యింది . తదుపరి ఆమె భారతదేశ సరిహద్దుకు దగ్గరగా టిబెట్ లోని యాతుంగ్ అనే ప్రాంతములో స్థిరపడ్డారు . అక్కడ ఆమె టిబెట్ ప్రజలకు ఆత్మీయ మరియు భౌతికపరమైన సేవలను అందించవచ్చునన్న ఆశతో ఒక చిన్న వాణిజ్య వ్యాపారం మరియు వైద్య కేంద్రాన్ని ప్రారంభించారు . దేవుడు ఆమె చేతుల కష్టమును ఆశీర్వదించగా , ఎంతోమంది టిబెట్ ప్రజల ఆత్మలను ఆమె క్రీస్తు కొరకు సంపాదించగలిగారు . స్త్రీ అయినప్పటికీ ఒంటరిగా నిలబడి సువార్త సేవ కొరకు ఆమె చేసిన ప్రయత్నాలు , తరువాతి కాలంలో టిబెట్ లో సేవ చేయుటకు ఆమె అడుగుజాడలను అనుసరించిన అనేక మందికి ప్రేరణగా నిలిచాయి .

  • WhatsApp
  • No comments:

    Post a Comment