Search Here

Mar 21, 2022

Jonathan Goforth | జోనాతాన్ గోఫోర్త్

జోనాతాన్ గోఫోర్త్ జీవిత చరిత్ర



  • జననం : 10-02-1859
  • మరణం : 08-10-1936
  • స్వస్థలం : ఓంటారియో
  • దేశం : కెనడా
  • దర్శన స్థలము : చైనా


కెనడాకు చెందిన జోనాతాన్ గోఫోర్త్ ఒక సువార్తికుడు, ఆత్మీయ ఉజ్జీవం తీసుకువచ్చినవారు మరియు మిషనరీగా చైనాలో సేవలందించారు. పదకొండుమంది సంతానంలో ఏడవవానిగా జన్మించిన అతను, తన తల్లి యొక్క క్రైస్తవ విశ్వాసముచే బాగా ప్రభావితులయ్యారు. 18 సంll ల ప్రాయంలో రెవ. లాచ్లాన్ కామెరాన్ యొక్క ప్రసంగం వినినప్పుడు, అతను తన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడ్డారు. ఆనాటి నుండి తన జీవితమును యేసు క్రీస్తుకు ఇచ్చిన అతను, "నా జీవితం నా కొరకు తన ప్రాణమును ఇచ్చినవానికి చెందినది" అని చెప్పేవారు. అటు పిమ్మట అతను ఒక చురుకైన క్రైస్థవునిగా ఓంటారియోలో సువార్త కరపత్రాలను పంచిపెడుతూ మరియు ఆరాధన సేవలను నిర్వహించుచూ దేవుని సేవలో పాలుపంచుకున్నారు.


ఎన్నో కష్టముల మధ్య తన ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసిన గోఫోర్త్, తదుపరి వేదాంత శాస్త్రం చదువుటకు టొరంటోలోని నాక్స్ కళాశాలలో చేరారు. ఆ సమయంలో ఒక రోజు  ప్రపంచవ్యాప్తంగా మిషనరీల అవసరం ఎంతో గొప్పగా ఉందని దృఢముగా చెబుతున్న జార్జ్ ఎల్. మాకే యొక్క ప్రసంగం వినడం జరిగింది. అప్పటి నుండి మిషనరీ సేవ చేయుటకు తనను తాను సిద్ధపరచుకొనుటకు తనకు వచ్చిన ఏ అవకాశాన్ని కూడా అతను విడిచిపెట్టలేదు. 1887వ సంll అక్టోబరు మాసంలో సేవ చేయుటకు గోఫోర్త్ అర్హత పొందారు. అదే నెలలో ఫ్లోరెన్స్ రోసాలిండ్‌ను వివాహం చేసుకున్న అతను, కొన్ని నెలల తరువాత భార్యతో కూడా కలిసి మిషనరీ సేవ చేయుటకు చైనాకు పయనమయ్యారు. 


1888వ సంll లో చైనాలోని చెఫూకు చేరుకున్నారు గోఫోర్త్ దంపతులు. తరువాత వారు హోనన్ పరిధి ప్రాంతమునకు వెళ్ళారు. ఆరంభములో భాష తెలియని కారణముగా కొంత ఇబ్బందిని ఎదుర్కొన్నప్పటికీ, వినుటకు సుముఖత కలిగినవారితో క్రైస్తవ సందేశం యొక్క ముఖ్యమైన అంశాలను అతను పంచుకున్నారు. అతను ప్రసంగించినప్పుడల్లా అక్కడ కూడుకున్నవారు పరిశుద్ధాత్మ దేవుని శక్తివంతమైన క్రియలను అనుభవించారు. కాగా వేలాది మంది ప్రజలు యేసు క్రీస్తును తమ స్వరక్షకునిగా అంగీకరించి, సంఘముతో చేర్చబడ్డారు. అంతేకాకుండా మంచూరియా మరియు కొరియాలలో విస్తృతముగా ప్రయాణించి అతను చేసిన సేవ, ఆ ప్రాంతాలలో అంతకు మునుపు ఎప్పుడూ లేనివిధముగా ఒక గొప్ప ఉజ్జీవానికి దారితీసింది.


గోఫోర్త్ యొక్క మిషనరీ ప్రయాణం కష్టాలు శ్రమలు లేనిదిగా లేదు. వారి యొక్క పదకొండు మంది పిల్లలలో ఐదుగురు అకాల మరణం చెందారు. అటువంటి క్లిష్ట సమయాలలో అతను దేవుని నుండి ఆదరణను, బలమును పొందుకొనినవారై తన యొక్క పిలుపులో స్థిరముగా నిలబడ్డారు. అతని శ్రమలు అంతటితో ఆగలేదు. చైనావారు అతనిని చుట్టుముట్టి కొట్టారు, అతను తన కుటుంబం నుండి వేరుచేయబడ్డారు, ఒకసారి అతని ఇల్లు కూడా కాలిపోయింది. అయితే అవేవీ కూడా దేవుని సేవ చేయాలన్న అతని తీర్మానాన్ని నిరోధించలేకపోయాయి. అతని విశ్వాసం పరీక్షకు గురవుతున్న ప్రతిసారీ దేవుని వాక్యమును ఆశ్రయించే జోనాతాన్ గోఫోర్త్, సేవలో ముందుకు సాగుటకు ఏకైక మార్గం ప్రార్థనేయని ధృఢముగా విశ్వసించారు.


ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, మీ జీవితం మీ కొరకు తన ప్రాణాన్ని అర్పించినవాడైన క్రీస్తుకు చెందినదిగా ఉన్నదా?


ప్రార్థన :

"ప్రభువా, ఇక మీదట నా కొరకు కాక మీ కొరకే జీవించుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!" 

దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • No comments:

    Post a Comment