థామస్ వాకర్ జీవిత చరిత్ర
- జననం : 09-02-1859
- మరణం : 24-08-1912
- స్వస్థలం : డెర్బీషైర్
- దేశం : ఇంగ్లాండు
- దర్శన స్థలము : తిరునెల్వేలి (భారతదేశం)
థామస్ వాకర్ దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తిన్నెవెల్లి (తిరునెల్వేలి) ప్రాంతానికి మిషనరీగా వచ్చిన ఆంగ్లేయుడు. భక్తిగల క్రైస్తవ కుటుంబంలో జన్మించిన అతను చిన్నప్పటి నుండీ దేవుని యందలి భయభక్తులతో పెరిగారు. పదిహేడేళ్ళ వయసులో అతను ఒక బైబిలు తరగతికి హాజరవ్వగా, అక్కడ అతను వినిన 'బండ మీద కట్టువాడు మరియు ఇసుక మీద కట్టువాడు' అనే ఉపమానం అతని హృదయాన్ని బలంగా తాకింది. వెంటనే అతను తనను తాను దేవునికి సమర్పించుకున్నారు. గణిత శాస్త్రమును అభ్యసించుటకు కేంబ్రిడ్జ్ లోని సెయింట్ జాన్ కళాశాలలో చేరిన వాకర్ అక్కడ భక్తి, ప్రార్థన మరియు క్రమబద్ధమైన వాక్య ధ్యానం కలిగిన జీవితమును అభివృద్ధి పరచుకున్నారు. అవి అతని భవిష్యత్తు జీవితమునకు మరియు సేవకు పునాది వేశాయి. అతను వ్యాపారం చేయాలని అతని తండ్రి కోరుకున్నారు గానీ, అతని హృదయం మాత్రం మిషనరీ సేవ చేయాలనే వాంఛతో నిండుకొనియుంది. అతను దేవుని వాక్యమును ధ్యానించే కొద్దీ 'మనుష్యులను పట్టు జాలరిగా' మారవలెననే నిశ్చయత అతనిలో మరింతగా బలపడుతూ వచ్చింది. తత్ఫలితంగా అతను ‘చర్చి మిషనరీ సొసైటీలో చేరగా, 1885వ సంll లో తిన్నెవెల్లికి పంపించబడ్డారు.
తిన్నెవెల్లికి చేరుకున్న తరువాత తమిళ భాషలో ప్రావీణ్యం సంపాదించిన వాకర్, అనేక ఆంగ్ల కీర్తనలను తమిళ భాషలోకి అనువదించే ఒక గొప్ప పద్ధతిని అలవరిచారు. తిన్నెవెల్లి మరియు చుట్టుప్రక్కల వివిధ ప్రాంతాలకు కాలినడకన మరియు ఎద్దుల బండి పై వెళ్ళి సువార్తను ప్రకటించిన శక్తివంతమైన బోధకుడు వాకర్. ఆ విధంగా అతని నిర్విరామ సేవల వలన క్రీస్తు యొక్క వెలుగును చూసిన ప్రదేశాలలో పన్నైవిళై ఒకటి. హిందువుల నుండి అతను వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ, క్రీస్తు కొరకు అనేక ఆత్మలను రక్షించడంలో విజయవంతులయ్యారు. అంతేకాకుండా, దేవదాసీ బాలికల మధ్య సేవచేస్తున్న తన తోటి మిషనరీ అయిన ఎమీ కార్‌మైఖేల్‌కు కూడా ఆమె చేస్తున్న సేవలో ప్రోత్సాహమందించారు వాకర్. కాగా వారిరువురూ కలిసి డోనావూర్ వద్ద ఒక పాఠశాలను మరియు "డోనావూర్ ఫెలోషిప్" అనే సంస్థను స్థాపించారు. వీటి ద్వారా ఆ ప్రదేశం ఒక క్రైస్తవ సమాజంగా మారింది మరియు యువతులకు సురక్షితమైన ఆశ్రయమయ్యింది.
వాకర్ అసాధారణమైన చిత్తశుద్ధి మరియు ఆత్మీయ విషయముల పట్ల ఎంతో శ్రద్ధ గలిగిన వ్యక్తి. మార్మన్ కన్వెన్షన్‌లో అతను చేసిన ప్రసంగాలు కేరళ రాష్ట్రంలోని క్రైస్తవ సంఘములలో ఉజ్జీవాన్ని తీసుకువచ్చాయి. అతని సేవ ఫలితంగా అప్పటి దైవ సేవకులు సువార్తను ప్రకటించవలెనన్న తీవ్రమైన వాంఛ మరియు ఆసక్తులతో నింపబడ్డారు. తత్ఫలితంగా ఎంతోమంది దేవుని యొక్క మందలో చేర్చబడ్డారు. అనేకమంది మిషనరీలకు ప్రేరణగా నిలిచిన 'వాకర్ ఆఫ్ తిన్నెవెల్లి’ అని పిలువబడే థామస్ వాకర్, దేవుని కొరకు మనుష్యులను పట్టే జాలరిగా ఈ లోకములో తన పనిని విజయవంతముగా ముగించి, 1912వ సంll లో పరలోకపు వాసస్థలమునకు పయనమయ్యారు.
ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది :
ప్రియమైనవారలారా, మీరు దేవుని కొరకు మనుష్యులను పట్టు జాలర్లుగా ఉన్నారా?
దేవునికే మహిమ కలుగునుగాక!
"ప్రభువా, ఇహలోక ఆశలను, సుఖభోగములను విడిచి మీ కొరకు మనుష్యులను పట్టు జాలరిగా ఉండునట్లు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!
దేవునికే మహిమ కలుగునుగాక!
No comments:
Post a Comment