Search Here

Mar 21, 2022

Bernie May | బెర్నీ మే

బెర్నీ మే జీవిత చరిత్ర



  • జననం: 1932
  • స్వదేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  • దర్శన స్థలము: దక్షిణ అమెరికా


అది క్రిస్మస్‌కు ముందు రోజు. ఒక మిషనరీ విమాన చోదకుడు (మిషనరీ పైలట్) జనసాంద్రతకు దూరముగా ఉన్న ఒక అమెజాన్ గ్రామానికి అత్యవసర వైద్య చికిత్సకు సంబంధించినవాటిని పంపిణీ చేశారు. క్రిస్మస్ రోజుకల్లా తన కుటుంబమును తిరిగి చేరుకొనుటకు అతను ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. అయితే సాయంత్రం పూట చీకటి పడటంతో అతను విమానాన్ని నడపలేకపోయారు. కావున అతను తన భద్రత కొరకు తాత్కాలికమైన ఏర్పాట్లు చేసుకొని అడవిలోనే ఆ రాత్రి గడుపుటకు తల వాల్చారు. కానీ, అప్పుడు వర్షం పడటం ప్రారంభమైంది. ఆ వర్షం క్రిస్మస్ రోజు సాయంత్రం వరకు కొనసాగింది. క్రిస్మస్ రోజున తన కుటుంబము గానీ సంఘ సహవాసం గానీ లేకుండా అడవిలో చిక్కుకుపోయినందుకు ఎంతో నిరాశానిస్పృహలకు గురైన ఆ మిషనరీ, “ఓ దేవా, క్రిస్మస్‌ అంటే ఇలా ఉండకూడదు. నేను సరైన స్థలములో లేను, తప్పు స్థలములో ఉన్నాను” అని విలపించారు.


అతను అక్కడ తాను వేసుకున్న ఊయలలో పడుకుని, కుటుంబము పై ఎంతో దిగులుతో ఉండగా, దేవుడు తన హృదయములో తనతో మాట్లాడుటను అతను విన్నారు. అదేమంటే “నా కుమారుడా, క్రిస్మస్ అంటే ఇదే! యేసు క్రీస్తు పరలోకమును విడిచిపెట్టి క్రిస్మస్ రోజున ‘తప్పు స్థలం’ లో ఆయన మేల్కొన్నాడు. అది బేత్లెహేములోని ఒక పశువుల పాక. క్రిస్మస్ అంటే ఇంటిని వదిలి వెళ్ళడం, ఇంటికి వెళ్ళడం కాదు. నా ఏకైక కుమారుడు క్రిస్మస్ కొరకు ఇంటికి రాలేదు, మీతో ఉండుటకు ఇంటిని విడిచిపెట్టాడు.”


అప్పుడు ఆ విమాన చోదకుని హృదయం ఎంతో కృతజ్ఞతతో నిండిపోయింది. తన కుటుంబము యొద్దకు తిరిగి వెళ్ళుటకు మరికొన్ని రోజులు అతను అడవిలో ఒంటరిగా వేచియున్నారు. అతను ఎవరంటే ‘విక్లిఫ్ బైబిల్ ట్రాన్స్‌లేటర్స్’ (విక్లిఫ్ బైబిలు అనువాదకులు) అనే సంస్థకు మిషనరీ విమాన చోదకుడైన బెర్నీ మే.


1954 వ సంll లో ఒక ఆదివారపు ఆరాధనా కూడికలో అమెజాన్ ప్రాంతాలలో ఉండే తెగలకు మిషనరీ అయిన రేచెల్ సెయింట్ ఒక శక్తివంతమైన ప్రసంగం ఇచ్చిన తరువాత, అరణ్యాలలో మిషనరీ పని కొరకు తనతో చేతులు కలుపమని ప్రజలను కోరారు. ప్రత్యేకముగా ఆమెకు ఒక విమాన చోదకుడు మరియు కార్యదర్శి (సెక్రటరీ) అవసరం. ఆ బాప్టిస్టు చర్చిలో కూర్చొని ఉన్నవారిలో వినోదము కొరకు విమానమును నడిపే బెర్నీ మే మరియు శిక్షణ పొందిన కార్యదర్శియైన అతని భార్య నాన్సీ ఉన్నారు. వెంటనే దేవుడు తమను పిలుస్తున్నాడని వారి హృదయములో వారు గ్రహించారు. తత్ఫలితముగా వారిరువురూ కలిసి తమను దేవుని పరిచర్యకు సమర్పించుకున్నారు.


తరువాతి ఇరవై ఐదు సంవత్సరాల పాటు బెర్నీ మిషనరీలను, మందులను మరియు సువార్త రచనలను రవాణా చేస్తూ మిషనరీ విమాన చోదకునిగా కొన్ని క్లిష్టమైన స్థితిగతుల మధ్య పనిచేశారు. విమానమును నడుపుతున్నప్పుడు ఎన్నిసార్లు అతను ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారో అతనికి మరియు దేవునికి మాత్రమే తెలుసు. తదుపరి 1980వ సంll నుండి అతను దక్షిణ అమెరికాలో విక్లిఫ్ బైబిల్ ట్రాన్స్‌లేటర్స్ సంస్థ యొక్క కార్యక్రమానికి నాయకత్వం వహించడం ప్రారంభించి, లక్షల మంది ప్రజలకు బైబిలును అందుబాటులోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, క్రిస్మస్ యొక్క నిజమైన అర్థం ఏమిటో మీకు తెలుసా?


ప్రార్థన :

ప్రభువా, ఆచారబద్ధమైన క్రిస్మస్ నుండి నాకు విడుదల దయచేసి, నిజమైన క్రిస్మస్ యొక్క అర్థమును ఎరిగినవాడనై/ఎరిగినదాననై దేవుని ప్రేమతో నేను ప్రజలను చేరుకొనుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్! 

దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • No comments:

    Post a Comment