Search Here

Apr 7, 2022

Maharasan Vedamanickam | మహారాజన్ వేదమాణిక్కం

మహారాజన్ వేదమాణిక్కం జీవిత చరిత్ర



  • జననం : 1763
  • మరణం : 27-01-1827
  • స్వస్థలం : మయిలాడి 
  • దేశం  : భారతదేశం 
  • దర్శన స్థలము : మయిలాడి, భారతదేశం


వేదమాణిక్కం యొక్క అసలు పేరు మహారాజన్. అతను ట్రావెన్కోర్ రాజ్యానికి చెందిన మొదటి ప్రొటెస్టెంట్ క్రైస్తవుడు. ట్రావెన్కోర్‌లో ఆత్మీయ ఉజ్జీవమే గాక సామాజిక విప్లవమునకునూ మార్గదర్శకులలో ఒకరిగా అతను పరిగణించబడ్డారు. ఎంతో నిష్ఠ కలిగిన శైవ కుటుంబములో జన్మించిన అతను, సనాతన హిందూ మత పద్ధతులతో పెంచబడ్డారు. వ్యవసాయ కుటుంబమైన అతని కుటుంబం మయిలాడిలో వరి పొలాలను కలిగియుండగా, అతను కూడా తల్లిదండ్రులతో కలిసి పంట పొలాలలో పనిచేసేవారు.


ఆధ్యాత్మికమైన వ్యక్తిగా ఉండే మహారాజన్ క్రమం తప్పకుండా దేవాలయాలను సందర్శించేవారు. అయితే ఏవీ కూడా లోతైన అతని ఆత్మీయ దాహాన్ని తీర్చలేక పోయాయి. కాగా ఒకసారి అతను చిదంబరం అనే ప్రదేశాన్ని సందర్శించినప్పుడు, తన ఆధ్యాత్మిక మార్గములను సరిదిద్దుకొనుటకు ఒక దేవదూత దర్శనం ద్వారా అతను ఒప్పించబడినట్లు చెప్పబడుతుంది. ఆ స్వప్నం ద్వారా మార్గనిర్దేశం చేయబడిన అతను తంజావూరులోని తన బంధువుల యొద్దకు వెళ్ళగా, వారు అతనిని క్రైస్తవ ఆలయమునకు తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ “యేసు నొద్దకు రండి…. మీకు శాంతి లభిస్తుంది!” అని ప్రసంగిస్తున్న రెవ. కోలాఫ్ యొక్క మాటలు అతని హృదయములో బలముగా క్రియ చేశాయి. తత్ఫలితముగా అతను తన పాపములను ఒప్పుకొని, క్రీస్తును తన స్వరక్షకునిగా అంగీకరించారు. పిమ్మట అతను బాప్తిస్మం తీసుకొనగా, అతనికి 'వేదమాణిక్కం' అనే క్రైస్తవ పేరు ఇవ్వబడింది.


రక్షణానుభవంతో అతని హృదయములో సంతోషం ఉప్పొంగగా, తన స్వంత ఊరైన మయిలాడీకి తిరిగి వెళ్ళి, క్రీస్తు ప్రేమను తన స్వజనులతో పంచుకొనవలెనని వేదమాణిక్కం ఎంతగానో వాంఛించారు. అయితే మొదట అతను ట్రాంక్యుబార్ మిషన్‌కు చెందిన డాll జాన్‌తో కొంత కాలం గడుపగా, జాన్ అతనికి మిషనరీ పరిచర్యను గురించి మార్గనిర్దేశం చేశారు. చివరికి అతను తన గ్రామానికి చేరుకున్నప్పుడు అతని కుటుంబం అతని అంత్యక్రియలను జరిగించడం చూశారు. ఏలయనగా చిదంబరం వెళ్ళిన అతను తిరిగి రావడం బాగా ఆలస్యం కావడంతో అతను మరణించియుంటారని వారు తలంచారు. ఏదేమైనప్పటికీ, అతను వారికి ఆత్మీయ మరణం గురించి మరియు నిత్యజీవము యొక్క మార్గము గురించి వివరించారు. అతని సాక్ష్యం అతని కుటుంబ సభ్యులనే కాదు, ఆ గ్రామంలోని అనేకమందిని క్రీస్తు వద్దకు తీసుకువచ్చింది. రెవ. విలియం రింగెల్టాబ్‌తో అతనికున్న అనుబంధం పరిచర్యను ఫలభరితమైనదిగా చేయడంతో పాటు, మయిలాడిలో మొదటి క్రైస్తవ సంఘ స్థాపనకు దారితీసింది. 1827వ సంll లో మహిమలోకి చేర్చబడే వరకూ అతను గ్రామాలను సందర్శిస్తూ, సువార్త ప్రకటిస్తూ, ప్రార్థనా కూడికలను, క్రమం తప్పకుండా బైబిలు పఠనములను నిర్వహిస్తూ, ఎటువంటి విదేశీ మిషనరీ సహాయం లేకుండా మయిలాడి మిషన్‌ను కొనసాగిస్తూ దేవుని సేవలో ముందుకు సాగిపోయారు.


ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, మీ స్నేహితులు మరియు బంధువులు రక్షింపబడవలెనన్న భారమును మీరు కలిగియున్నారా? 


ప్రార్థన :

"ప్రభువా, నా కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రుల మధ్య మీ ప్రేమను గూర్చి ధైర్యముగా సాక్ష్యమిచ్చుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక!




  • WhatsApp
  • No comments:

    Post a Comment