Search Here

Apr 7, 2022

Amanda Smith | అమండా స్మిత్

అమండా స్మిత్  జీవిత చరిత్ర         








  • జననం : 23-01-1837
  • మరణం : 24-02-1915
  • స్వస్థలం : మేరీల్యాండ్
  • దేశం  : యునైటెడ్ స్టేట్స్
  • దర్శన స్థలము : భారతదేశం, ఇంగ్లాండు, ఆఫ్రికా


1837వ సంll లో శామ్యూల్ మరియు మిరియం బెర్రీలకు బానిసత్వంలో జన్మించారు అమండా బెర్రీ స్మిత్. కాగా, శామ్యూల్ బెర్రీ ఎంతో కష్టపడి తన కుటుంబమునకు స్వేచ్ఛను సంపాదించి, పిమ్మట పెన్సిల్వేనియాలో స్థిరపడ్డారు. ఆఫ్రికా జాతికి చెందిన అమెరికా పిల్లలకు సాధారణ పాఠశాలలో సరైన విద్యను పొందడం చాలా కష్టం. కాబట్టి అమండా ఇంటి యొద్దనే విద్యనభ్యసించారు. అయినప్పటికీ, ఆమె గొప్ప వ్యక్తిత్వం మరియు ఆత్మీయ బలం కలిగినవారై ఒక గొప్ప వక్తగా ఎదుగగలిగారు. మెథడిస్ట్ ఎపిస్కోపల్ సంఘములో ఒక ఉజ్జీవ కూడికకు హాజరైనప్పుడు, ఆమె క్రీస్తును తన స్వరక్షకునిగా అంగీకరించి, దేవుని సేవకు తనను తాను సమర్పించుకున్నారు.


చాలా చిన్న వయస్సులోనే ఆమె తన ఐదుగురు పిల్లలలో నలుగురిని అనారోగ్య కారణంగా కోల్పోయారు. ఆ అనుభవాలు ఆమెను నిరాశలోకి త్రోసివేయగా, ప్రార్థన మరియు ఉజ్జీవ కూడికల ద్వారా ఆమె ఆదరణను పొందుకున్నారు. 1869వ సంll లో తన భర్త మరణించిన తరువాత, ఆమె పూర్తిగా సంఘ కార్యకలాపాలలో మునిగిపోయారు. ప్రార్థనే తాను నడిచే జీవిత మార్గముగా మార్చుకున్న ఆమె, సువార్త సభలు మరియు క్రైస్తవ సంఘములలో బోధించుటకు తనకు వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోలేదు. శ్రావ్యముగా పాడటం మరియు శక్తివంతంగా ప్రసంగించడం ఆమె కలిగియున్న తలాంతులు. అవి ఆమెను ప్రపంచ నలుమూలలా అనేక ప్రాంతాలకు దేవుని సేవ చేయుటకు తీసుకొనివెళ్ళాయి. ఆమె ఇంగ్లాండు, ఐర్లాండు, స్కాట్లాండు, భారతదేశం మరియు ఆఫ్రికాలోని వివిధ దేశాలకు ప్రయాణించి, పరిశుద్ధ కూడికలను నిర్వహించారు. ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ, ఆమె సేవను కొనసాగించి అక్కడి క్రైస్తవ సంఘములతో కలిసి పనిచేశారు. అంతేకాకుండా, మద్యపానాన్ని నియంత్రించుటకు మద్యపానానికి వ్యతిరేకముగా పోరాడే 'టెంపరెన్స్ సొసైటీలను' స్థాపించుటలో తోడ్పాటునందించారు. పిమ్మట 1892వ సంll లో అమెరికాకు తిరిగి వచ్చిన అమండా, ఆఫ్రికా జాతికి చెందిన అమెరికావారి మధ్య దేవుని సేవను కొనసాగించారు.


ఒక అంతర్జాతీయ సువార్తికురాలిగా ఎదిగినప్పటికీ, తన జీవితమంతా దీనురాలిగానే మిగిలిపోయారు అమండా. తగు మాత్రపు వస్త్రములను ధరించి సభ్యసంస్కారాలతో కూడిన వస్త్రధారణను కలిగియుండే ఆమె, ప్రతి కోణంలోనూ ప్రభువును కనుపరచవలెనని ఇతర స్త్రీలను కూడా ప్రోత్సహించేవారు. వివక్షకు గురైన నల్లజాతి పిల్లల పట్ల ఆమె కలిగియున్న భారం "అమండా స్మిత్ ఆర్ఫన్ హోమ్ ఫర్ అబాండాన్డ్ అండ్ డెస్టిట్యూట్ కలర్డ్ చిల్డ్రన్" అనే అనాథాశ్రమ స్థాపనకు కారణమయ్యింది. 1899వ సంll లో ఇల్లినాయిస్‌లోని హార్వే నగరములో స్థాపించబడిన ఈ సంస్థ, వివక్షను అనుభవిస్తున్న పిల్లలకు ఆశ్రయం కల్పించి, వారు స్వతహాగా తమంతటతామే జీవించుటకు వారికి శిక్షణ ఇచ్చింది. 1915వ సంll లో సంస్థ యొక్క బాధ్యతల నుండి విరమించుకున్న అమండా స్మిత్, అదే సంవత్సరం తన 75 ఏళ్ళ వయసులో మహిమలో ప్రవేశించారు.


ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, మీ జీవితంలోని ప్రతి అంశంలో మీరు ప్రభువును కనుపరుస్తున్నారా?


ప్రార్థన :

"ప్రభువా, నేను నమ్రత కలిగిన మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తూ, నేను చేసే ప్రతి పనిలోనూ మీకు మహిమతెచ్చునట్లు నాకు సహాయము చేయుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • No comments:

    Post a Comment