అడోనిరామ్ జడ్సన్ గోర్డాన్ | Adoniram Judson Gordon
- జననం: 19-04-1836
- మహిమ ప్రవేశం: 02-02-1895
- స్వస్థలం: న్యూ హాంప్‌షైర్
- దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
- దర్శన స్థలము: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
అడోనిరామ్ జడ్సన్ గోర్డాన్ అమెరికాకు చెందిన బోధకుడు, రచయిత, స్వరకర్త మరియు ప్రపంచవ్యాప్తంగా పలు మిషనరీ సేవలకు కారణభూతులు. దేవునియందు భయభక్తులు గలిగిన క్రైస్తవ కుటుంబములో జన్మించిన అతనికి బర్మాలో సేవ చేసిన బాప్తిస్టు మిషనరీ అయిన అడోనిరామ్ జడ్సన్ పేరు పెట్టబడింది. పదిహేనేళ్ళ వయస్సులో తిరిగి జన్మించిన అనుభవము పొందిన గోర్డాన్, ఒక ఏడాది తరువాత క్రైస్తవ పరిచర్య కొరకు సిద్ధపడాలనే తన కోరికను ఒక సంఘ కూడికలో బహిరంగంగా తెలియపరిచారు. కాగా, బ్రౌన్ విశ్వవిద్యాలయంలో సాధారణ విద్యాభ్యాసమును పూర్తిచేసుకొనిన పిమ్మట అతను ‘న్యూటన్ థియోలాజికల్ ఇనిస్టిట్యూషన్’ లో బైబిలు వేదాంత శాస్త్రమును అభ్యసించారు. పిమ్మట అతను బోస్టన్‌కు సమీపంలోని ‘జమైకా ప్లెయిన్ బాప్టిస్ట్ చర్చి’ యొక్క పాదిరిగా నియమించబడ్డారు.
తదుపరి అతను బోస్టన్‌లోని ‘క్లారెండన్ స్ట్రీట్ బాప్టిస్ట్ చర్చి’ లో సేవ చేయుటకు వెళ్ళారు. క్లారెండన్ చర్చి సువార్త సేవ పట్ల ఏమాత్రం ఆసక్తి చూపనిదై, అద్భుతమైన గాయక బృందాలు మరియు వైభవవంతమైన విస్తృత భవన నిర్మాణాలను కలిగియుండుట పైనే దృష్టి కేంద్రీకరించేదిగా ఉంది. కావున, ప్రారంభంలో ఆ సంఘమును సరైన దిశలో నడిపించుటకు గోర్డాన్‌కు బహు కష్టతరమైంది మరియు అతను అనేక సార్లు నిరాశ చెందారు కూడా. కాగా, అతను ప్రార్థించి, బోస్టన్‌లో కూడికలను నిర్వహించుటకు డి. ఎల్. మూడీని ఆహ్వానించారు. అది క్లారెండన్ సంఘములోనే కాదు, బోస్టన్ అంతటా ఉజ్జీవపు జ్వాలలు ప్రారంభమగుటకు కారణమయ్యింది. తత్ఫలితముగా, క్లారెండన్ సంఘములో గొప్ప మార్పు కలిగి, దాని ఆసక్తి ప్రాపంచిక విషయాల పై నుండి క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించుట పైకి మరల్చబడింది. ప్రపంచవ్యాప్తంగా మిషనరీ సేవను గురించిన దర్శనము కలిగియుండి, ప్రార్థనల ద్వారాను మరియు ఆర్ధికంగాను మిషనరీ సేవను ఆదరించవలెనని గోర్డాన్ సంఘమును ప్రేరేపించారు.
డి. ఎల్. మూడీ యొక్క కూడికలలో తరచుగా ప్రసంగించేవారు గోర్డాన్. సువార్తను విస్తరింప చేయాలనే వాంఛతో అతను ప్రపంచవ్యాప్తంగా పర్యటించారు. విస్తారమైన పంటను కోయుటకు పనివారు కావలననే అంశముపైనే అతని ప్రసంగాలు ప్రధానంగా కేంద్రీకరించబడి యుండేవి. తన ప్రసంగం చివరిలో అతను ఇచ్చే పిలుపుకు వందలాది మంది యవ్వనస్థులు స్పందించేవారు. కావున, ఈ భవిష్యత్ మిషనరీలకు శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంతో 1889వ సంll లో అతను “బోస్టన్ మిషనరీ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్” ను (బోస్టన్ మిషనరీ శిక్షణా సంస్థ) స్థాపించారు. తరువాత అది ‘గోర్డాన్ కళాశాల’ గా మారింది. ఈ కళాశాల అనేక దేశాలలో పరిచర్య చేసిన మరియు చేస్తున్న వేలాదిమంది దైవసేవకులను ముందుకు తీసుకువచ్చింది.
గోర్డాన్ కేవలం బోధకులు మాత్రమే కాదు, అద్భుతమైన రచయిత మరియు స్వరకర్త కూడా. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ఎంతో తీవ్రముగా పరిచర్య చేస్తున్నప్పటికీ, 1895వ సంll లో తాను మహిమలోకి పిలువబడే వరకు కూడా ఎంతో సహనముతో క్లారెండన్ సంఘములోని తన మందను కాచారు అడోనిరామ్ జడ్సన్ గోర్డాన్.
🚸 *ప్రియమైనవారలారా, మీ ఆసక్తి దేనియందు ఉన్నది? అద్భుతమైన గాయక బృందాలు మరియు వైభవవంతమైన విస్తృత భవన నిర్మాణాల యందునా లేదా ఆత్మలను సంపాదించుటలోనా?* 🚸
🛐 *"ప్రభువా, భౌతిక విషయాల పై కాక, ఆత్మీయ విషయాలపై నేను దృష్టి నిలుపుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"* 🛐
*******
🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏
No comments:
Post a Comment