పీటర్ జాన్సన్ గులిక్ || Peter Johnson Gulick
- జననం: 12-03-1796
- మహిమ ప్రవేశం: 08-12-1877
- స్వస్థలం: న్యూజెర్సీ
- దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
- దర్శన స్థలము: హవాయి దీవులు మరియు జపాన్
అమెరికా ప్రొటెస్టంట్ సంఘము యొక్క విదేశీ మిషనరీ పరిచర్యలలో ‘గులిక్’ బాగా పేరుగాంచిన ఇంటి పేరు. ఆ వంశపువారు చాలామంది హవాయి, స్పెయిన్ మరియు జపాన్ వంటి విభిన్న ప్రదేశాలకు వెళ్ళి సేవచేశారు. గులిక్ వంశములో అటువంటి గొప్ప పారంపర్య మిషనరీ పరిచర్య ప్రారంభమునకు మూలపురుషుడు పీటర్ జాన్సన్ గులిక్. 20 సంll ల వయస్సులో ప్రభువును అంగీకరించిన తరువాత పీటర్ విదేశాలలో దేవుని రాజ్యమును విస్తరింపజేయుటకు తన జీవితమును సమర్పించుకున్నారు.
1827వ సంll లో ప్రిన్స్‌టన్ థియోలాజికల్ సెమినరీ నుండి బైబిలు వేదాంత శాస్త్రములో పట్టభద్రులైన పీటర్, పిమ్మట ‘అమెరికన్ బోర్డ్ ఆఫ్ కమిషనర్స్ ఫర్ ఫారిన్ మిషన్స్’ (ఎ.బి.సి.ఎఫ్.ఎమ్.) అనే మిషనరీ సంస్థలో చేరారు. ఒక నెల తరువాత సేవ చేయుటకు నియామక అభిషేకం పొందిన అతను, తన భార్య ఫాన్నీతో కలిసి బోస్టన్ నుండి శాండ్విచ్ దీవులకు (హవాయి దీవులకు) సముద్ర మార్గము గుండా పయనమయ్యారు. తరువాతి పదిహేను సంవత్సరాలు అతను కౌవై ద్వీపంలో నివసించారు. ఆత్మలను నమ్మే అక్కడి ద్వీపవాసులు దాదాపు ప్రతిదానికీ ఆత్మలపైనే ఆధారపడేవారు. వారు చనిపోయిన హవాయి యోధులను పూజించేవారు మరియు సహాయం కొరకు వారి ఆత్మలను పిలిచేవారు. అందువలన, ముందుగా వారి సామాజిక స్థితిని మెరుగుపరచవలెనని ఆ మిషనరీ దంపతులు వెంటనే స్థానికులకు విద్యను అందించడంపై దృష్టి నిలిపారు. ఫాన్నీ ఆ ద్వీపంలో మొదటి పాఠశాలను ప్రారంభించారు. సాధారణ విద్యాభ్యాసముతో పాటు, ఫాన్నీ మహిళలకు కుట్టుపని మరియు టోపీలు ఎలా చేయాలో నేర్పించగా, పీటర్ పురుషులకు నాగళ్లు మరియు చక్రాల వాహనాలను ఎలా ఉపయోగించాలో నేర్పించారు. పిమ్మట ఆ దంపతులు మోలోకై మరియు ఓహుకు వెళ్ళారు. వారు ఎక్కడికి వెళ్ళినా అక్కడ పాఠశాలలను స్థాపించారు, క్రైస్తవ ప్రేమతో సమాజాన్ని మార్చారు మరియు అన్నింటికంటే పైగా క్రీస్తు కొరకు అనేక ఆత్మలను సంపాదించారు.
గులిక్ మరియు అతని భార్య ఇద్దరూ ఎల్లప్పుడూ అనారోగ్యంతో బాధపడేవారు. ఒక వైపు సమస్యలు ఉన్నప్పటికీ వారు వెనుకంజ వేయక ముందుకు సాగిపోయారు. ఆ నమ్మకమైన మిషనరీలను దేవుడు 1836-37సంll ల కాలంలో హవాయి దీవులలో నెలకొన్న గొప్ప ఆత్మీయ ఉజ్జీవములో పాలిభాగస్థులను చేశాడు. పీటర్ మరియు ఫాన్నీ గులిక్‌లు హోనోలులులో తమ జీవితకాలమును గడపాలని తలంచినప్పటికీ, వారి ఆరోగ్య స్థితి అందుకు సహకరించలేదు. కాగా, 1874వ సంll లో వారు అప్పటికే జపాన్‌లో సేవ చేస్తున్న తమ కుమారుని యొద్దకు వెళ్ళవలసి వచ్చింది. ఎనిమిది మంది దైవభక్తిగల పిల్లలను పెంచి, చివరి వరకూ ప్రభువుకు నమ్మకముగా సేవ చేసిన పీటర్, 1877వ సంll లో పరమందు తన ప్రభువును చేరుకొనుటకు ఇహలోకమును విడిచివెళ్ళారు. యెహోషువ 24:15లో యెహోషువ చెప్పినట్లు “నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము” అనే వాక్యమునకు అనుగుణంగా జీవించారు పీటర్ జాన్సన్ గులిక్.
ప్రియమైనవారలారా, మీరు మీ కుటుంబముతో పాటుగా దేవునికి సేవ చేయుచున్నారా?
"ప్రభువా, నేను మాదిరికరమైన పరిచర్య చేయుటకును, నా కుటుంబ సభ్యులు కూడా ఆ అడుగుజాడలలో నడుచునట్లు వారిని ప్రోత్సహించుటకును నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"
దేవునికే మహిమ కలుగునుగాక
*******
No comments:
Post a Comment