ఫ్రెడరిక్ బూత్-టక్కర్ | Frederick Booth-Tucker
- జననం: 21-03-1853
- మహిమ ప్రవేశం: 17-07-1929
- స్వదేశం: యునైటెడ్ కింగ్‌డమ్
- దర్శన స్థలము: భారతదేశం
ఫ్రెడరిక్ బూత్-టక్కర్ భారతదేశంలో జన్మించారు. అక్కడ అతని తండ్రి విలియం థోర్న్‌హిల్ టక్కర్ ‘భారత పౌర సేవలు’ (ఇండియన్ సివిల్ సర్వీస్ -ఐ.సి.ఎస్.) లో డిప్యూటీ కమిషనర్‌గా ఉన్నారు. ఫ్రెడరిక్ ఒక క్రైస్తవ కుటుంబములో జన్మించినప్పటికీ, అతనిలో ఆత్మీయ సంబంధమైన లోతైన మార్పు 1875వ సంll లో డి. ఎల్. మూడీ మరియు సాంకీ యొక్క లండన్ మహాసభల మూలముగా కలిగింది. ఇంగ్లాండులో తన విద్యాభ్యాసమును పూర్తి చేసుకొనిన పిమ్మట అతను కూడా ఐ.సి.ఎస్.లో అసిస్టెంట్ కమిషనర్‌గా చేరారు.
ఐ.సి.ఎస్.లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఫ్రెడరిక్ కేవలం తన సహోద్యోగుల మధ్య సువార్త ప్రకటించడమే కాదు, తన పై అధికారులు మందలించినప్పటికీ భారతీయులకు కూడా సువార్త చెప్పేవారు. భారతదేశంలో అప్పుడు ఉన్న మిషనరీ కార్యకలాపాలు మరియు క్రైస్తవ మతం యొక్క పురోగతి అతనికి అసంతృప్తికరంగా ఉన్నాయి. కాగా, లండన్‌లో 'రక్షణ సైన్యం' ('సాల్వేషన్ ఆర్మీ') యొక్క కార్యకలాపాల గురించి తెలుసుకొనిన ఫ్రెడరిక్, సాల్వేషన్ ఆర్మీ యొక్క వ్యవస్థాపకుడైన విలియం బూత్‌ను కలవడానికి ఇంగ్లాండుకు వెళ్ళారు.
అతను తన ఉన్నత సామాజిక హోదాను వదిలి సాల్వేషన్ ఆర్మీలో చేరుటను అతని కుటుంబం వ్యతిరేకించింది. మరోవైపు, అతని సమర్పణ ఎంత వరకు అని చూచుటకు విలియం బూత్ అతని విషయములో తన నిర్ణయమును ఆలస్యం చేశారు. ఏదేమైనప్పటికీ, వెనుకంజవేయని ఈ దేవుని సేవకుడు చివరకు 1882వ సంll లో సాల్వేషన్ ఆర్మీ తరపున భారతదేశానికి వచ్చారు. భారతదేశంలో కుల వ్యవస్థ ప్రధాన అడ్డంకియని గ్రహించిన ఫ్రెడరిక్, మొదట అట్టడుగు వర్గాల ప్రజలను చేరుకొనవలెనని నిశ్చయించుకున్నారు. అందుకుగాను అతను తన పరిచర్యలో స్థానిక సంస్కృతిని మరియు సంగీతమును మిళితం చేశారు. తాను కూడా కాషాయ వస్త్రాలను ధరించి, 'ఫకీర్ సింగ్' అని పేరు మార్చుకున్నారు. అదే సమయంలో, అతను ఉన్నత వర్గాలకు చెందిన భారతీయులతో కూడా సత్సంబంధాలను కలిగియుండుటకు ప్రయత్నించారు. సమానత్వం మరియు రక్షణ గురించిన ఫ్రెడరిక్ యొక్క బోధన క్రీస్తు కొరకు అనేక ఆత్మలను గెలుచుకుంది.
అతని భార్యయైన ఎమ్మా అనారోగ్యం పాలవడంతో 1891వ సంll లో బూత్-టక్కర్ లండన్‌కు తిరిగి వెళ్ళారు. తరువాత, వారు అమెరికాకు వెళ్ళి, అమెరికాలోని సాల్వేషన్ ఆర్మీని పునరుజ్జీవింపజేశారు. 1907వ సంll లో అతను తిరిగి భారతదేశం మరియు సిలోన్‌లలోని పరిచర్య యొక్క బాధ్యతలను చేపట్టుటకు నియమించబడ్డారు. కాగా 1919వ సంll లో ఇంగ్లాండుకు తిరిగి వెళ్ళే వరకు కూడా భారతదేశంలోని నేర వృత్తి కలిగిన తెగల మధ్య పరిచర్య చేశారు బూత్-టక్కర్.
1924వ సంll లో అతను సాల్వేషన్ ఆర్మీలో తన సేవ నుండి పదవీ విరమణ పొందినప్పటికీ, ఐరోపాలో సభలను నిర్వహిస్తూ దేవుని సేవను కొనసాగించారు. అతను అనేక పాటలను మరియు పుస్తకాలను కూడా వ్రాశారు. భారతదేశంలో సాల్వేషన్ ఆర్మీ స్థాపించబడుటకు కారణభూతుడుగా ఉన్న ఈ అలుపెరుగని దైవజనుడు, 1929వ సంll లో తన పరలోకపు వాస స్థలమును చేరుకొనుటకు ఇహలోకము విడిచి వెళ్ళారు.
ప్రియమైనవారలారా, మీ దేవుని సేవించుటకుగాను సౌకర్యవంతమైన జీవితమును విడిచిపెట్టుటకు మీరు సిద్ధముగా ఉన్నారా?
ప్రభువా, మీ నిమిత్తము నేను సమస్తమును నష్టముగా ఎంచుకొనుటకు నాకు కృపననుగ్రహించుము. ఆమేన్!
🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏
*******
No comments:
Post a Comment