Search Here

Aug 20, 2021

Samuel Henry Kellogg | శామ్యూల్ హెన్రీ కెల్లోగ్

 శామ్యూల్ హెన్రీ కెల్లోగ్ |  Samuel Henry Kellogg


  • జననం: 06-09-1839
  • మహిమ ప్రవేశం: 03-05-1899
  • స్వస్థలం: న్యూయార్క్
  • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  • దర్శన స్థలము: భారతదేశం


బాల్యం నుండి కూడా లేఖనములను పఠించుటలో శ్రద్ధగలిగిన విద్యార్థిగా ఉన్నారు శామ్యూల్ కెల్లోగ్. అతను తన విద్యార్ధి దశలో క్రీస్తు తనకు ఏమైయున్నాడో వివరిస్తూ “ఎ లివింగ్ క్రైస్ట్” (ఒక జీవించుచున్న క్రీస్తు) అనే పేరుతో ఒక కరపత్రమును ప్రచురించారు. మిషనరీ ప్రచురణలను చదువుటలోనే అతను ఎక్కువ సమయమును గడిపేవారు. అది మిషనరీ పనిని అతని ఉపాధిగా ఎంచుకోవాలనే ఆలోచనలను అతనిలో కలిగించింది. 1861వ సంll లో ప్రిన్స్‌టన్ కాలేజీ నుండి పట్టభద్రులైన తరువాత అతను భారతదేశంలో తన మిషనరీ అనుభవం గురించి మరియు మిషనరీల కొరకు అక్కడ ఎంతగానో ఉన్న అవసరత గురించి రెవ. హెన్రీ ఎం. స్కడ్డర్ మాట్లాడటం విన్నారు. స్కడ్డర్ యొక్క సాక్ష్యంతో ఎంతగానో కదిలింపబడిన కెల్లోగ్ కూడా భారతీయ ప్రజలకు సేవ చేయుటకు తనను తాను సమర్పించుకున్నారు. 


భారతదేశానికి మిషనరీగా నియమితులైన తరువాత తన భార్యతో కలిసి 1864వ సంll లో భారతదేశానికి పయనమయ్యారు కెల్లోగ్. అక్కడ సేవ చేసేవారి కొరత కారణంగా త్వరలోనే కలకత్తాలోని ఫరూఖాబాద్ మిషన్ పని యొక్క పూర్తి బాధ్యతలు అతనికి అప్పగింపబడ్డాయి. హిందీ భాషపై పట్టు సాధించిన అతను, త్వరలోనే స్థానిక ప్రజల కొరకు హిందీలోనే ఆదివారపు ఆరాధనా సేవలను నిర్వహించడం ప్రారంభించారు. సువార్తను ప్రకటించడం అతని మొదటి ప్రాధాన్యత. కాగా అతను అలయక నగరంలోనూ నగర పరిసర ప్రాంతములలోనూ  సువార్తను ప్రకటించారు. అయితే, అతని అనారోగ్యం మరియు అతని భార్య మరణం వలన అతను అమెరికాకు తిరిగి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ అతను ‘ప్రెస్బిటేరియన్ చర్చ్ ఆఫ్ కెనడా’ అనే సంఘములో చురుకుగా సేవలందించారు మరియు అల్లెఘేనీలోని బైబిలు వేదాంత కళాశాలలో కూడా బోధించారు.


ఆ సమయంలోనే హిందీభాషలో అతనికున్న ప్రావీణ్యమును బట్టియు మరియు లోతైన లేఖన పరిజ్ఞానమును బట్టియు హిందీ బైబిలును తిరిగి అనువదించుటకు భారతదేశం నుండి అతనికి పిలుపు వచ్చింది. భారతదేశంలో తాను ఇంకా నెరవేర్చవలసిన పని ఉన్నదని ఎరిగియున్న కెల్లోగ్ 1892వ సంll లో అహ్మదాబాద్ చేరుకున్నారు. అతను విలియం హూపర్ మరియు జోసెఫ్ ఆర్థర్ లాంబెర్ట్‌లతో కలిసి 1899వ సంll వరకు హిందీ బైబిలును సవరించారు. త్వరలో తాను భారతదేశాన్ని విడిచిపెట్టవలసి వస్తుందని ఊహించిన కెల్లోగ్, దేశంలోని అనేక ప్రాంతాలకు ప్రయాణించి స్థానిక క్రైస్తవ సంఘములను ఎంతో ఉత్సాహంగా ప్రోత్సహించారు. అతను "వారికను చావనేరరు" (లూకా 20:36) అనే వచనముపై ముస్సోరీలో తన చివరి ప్రసంగమును ఇచ్చారు. ఆ మరుసటి వారమే నిత్యమూ ప్రభు సన్నిధానములో జీవించుటకు ఈ లోకము విడిచి వెళ్ళారు శామ్యూల్ హెన్రీ కెల్లోగ్. సంవత్సరాలను బట్టి లెక్కించినట్లయితే ఈ భూమిపై అతని జీవించిన కాలం సుదీర్ఘమైనది కాదు. అయితే, అతను జీవించిన ఆ కొద్ది జీవితమే ఎంతో అద్భుతరీతిలో ఫలవంతమైనదిగా ఉన్నది.


🚸 ప్రియమైనవారలారా, మీకు అప్పగింపబడిన పరిచర్యను మీరు సంపూర్ణముగా నెరవేర్చుచున్నారా? 🚸


🛐 "ప్రభువా, నేను బాధ్యత వహించిన పరిచర్యను సంపూర్తి చేయుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!" 🛐

🙏🙏 దేవునికే మహిమ కలుగునుగాక! 🙏🙏

  • WhatsApp
  • No comments:

    Post a Comment