శామ్యూల్ ఆటన్ | Samuel Oughton
- జననం: 1803
- మహిమ ప్రవేశం: 1881
- స్వస్థలం: యునైటెడ్ కింగ్‌డమ్
- దర్శన స్థలము: జమైకా
శామ్యూల్ ఆటన్ జమైకాలో సేవ చేసిన ఒక బాప్తిస్టు మిషనరీ. మొదట లండన్‌లోని ఇండిపెండెంట్ కాన్గ్రిగేషనల్ సర్రే చాపెల్‌లో సేవలందించిన అతను 1836వ సంll లో మిషనరీగా జమైకాకు వచ్చారు. 1839వ సంll నుండి అతను కింగ్‌స్టన్‌లోని ఈస్ట్ క్వీన్ స్ట్రీట్ చాపెల్‌లో పాదిరిగా పనిచేశారు. ఆ చాపెల్‌లో అధికభాగం ఆఫ్రికన్లు ఉండేవారు.
జమైకాలో బానిసత్వాన్ని చట్టబద్ధంగా రద్దు చేసిన తర్వాత కూడా ఆఫ్రికన్లకు అక్కడి పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. అప్పటికి కూడా వారు బానిసలుగా చేయబడేవారు మరియు తరచూ వేధింపులకు గురయ్యేవారు. ఆఫ్రికన్లకు మద్దతుగా ధైర్యంగా నిలబడిన కొద్దిమంది మిషనరీలలో ఆటన్ ఒకరు. ఒక క్రైస్తవునిగా మానవులందరు సమానమేనని విశ్వసించే అతను, ఇతరులకు కూడా సమానత్వముతో ఉండాలని సూచించేవారు. అతను నల్లజాతి కార్మికుల హక్కుల గురించి ముక్కుసూటిగా మాట్లాడేవారు మరియు ఆఫ్రికా మహిళలపై అధికారుల దుశ్చర్యలను తీవ్రంగా ఖండించేవారు. దాని ఫలితంగా 1840వ సంll లో జైలు శిక్షను కూడా అనుభవించారు. దేవుని దయ వలన అక్కడి నుండి విడుదల చేయబడిన తరువాత అతను నూతన నిరీక్షణతో తన సంఘమునకు తిరిగి వచ్చి, మరింత ఉత్సుకతతో పరిచర్య చేయడం ప్రారంభించారు.
తరువాతి ఇరవై సంవత్సరాలు ఈస్టర్ క్వీన్ స్ట్రీట్ చాపెల్‌లో పాదిరిగా సేవలందించిన ఆటన్, ఆ సమయంలో క్రైస్తవ సంఘములో సమానత్వమును నెలకొల్పుటకు అనేక సంస్కరణలు చేశారు. అతను మాజీ బానిసలు మరియు మాజీ యజమానులు అందరికీ వర్తించే నైతిక నియమావళిని అభివృద్ధి పరిచారు. సమాజములోను మరియు క్రైస్తవ సంఘములోను కొంత భాగం అతనిని ద్వేషించినప్పటికీ అతను తన నైతిక ప్రమాణాలకు కట్టుబడి ఉన్నారు. మాజీ బానిసలు తాము పొందిన స్వేచ్ఛను శారీరక క్రియల కొరకు వినియోగించక ఒకరికొకరు పరిచర్య చేసుకొనుటకు మాత్రమే ఉపయోగించాలని అతను వారికి గుర్తు చేసేవారు.
జమైకాలో ఉన్నప్పుడు అతను బానిసల విడుదల కొరకు మరియు సంఘ సంస్కరణ కొరకు మాత్రమే పనిచేయలేదు, రాజకీయ మరియు సామాజిక విషయాలలో మహిళల యొక్క ప్రమేయాన్ని ప్రోత్సహించడంలో కూడా అతను భాగస్థులయ్యారు. మహిళా విద్యను బలముగా ప్రోత్సహించిన అతను, బానిసత్వాన్ని పూర్తిగా అధిగమించుటకుగాను సమాజంలో విద్యా వ్యవస్థను పటిష్ఠం చేయాలని నొక్కి చెప్పారు.
మిషనరీగా దేవునికి నమ్మకముగా సేవ చేసిన శామ్యూల్ ఆటన్ 1881వ సంll లో పరమందు తన ప్రభువును చేరుకొన ఇహలోకము విడిచి వెళ్ళారు.
🚸 ప్రియమైనవారలారా, నిజమైన క్రైస్తవునిగా మీరు అణగారినవారి న్యాయం కొరకు కృషి చేయుచున్నారా? 🚸
🛐 "ప్రభువా, శారీరక క్రియల నుండి నన్ను రక్షించి, నేను కలిగియున్న స్వేచ్ఛను ఇతరులకు పరిచర్య చేయుటకు నేను వినియోగించునట్లు నాకు సహాయము చేయుము. ఆమేన్!" 🛐
🙏🙏 దేవునికే మహిమ కలుగునుగాక! 🙏🙏
No comments:
Post a Comment