పల్లవి : యెహోవా నా బలమా
యధార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం
1. నా శత్రువులు నను చుట్టినను
నరకపు పాశములరికట్టినను
వరదవలె భక్తిహీనులు పొర్లిన
విడువక నను యెడబాయని దేవా || యెహావా ||
2. శమరణపుటురులలో మరువక మొరలిడ
ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై
తన ఆలయములో నా మొర వినెను
అదిరెను ధరణి భయకంపముచే || యెహావా ||
3. పౌరుషముగల ప్రభు కోపింపగా
పర్వతముల పునాదులు వణికెను
తననోటనుండి వచ్చిన యగ్ని
దహించి వేసెను వైరులనెల్ల || యెహావా ||
4. మేఘములపై ఆయన వచ్చును
మేఘములను తన మాటుగ జేయును
ఉరుముల మెరుపుల మెండుగ జేసి
అపజయ మిచ్చును అపవాదికిని || యెహావా ||
5. దయగల వారిపై దయ చూపించును
కఠినుల యెడల వికటము జూపును
గర్విష్టుల యొక్క గర్వము నణచును
సర్వము నెరిగిన సర్వాధికారి || యెహావా ||
6. నా దీపమును వెలిగించు వాడు
నా చీకటిని వెలుగుగా జేయును
జలరాసుల నుండి బలమైన చేతితో
వెలుపల జేర్చిన బలమైన దేవుడు || యెహావా ||
7. నా కాళ్ళను లేడి కాళ్ళగా జేసి
ఎత్తయిన స్థలముల శక్తితో నిలిపి
రక్షణ కేడెము నా కందించి
అక్షయముగ తన పక్షము జేర్చిన || యెహావా ||
8. యెహోవా జీవముగల దేవా
బహుగా స్తుతులకు అర్హుడ వీవు
అన్యజనులలో ధన్యత జూపుచు
హల్లెలూయ స్తుతిగానము జేసెద || యెహావా ||
No comments:
Post a Comment