ఐయాన్ కీత్-ఫాల్కనర్ | Ion Keith-Falconer
- జననం: 05-07-1856
- మహిమ ప్రవేశం: 07-06-1887
- స్వదేశం: స్కాట్లాండు
- దర్శనము: ఇంగ్లాండు; యెమెన్
“యౌవనకాలమున కాడి మోయుట నరునికి మేలు.” (విలాపవాక్యములు 3:27) అనేది ఐయాన్ కీత్-ఫాల్కనర్‌ని ప్రభావితం చేసిన ఒక వచనం మరియు అది అతని జీవితములో కూడా స్పష్టముగా ప్రతిబింబిస్తుంది. సంపన్నమైన ఒక గొప్ప కుటుంబములో జన్మించిన ఐయాన్ ఆదేశిస్తే చాలు, కావలసినవన్నీ అతనికి సమకూర్చబడేవి. అయినప్పటికీ, తన యవ్వనంలో క్రీస్తు కాడిని మోయుటకు అతను ఎంచుకున్నారు.
ఐయాన్ మంచి ఆటగాడు మరియు సైకిల్ పోటీలలో గొప్ప విజేతగా నిలిచినవారు. అంతేకాదు, చదువులో కూడా అత్యుత్తమ విద్యార్థిగా ఉన్న అతను గ్రీకు, హెబ్రీ వంటి ఐదు భాషలలో నిష్ణాతులు. కళాశాల చదువు పూర్తయిన వెంటనే అతను 1873వ సంll లో క్లేర్ కాలేజీలో పురాతన భాషలైన సెమిటిక్ భాషలను బోధించేవానిగా నియమించబడ్డారు. కానీ, అతని జ్ఞానం, కీర్తి మరియు సంపద ఏదీకూడా దేవునికి సేవ చేయాలని అతని హృదయాంతరంగాలలో ఉన్న కోరికను అణచివేయలేకపోయాయి.
కళాశాలలో పని చేస్తున్న సమయంలోనే అతను కేంబ్రిడ్జ్ మురికివాడలలో సువార్త సేవ చేయడం ప్రారంభించారు. అతను మురికివాడలలో నివసించే వారి కొరకు బైబిలు తరగతులను మరియు ఆదివారపు బైబిలు పాఠశాలను (సండే స్కూల్) నిర్వహించారు. తీవ్రతతో కూడుకొనియుండే అతని ప్రసంగాలు దొంగలు మరియు హంతకుల వంటి అనేకమంది దుర్మార్గుల హృదయాలను కూడా మార్చివేశాయి. అంతేకాకుండా, తన స్వంత ధనముతో మురికివాడలలోని పిల్లల కొరకు ఒక ‘ర్యాగ్డ్ స్కూల్’ ను (పేద పిల్లల కొరకు ఏర్పాటుచేసే ప్రాథమిక పాఠశాల) కూడా స్థాపించారు ఐయాన్. అదే సమయంలో, సైక్లింగ్‌పై కూడా తన ఆసక్తిని కోల్పోని అతను, 1878వ సంll లో ప్రపంచ సైకిల్ పోటీలలో విజేతగా నిలిచారు.
ఉపాధ్యాయుడిగా వృత్తిని కొనసాగిస్తున్నప్పుడు, తాను ముస్లింలకు సువార్త చెప్పలేకపోవడం అతనికి అరబిక్ భాషపై ఆసక్తిని రేకెత్తించింది. సహజముగానే భాషావేత్త అయిన ఐయాన్, 1881వ సంll లో అరబిక్ భాషను నేర్చుకొనుటకుగాను ఈజిప్టుకు వెళ్ళారు. అక్కడ అతను ముస్లింల మధ్యలో సేవ చేస్తున్న స్కాట్లాండుకు చెందిన మిషనరీయైన జాన్ హాగ్‌ను కలవడం జరిగింది. యెమెన్‌లో క్రైస్తవ మతమునకు మారిన యవ్వనస్థులు ఇస్లాం మతానికి తిరిగి వెళుతున్నారని అక్కడ అతను విన్నారు. కాగా, జాన్ హాగ్ ప్రోత్సాహంతో ఐయాన్ యెమెన్‌లోని ముస్లింల మధ్య పరిచర్య చేసి, క్రీస్తులో వారిని స్థిరపరచుటకు తనను తాను సమర్పించుకున్నారు.
తన భార్యతో కలిసి 1885వ సంll లో యెమెన్‌లోని ఏడెన్‌లో ఆరు నెలలు పర్యటించి, వ్యక్తిగతముగా ప్రజలను సంధించి సువార్తను ప్రకటించారు ఐయాన్. అతను 1886వ సంll లో తిరిగి వచ్చి, యెమెన్ అంతటా సువార్త ప్రచారాల కొరకు ఒక రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేశారు. శ్రద్ధాసక్తులు కలిగిన ఈ బోధకుడు సువార్త ప్రకటనలోను, ఏడెన్‌లో మిషన్ కేంద్రమును నిర్మించుటలోను పూర్తిగా నిమగ్నమవ్వగా, పలుమార్లు మలేరియా బారినపడి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. జ్వరాలతో బాధింపబడి చివరికి 1887వ సంll జూన్ మాసం 7వ తారీఖున నిద్రించుచున్న సమయంలో పరమ విశ్రాంతిలోకి ప్రవేశించారు ఐయాన్ కీత్-ఫాల్కనర్.
ప్రియమైనవారలారా, మీ జ్ఞానము మరియు కీర్తిసంపదలు క్రీస్తు పట్ల మీ తీర్మానమును అణచివేయునట్లు మీరు అనుమతిస్తున్నారా?
"ప్రభువా, మీ కాడిని మోసి, మీ యొద్ద నేర్చుకొనుటకు నేను సిద్ధముగా ఉన్నాను. ఆమేన్!"
దేవునికే మహిమ కలుగునుగాక!
No comments:
Post a Comment