థియోడర్ మాక్స్వెల్ | Theodore Maxwell
- జననం: 1847
- మహిమ ప్రవేశం: 13-02-1914
- స్వదేశం: ఇంగ్లాండు
- దర్శన స్థలము: జమ్మూ మరియు కాశ్మీర్, భారతదేశం
స్కాట్లాండుకు చెందిన వైద్య మిషనరీ అయిన డాll విలియం ఎల్మ్ స్లీ ప్రారంభించిన కాశ్మీర్ మిషన్ హాస్పిటల్ యొక్క కార్యకలాపాలు అతని మరణం తరువాత నిలిచిపోయాయి. సవాలుగా నిలిచే కాశ్మీర్ యొక్క భౌగోళిక పరిస్థితులు మరియు అక్కడ క్రైస్తవ మిషనరీలు ఎదుర్కొనే శ్రమల కారణంగా ఎల్మ్ స్లీ స్థానంలో మరొక మిషనరీని నియమించడం చర్చి మిషనరీ సొసైటీకి చాలా కష్టమైంది. అయితే ఆ సంస్థ వారు తమ అభ్యర్థనకు ఆసక్తిగా ప్రతిస్పందించిన ఒక యవ్వన వైద్య మిషనరీని పొందగలిగారు. అతనే డాll థియోడర్ మాక్స్‌వెల్.
దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక క్రైస్తవ కుటుంబములో జన్మించారు థియోడర్. ఉన్నత విద్యావంతులైన అతను, సైన్స్, ఆర్ట్స్ మరియు వైద్య రంగాలలో పట్టాలను కలిగియున్నారు. తాను ఇంగ్లాండులో వైద్యునిగా పనిచేస్తున్న సమయంలో అతనికి వైద్య మిషనరీ సేవ పట్ల ఆసక్తి కలిగింది. తన మేనమామ ఢిల్లీలో యుద్ధంలో మరణించినప్పటికీ, భారతదేశానికి వెళ్ళి సేవ చేయుటకు అతను ఏ మాత్రం సంకోచించలేదు. అతను 1873వ సంll చివరిలో ఎలిజబెత్ ఐర్ ఆష్లీని వివాహం చేసుకుని, 1874వ సంll ప్రారంభంలో కాశ్మీర్‌కు పయనమయ్యారు.
దాదాపు రెండు సంవత్సరాల పాటు నిలిచిపోయిన కాశ్మీర్‌లోని వైద్య మిషన్‌ను పునఃప్రారంభించారు మాక్స్‌వెల్. 1874వ సంll మే మాసములో అక్కడ ఒక చిన్న వైద్యశాలను ప్రారంభించిన అతను, ప్రతిరోజూ వందలాది మంది స్థానిక ప్రజలకు చికిత్స అందించేవారు. మంచి ప్రవర్తన మరియు అపారమైన వైద్య సేవలతో అతను ఒకప్పుడు ఎల్మ్ స్లీని హింసించిన అదే మహారాజు యొక్క దయను పొందగలిగారు. కాగా, ఆ మహారాజు ద్రుగ్జన్‌లో ఆసుపత్రిని నిర్మించుటకు అతనికి స్థలమును మరియు అందుకు అవసరమైన ధనమును కూడా ఇచ్చారు.
దేవుని నడిపింపు ద్వారా, ప్రార్ధనాపూర్వకముగా కాశ్మీర్ మిషన్ ఆసుపత్రిని ప్రజల సంక్షేమం కొరకు అంకితం చేశారు మాక్స్వెల్. అతను తన శక్తికి మించి రెండేళ్ళ పాటు కాశ్మీర్ ప్రజల మధ్య జ్ఞానముతోను, సాత్వికముతోను సేవ చేశారు. మహారాజుతో అతను కలిగియున్న సత్సంబంధాలు కాశ్మీర్‌లో పరిచర్య చేయుటకు ఇతర మిషనరీలకు కూడా మార్గము తెరిచాయి. దేనికీ తగనివారుగా పరిగణించబడే స్థానిక వైద్యులను పాశ్చాత్య వైద్య సేవలను ఉపయోగించేవారిగా తీర్చిదిద్దడంలో అతను కీలకపాత్ర పోషించారు. ఎంతో గ్రహింపు, వివేచన కలిగిన తత్వముతో అతను వైద్య సేవను సువార్తను వ్యాపింపజేసేందుకు ఒక మాధ్యమముగా ఉపయోగించారు.
ఆ రెండు సంవత్సరాల పరిచర్య అతని ఆరోగ్యంపై తీవ్ర ప్రభావమును చూపగా, అతను ఇంగ్లాండుకు తిరిగి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ కూడా తన వైద్య జ్ఞానమును ఉపయోగించి, తన చివరి శ్వాస వరకు కూడా దేవునికి మరియు మానవాళికి సేవ చేయుటను కొనసాగించారు థియోడర్ మాక్స్వెల్.
ప్రియమైనవారలారా, మీ మంచి ప్రవర్తన సువార్తకు ఎంతో ప్రభావము గలిగిన ద్వారం కాగలదని మీరు ఎరిగియున్నారా?
ప్రభువా, క్రీస్తు సువార్తకు తగిన రీతిలో నా ప్రవర్తనను దిద్దుకొనుటకు నాకు సహాయము చేయుము. ఆమేన్!
దేవునికే మహిమ కలుగునుగాక!
No comments:
Post a Comment