Search Here

Nov 16, 2021

Aune Emily Hyny | ఔన్ ఎమిలీ హైనీ

ఔన్ ఎమిలీ హైనీ గారి జీవిత చరిత్ర







  • జననం: 19-05-1914
  • మహిమ ప్రవేశం: 28-05-2004
  • స్వదేశం: నెదర్లాండ్స్
  • దర్శన స్థలము: మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం

 ఔన్ ఎమిలీ హైనీ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మచిలీపట్నంలో చేసిన నిస్వార్థ పరిచర్యకు ప్రసిద్ధి చెందిన ఒక డచ్ మిషనరీ. తాను ఒక క్రైస్తవురాలే అయినప్పటికీ ఎమిలీ తన యవ్వన దశలో దేవుని యెడల భయభక్తులు లేనివారిగా ఉన్నారు. వృత్తిరీత్యా నర్సు అయిన ఆమె, శిక్షణ పొందిన క్రీడాకారిణి మరియు ప్రతిభావంతురాలైన పియానో వాయిద్యకారిణి కూడా. ఆమె సంపాదించిన కీర్తి అంతటి వలన దేవుని కొరకు ఆమెకు సమయం లేకపోయింది.

 ఒకసారి ఆమె స్నేహితురాలు ఆమెను పుహజార్వ్‌లో సాల్వేషన్ ఆర్మీ (రక్షణ సైన్యం) యొక్క కూడికకు తీసుకెళ్ళారు. అక్కడ ఒక స్త్రీ నీవు తిరిగి జన్మించావా అని ఎమిలీని అడుగగా, అందుకు ఎమిలీ తన వృద్ధాప్యంలో దాని గురించి ఆలోచిస్తానని చిరాకుగా సమాధానం ఇచ్చారు. అప్పుడు వృద్ధాప్యంలో తిరిగి జన్మించాలని అనుకున్న అనేక మంది ఇప్పటికే చనిపోయి నరకంలో కుళ్ళిపోతున్నారని ఆ స్త్రీ ఇచ్చిన బదులు ఎమిలీని ఎంతో కలవరానికి గురిచేసింది. ఆనాటి ప్రసంగం కూడా ఆమె హృదయంలో లోతుగా పనిచేసింది. చివరికి ఎమిలీ తనను తాను తగ్గించుకొని తన జీవితమును దేవునికి సమర్పించారు.

 ఇప్పుడు దేవునిలో ఒక నూతన సృష్టి అయిన ఎమిలీ తన ఇతర విధులతో పాటు సువార్త పరిచర్యను కూడా చేయడం ప్రారంభించారు. ఒకసారి సువార్త సభలకు ఆమె హాజరైనప్పుడు సంపూర్ణ సమయం సేవ చేయుటకు దేవుడు తనను పిలుస్తున్నట్లు బలమైన భావన ఆమెలో కలిగింది. అయితే సేవ చేయుటకు బదులుగా తన ధనాన్ని అంతటినీ ఇస్తానని ఆమె దేవునిని ఎంతో వేడుకున్నారు. కానీ, తనకు కావలసింది ఎమిలీయే గానీ ఆమె ధనం కాదని దేవుని పిలుపు ఎంతో స్పష్టంగా ఉంది. కావున చివరికి ఆ పిలుపుకు లోబడిన ఆమె, 1947వ సంll లో లండన్ నగరమునకు వెళ్ళి ‘ఇంటర్నేషనల్ బైబిల్ ట్రైనింగ్ కాలేజీ’ (ఐ.బి.టి.సి.) లో మిషనరీ శిక్షణ పొందారు.

 అటు పిమ్మట 1951వ సంll లో మచిలీపట్నం చేరుకొనిన ఎమిలీ, ఇండియన్ క్రిస్టియన్ అసెంబ్లీస్ (ఐ.సి.ఎ.) అనాథాశ్రమము యొక్క బాధ్యతను చేపట్టారు. 1958వ సంll వరకు కూడా ఆమె సువార్త పరిచర్యను నిర్వహిస్తూ కృష్ణా మరియు గుంటూరు జిల్లాలలో విస్తృతంగా పర్యటించారు. 1959వ సంll లో కొద్దిపాటి సమయం తన స్వదేశానికి వెళ్ళివచ్చిన తరువాత ఆమె ఎనిమిది మంది పిల్లలతో వర్రెగూడెంలో ఒక అనాథాశ్రమమును స్థాపించారు. ఆమె ఏనాడూ ఎవరి నుండి కూడా ఆర్థిక సహాయమును ఆశించక, తన అవసరతలన్నిటి కొరకు కేవలం ప్రార్థనలపై మాత్రమే ఆధారపడేవారు. ఆమె తన యొక్క పూర్వీకుల ఆస్తిని విక్రయించి, పాఠశాలలు, అనాథాశ్రమాలు, బైబిలు పాఠశాలలు మరియు క్రైస్తవ సంఘములను నిర్మించారు. ఆమె నిర్మించిన అనేకమైన వాటిలో మచిలీపట్నంలోని హైనీ హైస్కూల్ నేడు ఆమె పరిచర్యకు నిదర్శనంగా నిలుస్తోంది.

 మచిలీపట్నంలో యాభై సంవత్సరాలకు పైగా పరిచర్య చేసి, “హైనీ అమ్మగారు” అని ఆప్యాయముగా పిలువబడిన ఔన్ ఎమిలీ హైనీ, 2004వ సంll లో తుది శ్వాస విడిచారు.

ప్రియమైనవారలారా, దేవుడు కోరుకునేది మీ ధనమును కాదు, మిమ్ములను! కాగా ఆయన సేవ కొరకు మిమ్ములను మీరు సమర్పించుకొనుటకు మీరు సిద్ధముగా ఉన్నారా?

"ప్రభువా, మీరు నాకు ఇచ్చే కీర్తి అంతటి మధ్య, మీకు మరియు మీ పనికి నేను ప్రాధాన్యతనిచ్చుటకు నాకు సహాయము చేయుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక!

  • WhatsApp
  • No comments:

    Post a Comment