బిషప్ డానియేల్ కొరీ గారి జీవిత చరిత్ర
- జననం: 10-04-1777
- మహిమ ప్రవేశం: 05-02-1837
- స్వదేశం: ఇంగ్లాండు
- దర్శన స్థలము: భారతదేశం
ఇంగ్లాండు దేశానికి చెందిన డానియేల్ కొరీ ఒక ఆంగ్లికన్ పాదిరి మరియు బిషప్పు. 1802వ సంll లో డైయోసెస్ ఆఫ్ లింకన్‌కు డీకనుగాను మరియు 1804వ సంll లో పాదిరిగాను నియమించబడిన అతను, 1806వ సంll లో భారతదేశంలోని బెంగాల్ ప్రాంతానికి ప్రార్థనామందిర అధికారిగా నియమితులయ్యారు. 1823వ సంllలో కలకత్తా యొక్క ఆర్చిడీకనుగా నియమించబడి, తరువాత 1835వ సంll లో మద్రాసుకు బిషప్పు అయ్యారు.
అతను హిందూస్థానీ భాషను నేర్చుకొని, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని చునార్ ప్రాంత ప్రజల మధ్య సేవ చేశారు. ఆ ప్రాంతంలోనూ, వారణాసి వరకూ ఉన్న చుట్టుప్రక్కల ప్రాంతాలలోనూ అతను సువార్తను ప్రకటించినవారై క్రైస్తవ సంఘాలను, పాఠశాలలను స్థాపించారు. తరువాత 1810వ సంllలో కాన్పూరుకు వెళ్లి, అక్కడ తనకు సన్నిహిత స్నేహితులైన హెన్రీ మార్టిన్‌తో కలిసి కొంతకాలం పరిచర్య చేశారు. అక్కడ సేవ చేస్తున్న సమయంలో అతను తీవ్ర అస్వస్థతకు గురవడంతో, అనారోగ్యం నుండి కోలుకొనుటకుగాను కాన్పూరును విడిచి కలకత్తాకు వెళ్ళారు. అయినప్పటికీ, దేవుని పరిచర్యలో అతను వెనుదిరిగి చూడలేదు. కొరీ స్థానిక ముస్లిం ప్రజల మధ్య కూడా పరిచర్య జరిగించి, వారిని క్రీస్తు నొద్దకు నడిపించారు.
1812వ సంllలో అతను ఎలిజబెత్‌ను వివాహం చేసుకొనగా, ఆమెకున్న ఆత్మీయ సంకల్పం మరియు స్వచ్ఛమైన ప్రేమాప్యాయతలు ఒడిదుడుకులలోనూ దేవుని పరిచర్యలో ముందుకు సాగిపోవుటకు అతనికి ఎంతో తోడ్పాటునందించాయి. వారిరువురూ కలిసి ఆగ్రాకు వెళ్ళి, రెండు సంవత్సరాలపాటు సేవ చేయగా, అక్కడ దేవుని వాక్యం ఎంతో ఫలభరితమైనదై స్థానిక ప్రజలతో కూడిన క్రైస్తవ సంఘాలు ఏర్పడ్డాయి. కొరీ కలిగియున్న కాలేయానికి సంబంధించిన వ్యాధి తీవ్రరూపం దాల్చడంతో వైద్య చికిత్స నిమిత్తమై అతను తన స్వదేశానికి వెళ్ళవలసి వచ్చింది. అయితే, హిందూస్థానీ సోదరుల పట్ల అతనికున్న గొప్ప ఆసక్తి వలన అతను తిరిగి భారతదేశానికి వచ్చి, కలకత్తా, బనారస్ (వారణాసి), బక్సార్, మరియు చునార్ ప్రాంతాలలో దేవుని సేవను కొనసాగించారు.
తరువాతి కాలంలో 1835వ సంll తమిళనాడులోని మద్రాసుకు బిషప్పుగా నియమించబడిన డానియేల్ కొరీ, తన చివరి శ్వాస వరకూ అక్కడే సేవలందించారు. ఆ సమయంలోనే తంజావూరు మరియు తిరునెల్వేలి ప్రాంతాలలోని క్రైస్తవ సంఘాలలో ఉన్న సమస్యలను పరిష్కరించి, శాంతి సమాధానాలను నెలకొల్పుటకు అతను ఎంతో కృషి చేశారు. అంతేకాకుండా, ఎన్నో పాఠశాలలను మరియు క్రైస్తవ సంఘాలను స్థాపించిన కొరీ దేవుని పరిచర్య చేయుటకై ఎంతోమంది యువకులకు శిక్షణనిచ్చారు. దయగల హృదయం మరియు సాత్వికమైన స్వభావము కలిగి, దీనత్వముతో 24సంll లకు పైగా భారతదేశంలో దేవుని సేవ చేసిన బిషప్ డానియేల్ కొరీ, 1837వ సంll లో ఈ లోకములో తన యాత్రను ముగించారు.
ప్రియమైనవారలారా, అనేక మంది మిషనరీలు తమ దేశాలను విడిచిపెట్టి వచ్చి మీ దేశమును రక్షించుటకు వచ్చి శ్రమించగా, మీ స్వంత దేశము కొరకు మరియు మీ స్వంత ప్రజల కొరకు మీరు భారం కలిగియున్నారా?
"ప్రభువా, మా దేశములో రక్షణ వెలుగును వ్యాపింపజేయుటలో నన్ను ఒక సాధనముగా వాడుకొనుము. ఆమేన్!"
దేవునికే మహిమ కలుగునుగాక!
No comments:
Post a Comment