Search Here

Nov 9, 2021

Edward Winter Clark | ఎడ్వర్డ్ వింటర్ క్లార్క్

ఎడ్వర్డ్ వింటర్ క్లార్క్ | Edward Winter Clark


  • జననం: 05-02-1830
  • మహిమ ప్రవేశం: 24-06-1913
  • స్వస్థలం: డచెస్ కౌంటీ, న్యూయార్క్
  • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  • దర్శన స్థలము: నాగాలాండ్, భారతదేశం

 అస్సాంలోని సిబ్‌సాగర్‌లో ఉన్న ఒక ప్రదేశంలో స్థానికులు ఒక యువ మిషనరీకి – ఒంటరిగా నిలిచియున్న నిలువుగా ఉండే ఒక పెద్ద బండరాయి లోపల ఒక ఆత్మ ఉందని, కాబట్టి ఎవరూ ఆ దారిలో వెళ్ళలేరని చెప్పారు. అయితే వారిని ఆశ్చర్యపరిచేలా ఆ యువ మిషనరీ ఆ బండ అంచుల వరకు వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చారు. ఆ విధంగా ఆత్మలకు భయపడే, శతృవుల తలలను తమ వద్ద ఉంచుకునే మరియు జంతువులను బలి ఇచ్చే వ్యక్తుల మధ్య సువార్తను వ్యాపింపజేసిన అమెరికాకు చెందిన ఆ యువ బాప్తిస్టు మిషనరీ ఎడ్వర్డ్ వింటర్ క్లార్క్. 

14 సంll ల వయస్సులో బాప్తిస్మం తీసుకున్న ఎడ్వర్డ్ వింటర్ క్లార్క్, 1859వ సంll లో బోధకునిగా నియమితులయ్యారు. 1869వ సంll మార్చి మాసంలో అతను తన భార్యతో పాటు అస్సాంలోని సిబ్‌సాగర్‌కు చేరుకున్నారు. అక్కడ పరిచర్య చేయడం ప్రారంభించినప్పుడు అతను మైదాన ప్రాంతాలలో వ్యాపారం చేయుటకు పర్వత ప్రాంతాల నుండి అక్కడకు వచ్చిన అయో నాగ అనే తెగవారిని సంధించడం జరిగింది. ఈ తెగలకు సువార్త ప్రకటించుటకు అతనికి ఎంతో భారం కలిగింది. అయితే, బ్రిటిషువారు విధించిన ఆంక్షల కారణంగా నాగ కొండలలోకి ప్రవేశించడం అతనికి సాధ్యపడలేదు. 

బ్రిటిషు వారి అనుమతి కొరకు వేచియున్న సమయంలో అతను గోధులా రూఫస్‌ అనే ఒక స్థానిక సువార్తికుడిని నాగ ప్రాంతంలోకి పంపగా, ఆ సువార్తికుడు క్రీస్తును అంగీకరించిన తొమ్మిది మందిని తనతో పాటు తిరిగి తీసుకువచ్చారు. ఈ పరిణామాల ఆధారంగా, చివరకు 1872వ సంll డిసెంబరు 18వ తారీఖున నాగా వారి భూభాగంలోకి ప్రవేశించిన క్లార్క్, అక్కడి స్థానికుల మధ్య పరిచర్య చేయడం ప్రారంభించారు. అతను వారి స్థానిక భాషను, స్వభావమును మరియు వైద్యమును నేర్చుకొనుటకు తన సమయాన్ని మరియు శక్తిని అంకితం చేశారు. అది అందరితో సంబంధాలను ఏర్పరచుకొనుటకును మరియు సువార్తను ప్రకటించుటకును అతనికి మార్గమును ఏర్పరచింది. త్వరలో అతను మొలుంగ్కిమోంగ్‌లో 15 మందితో కూడిన చిన్న సమాజంతో ఒక క్రైస్తవ సంఘమును స్థాపించారు.

నూతన విశ్వాసులు తమ పాత నమ్మకాలు మరియు ఆచారాలను విడిచిపెట్టడం ప్రారంభించడంతో, నాగ గ్రామాలలో పెద్ద వివాదం తలెత్తింది. ఎంతో వ్యతిరేకత మధ్య, మంచి సంస్కృతి కలిగియుండుటకు స్థానికులను ఒప్పించేందుకు ఎంతో జాగ్రత్తతోను మరియు ప్రార్థనతోను నడుచుకున్నారు క్లార్క్. మునుపు అక్కడ ప్రబలంగా ఉన్న శతృవుల తలలను తమ వద్ద ఉంచుకొనుట, జంతుబలులు, పోరాటాలు, మద్యపానం వంటి నాగావారి జీవనవిధానాలు క్రమక్రమంగా ఆగిపోయాయి. గిరిజనుల సామాజిక స్థితిగతులను మెరుగుపరచుటకు నాగాలాండ్‌లోని అనేక ప్రాంతాలలో పాఠశాలలు మరియు క్రైస్తవాలయములను కూడా అతను స్థాపించారు. 1905వ సంll లో నూట తొంభై మంది నాగ ప్రజలు బాప్తిస్మం తీసుకున్నప్పుడు గొప్ప ఆత్మీయ ఆశీర్వాదం అక్కడ కనిపించింది.

భారతదేశంలో నేడు క్రైస్తవ మతాన్ని అధికారిక మతంగా కలిగి ఉన్న ఏకైక రాష్ట్రం నాగాలాండ్ కావడం ఎడ్వర్డ్ వింటర్ క్లార్క్ యొక్క నాలుగు దశాబ్దాల పరిచర్య ఫలముకు నిదర్శనముగా నిలుస్తుంది. ఆ దైవసేవకుడు 1913వ సంll లో తన పరమ యజమానుని చేరుకొన ఇహలోకమును విడిచి వెళ్ళారు.

ప్రియమైనవారలారా, ప్రతిరోజూ మీరు సంధించే ప్రజలకు సువార్త ప్రకటించాల్సిన బాధ్యత మీరు కలిగియున్నారు కారా?

"ప్రభువా, మీ పరిశుద్ధ గ్రంథములో ఇవ్వబడిన మంచి సంస్కృతిని మరియు నడవడికను అవలంబించుటకు ఈ లోకమును ఒప్పించగలుగుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp
  • No comments:

    Post a Comment