జోహన్ ఆల్ఫ్రెడ్ రినెల్ గారి జీవిత చరిత్ర
- జననం: 27-11-1866
- మహిమ ప్రవేశం: 03-07-1941
- స్వస్థలం: ఓస్టెర్గొట్లాండ్
- దేశం: స్వీడన్
- దర్శన స్థలము: చైనా
స్వీడన్‌కు చెందిన జోహన్ ఆల్ఫ్రెడ్ ఒక బాప్తిస్టు మిషనరీగా చైనాలో సేవలందించారు. 1866వ సంllలో జన్మించిన అతను పంతొమ్మిదేళ్ళ వయసులోనే బోధించడం ప్రారంభించారు. తరువాత అతను స్టాక్‌హోమ్‌లోని బేతేల్ బైబిలు కళాశాలలో చేరగా, ఒకసారి అక్కడకు వచ్చిన ఆంగ్లేయ మిషనరీ అయిన హడ్సన్ టేలర్ యొక్క ప్రసంగం ద్వారా తాను కూడా మిషనరీ సేవ చేయాలనే ప్రేరణ పొందారు.
కళాశాల ముగించిన తరువాత అతను నార్వేలోని ఫ్రెడ్రిక్‌షాల్డ్‌లో పాదిరిగా సేవచేశారు. ఆ సమయంలోనే మిషనరీ కావాలనే కోరికను తాను కూడా కలిగియున్న హెడ్విగ్‌ను అతను వివాహం చేసుకున్నారు. కానీ, చైనాకు మిషనరీలుగా వెళ్ళడానికి ఊహించని విధముగా ఆహ్వానం వచ్చినప్పుడు మాత్రం వారు తమ గృహమును, సొంతవారిని విడిచిపెట్టి వెళ్ళవలెనా అనియు, అక్కడ వారు సేవ చేయుచున్న సంఘము యొక్క భవిష్యత్తు ఏమవునో అనియు మరియు వారి తల్లిదండ్రులు ఏమంటారో అనియు సందిగ్ధంలో ఉండిపోయారు. లోపల ఎంతో పోరాటంతో ఎంతగానో ప్రార్థనలో కనిపెట్టిన తరువాత, మిషనరీ అవ్వాలని వారికి మునుపు ఉన్న ఆకాంక్షను వారు జ్ఞాపకము చేసుకుని, దేవుని చిత్తము చేయుటకు తమను సమర్పించుకున్నారు.
కాగా 1894వ సంllలో చైనా చేరుకున్న ఆ మిషనరీ దంపతులు, అక్కడ శాంటుంగ్ పరిధిలోని కియోహ్సీన్ (ప్రస్తుత జియాజౌ) లో స్థిరపడ్డారు. అక్కడ వారు ఎంతో ప్రయాసపడి క్లిష్టమైన చైనా భాషను నేర్చుకున్నారు. 45 సంll లకు పైగా చేసిన మిషనరీ పనిలో వారు తోటి మిషనరీలతో కలిసి కియోహ్సీన్‌లోను మరియు దాని పరిసర ప్రాంతాలలోను వైద్యశాలలు, పాఠశాలలు మరియు క్రైస్తవ సంఘములను స్థాపించారు. కియోహ్సీన్‌లో మొట్టమొదటి తపాలా కార్యాలయాన్ని స్థాపించడం మరియు విపత్తు ఉపశమనానికి సహాయమందించడం అను ప్రశంశాత్మక కార్యాలు కూడా జోహన్ ఆల్ఫ్రెడ్ జాబితాలో చేరుతాయి.
చైనాలో ఈ మిషనరీ దంపతులు యుద్ధకాలం, ప్రకృతి వైపరీత్యాలు, ప్రాణాల కోసం పారిపోవడం, తాము లేకుండా స్వదేశంలోని తమ ప్రియమైన వారిని కోల్పోవడం, అనారోగ్యం మొదలగు పలు కష్టతరమైన పరిస్థితులను అనుభవించారు. అన్నింటినీ మించి, క్రైస్తవుల పైన ద్వేషం, వారిని హింసించడం అక్కడ తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. చైనాలో 1899-1901 సంll ల మధ్య నెలకొన్న విదేశీ వ్యతిరేక మరియు క్రైస్తవ వ్యతిరేక ఉద్యమం అయిన “బాక్సర్ తిరుగుబాటు” ("బాక్సర్ రిబెల్లియన్") కారణంగా ఎంతోమంది మిషనరీలు మరియు చైనా దేశ క్రైస్తవుల వధ జరిగింది. అనేక శ్రమలు, ఆపదలు ఎదురైనప్పటికీ ఆ మిషనరీ దంపతులు తమ మిషనరీ పనిని కొనసాగించి దేవునికి నమ్మకమైన దాసులుగా సేవ చేశారు.
సగముపైగా తన జీవితాన్ని చైనా దేశంలోనే గడిపి ఎన్నో సంవత్సరాలు అక్కడ సేవ చేసిన ఆల్ఫ్రెడ్‌ను అక్కడి సంఘ సభ్యులైన చైనా వారు ‘ది ఓల్డ్ పాస్టర్’ (పాత పాదిరిగారు) అని ఆప్యాయతతో పిలిచేవారు. పలు పుస్తకాలకు రచయిత అయిన ఆల్ఫ్రెడ్ ‘బాక్సర్ తిరుగుబాటు’ మరియు చైనాలో క్రైస్తవుల పట్ల జరుగుతున్న హింసను గురించి ఒక పుస్తకమును కూడా వ్రాశారు. 1941వ సంllలో అతని మరణానంతరం చైనా క్రైస్తవులు జోహన్ ఆల్ఫ్రెడ్ కొరకు ఒక స్మారక రాతిని నిర్మించారు.
ప్రియమైనవారలారా, అన్నింటినీ వెనుక విడిచిపెట్టి దేవుడు మిమ్మును నడిపించు సుదూర ప్రాంతాలకు వెళ్ళుటకు మీరు సిద్ధముగా ఉన్నారా?
"ఏ మాత్రం సంకోచం లేకుండా మీ యొక్క పిలుపుకు విధేయుడనై ఇదిగో ప్రభువా నేను వచ్చుచున్నాను. ఆమేన్!"
దేవునికే మహిమ కలుగునుగాక!
No comments:
Post a Comment