జాక్వెస్ మార్క్వెట్ గారి జీవిత చరిత్ర
- జననం: 01-06-1637
- మహిమ ప్రవేశం: 18-05-1675
- స్వస్థలం: లావోన్
- దేశం: ఫ్రాన్స్
- దర్శన స్థలము: అమెరికా
"నేను ఇతరదేశాలకు పంపబడుటకు అనుమతి పొందెదనా? నా చిన్నతనం నుండీ అదే నా ధ్యేయమైయున్నది కదా!" అనే తలంపులతో 17సంllల వయస్సులో ఫ్రాన్స్‌లోని జెస్యూట్ కళాశాలలో ప్రవేశిస్తున్న మార్క్వెట్ యొక్క మనస్సు నిండిపోయి ఉంది.
జాక్వెస్ మార్క్వెట్ 1637వ సంllలో ఫ్రాన్స్‌లోని లావోన్‌లో జన్మించారు. 17 సంllల వయసులో సొసైటీ ఆఫ్ జీసస్‌లో చేరిన అతను సుమారు 12 సంవత్సరాలపాటు బోధింపబడి, అభ్యాసం చేసి, శిక్షణ పొందిన తరువాత జెస్యూట్ మిషనరీ అయ్యారు. ఆ సమయంలోనే అతను తన జీవిత లక్ష్యం ఏమిటో నిర్ణయించుకున్నారు. కావున, 1665వ సంllలో తన కళాశాల చదువు ముగియబోతున్నప్పుడు అతను తన ఉన్నతాధికారికి ఇలా వ్రాశారు: “ఇంతకుమునుపు ఇండీస్‌కు మిషనరీగా వెళ్ళవలెనని నేను ఆశ కలిగియున్నాను; అయితే ఇప్పుడు మీరు నన్ను ఏ దేశానికి పంపించినా నేను సంతోషముగా వెళ్ళెదను.”
జాక్వెస్ మార్క్వెట్ అమెరికాలోని స్థానిక ప్రజలకు మిషనరీగా వెళ్ళుటకు నియమించబడ్డారు. 1666వ సంllలో కెనడాలోని క్యూబెక్ ప్రాంతానికి వెళ్ళిన అతను అక్కడ తన మిషనరీ పనిలో మొదటి మెట్టుగా స్థానిక భాషలను నేర్చుకొనుటలో మనసును నిలిపి అమెరికా యొక్క ఆరు స్థానిక మాండలికాలలో నిష్ణాతులయ్యారు. తరువాత 1668లో ఒట్టావా తెగల మధ్య జరుగుతున్న సువార్త సేవలో మరొక మిషనరీయైన క్లాడ్ డాబ్లాన్‌కు సహకారమందించుటకై అతను సాల్ట్ స్టీ. మారీకు వెళ్ళారు. అటు పిమ్మట సెయింట్ ఇగ్నాస్‌లో కూడా తన సేవలందించారు.
1673వ సంllలో మిస్సిస్సిప్పి నది యొక్క మూలాలను అన్వేషించుటలో ఫ్రెంచ్-కెనడా అన్వేషకుడు లూయిస్ జోలియట్‌తో చేతులు కలిపారు మార్క్వెట్. వారిరువురూ ఒకే పనిలో భాగస్వాములయినప్పటికీ, వారి యొక్క ఆశయాలు భిన్నమైనవి.
ఏమనగా, జోలియట్ నది గురించి కనుగొనడంపైనే దృష్టి నిలుపగా, ఆ ప్రయాణ మార్గంలో ఎదురుపడే ప్రజల మధ్య సువార్తను వ్యాప్తి చేయాలనునది మార్క్వెట్ యొక్క ప్రధాన ఉద్దేశమైయున్నది. తిరిగి వచ్చిన తరువాత, 1674వ సంllలో అతను ఇల్లినాయిస్ తెగలవారి మధ్య ఒక మిషనును స్థాపించాలనుకున్నారు. శీతాకాలపు చలి అతనిని ఆటంకపరిచినప్పటికీ, వసంతకాలం నాటికి అతను ఆ తెగలవారిని చేరుకొనగలిగారు. కానీ తీవ్రమైన అనారోగ్యం అతను ఇంటికి తిరుగు ముఖం పట్టేలా చేసింది. అయితే మార్గ మధ్యంలోనే అతను ఒక నదీ ముఖద్వారం వద్ద తన తుది శ్వాసను విడువగా, తరువాత ఆ నదికి పేర్ మార్క్వెట్ (ఫాదర్ మార్క్వెట్ అని అర్థం) అని అతని గౌరవార్థం పేరు పెట్టబడింది.
ప్రియమైనవారలారా, మీరు ఎక్కడ ఉన్నా మరియు ఏమి చేసినా, సువార్త ప్రకటించడం మీ లక్ష్యముగా ఉన్నదా?
ప్రభువా, నేను ఏమి చేసినా నా అంతిమ లక్ష్యం అయిన సువార్త ప్రకటనపై నేను దృష్టి నిలుపునట్లు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!
దేవునికే మహిమ కలుగునుగాక!
No comments:
Post a Comment