Search Here

Apr 7, 2022

Rees Howells | రీస్ హావెల్స్

రీస్ హావెల్స్  జీవిత చరిత్ర




  • జననం : 10-10-1879
  • మరణం : 13-02-1950
  • స్వస్థలం : వేల్స్, యునైటెడ్ కింగ్‌డమ్
  • దర్శన స్థలము : ఇంగ్లాండు, దక్షిణాఫ్రికా


రీస్ హావెల్స్ వేల్స్‌లోని బ్రైనమ్మాన్ గ్రామంలో ఒక దైవభక్తి గల కుటుంబంలో జన్మించారు. మంచి భవిష్యత్తుకు సోపానం వేయాలనే నిరీక్షణతో యవ్వన దశలో ఉన్న రీస్ తన పది మంది తోబుట్టువులతో పాటు అమెరికాకు వలస వెళ్ళారు. ఒకసారి మోరిస్ రూబెన్ అనే మారుమనస్సు పొందిన ఒక యూదుని యొక్క సాక్ష్యాన్ని రీస్ వినడం జరిగింది. తద్వారా అతను కూడా తన జీవితమును రక్షకుడైన యేసుక్రీస్తుకు అర్పించి ఆయనలో నూతన సృష్టిగా మార్చబడ్డారు. మొదటిలో గనులలో పనిచేసిన అతను, తదుపరి దేవుని సేవకు తనను సమర్పించుకున్నారు. కాగా ఇతరుల కొరకు ప్రార్థన చేసే విజ్ఞాపనా పరిచర్యలోనికి దేవుని ఆత్మ అతనిని లోతుగా నడిపించింది. తత్ఫలితముగా అతని సేవా జీవితం జవాబు పొందిన ప్రార్థనల యొక్క బలమైన సాక్ష్యముల సమ్మేళనమయ్యింది.


1910వ సంll లో అతను ఎలిజబెత్ హన్నా జోన్స్‌ను వివాహం చేసుకున్నారు. 1915వ సంll లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు దక్షిణాఫ్రికాలో మిషనరీగా సేవ చేయుటకు వారికి పిలుపు వచ్చింది. ఓడలో ప్రయాణించవలసి వస్తుందనే భయాందోళనలు ఉన్నప్పటికీ, దేవునికి లోబడి ఆయన చిత్తం చేయాలనే ఆ దంపతుల యొక్క వాంఛను అవేవీ అడ్డుకోలేకపోయాయి. దక్షిణాఫ్రికాలో హావెల్స్ అనేక ఉజ్జీవ సభలను నిర్వహించగా, పరిశుద్ధాత్మ దేవుడు స్థానిక ప్రజల మధ్య ఎంతో శక్తివంతంగా పనిచేశాడు. తత్ఫలితముగా ఎంతో మంది ప్రజలు క్రీస్తును అంగీకరించగా, అతని పరిచర్య ద్వారా సంఘము ఒక నూతన ఉజ్జీవాన్ని పొందింది. ఉజ్జీవ అభిషేకంతో హావెల్స్ దక్షిణాఫ్రికాలోని పలు మిషన్ స్థావరాలకు ప్రయాణించారు. ఒక ప్రక్క సేవ అభివృద్ధి చెందుతుండగా, మరొక ప్రక్క దేవుని సేవ చేసే పరిచారకుల యొక్క అవసరం కూడా పెరుగుతూ వచ్చింది. కాగా సేవకులకు శిక్షణనిచ్చుటకు ఒక సంస్థ ఆవశ్యకమని హావెల్స్ గుర్తించారు. 1920వ సంll లో ఇంగ్లాండుకు తిరిగి వచ్చిన అతను, 1924వ సంll లో 'బైబిల్ కాలేజ్ ఆఫ్ వేల్స్' అనే కళాశాలను స్థాపించారు. ఆనాటి నుండి కళాశాలలో శిక్షణ పొందిన వేలాది మంది విద్యార్థులు ఈనాటికీ ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్నారు.


హావెల్స్ ఇతరుల కొరకు దేవుని సన్నిధిలో భారముతో విజ్ఞాపనలు చేసే ఒక గొప్ప ప్రార్థనా వీరుడు. దేవుని పట్ల తాను కలిగియున్న విధేయతకు కలిగిన ప్రతి పరీక్షలో కూడా దేవుని చిత్తము చేయుటకు సిద్ధమనస్సు మరియు తన జీవితములోని ప్రతి భాగములో సంపూర్ణ సమర్పణ కలిగియుండుట వలన విజయం సాధించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఇంగ్లాండు దేశం శారీరకంగా పోరాడుతుండగా, హావెల్స్ మరియు అతని విద్యార్థులు ప్రార్థనలో మోకాళ్లపై పోరాడారు. తమ సహోదరులను రక్షించాలన్న వారి రోజువారీ ప్రార్థనలకు అద్భుతమైన రీతిలో సమాధానం లభించింది. ఉజ్జీవాన్ని తీసుకువచ్చుటకు ఒక గొప్ప బాధ్యతను తన భుజముల మీద వేసుకొని, దానిని మహిమకరముగా నెరవేర్చిన రీస్ హావెల్స్, 1950వ సంll లో తన పరలోకపు వాసస్థలమునకు పయనమయ్యారు.

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, ఈ భూమిపై దేవుని చిత్తము నెరవేర్చబడగలుగునట్లు ఇతరుల కొరకు విజ్ఞాపనలు చేసే ప్రార్థనా జీవితాన్ని మీరు కలిగియున్నారా? 

ప్రార్థన :

"ప్రభువా, మీ మహిమార్థమై ఇతరుల కొరకు ప్రార్థించుటకు నేను మోకరిల్లునట్లు నన్ను విశ్వాసములో స్థిరపరచుము. ఆమేన్!"


దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • No comments:

    Post a Comment