థియోడర్ లైటన్ పెన్నెల్ జీవిత చరిత్ర
- జననం : 07-10-1867
- మరణం : 23-03-1912
- జన్మస్థలం : క్లిఫ్టన్
- దేశం : ఇంగ్లాండు
- దర్శన స్థలము : బన్నూ, పాక్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు
పఠాన్ దుస్తులు ధరించిన ఒక వ్యక్తి సైకిలు మీద పంజాబు వీధుల గుండా వెళ్తున్నాడు. తమ సౌకర్యవంతమైన నివాసాలలో ఉంటూ, ప్రజలలోకి వెళ్ళకుండా, ప్రజలే తమ వద్దకు రావలెనని ఆశిస్తూ నిశ్చింతగా ఉన్న మిషనరీల స్థితిని చూచి అతని హృదయం భారంతో నిండిపోయింది. ఆ వ్యక్తి థియోడర్ లైటన్ పెన్నెల్. అతను ముస్లింలతో కలిసి వారిలో ఒకనిగా జీవించుటకై పఠాన్ యొక్క వస్త్రధారణను అవలంబించారు, హిందువులు తనతో కలిసి తినుటకు వీలు కలుగునట్లు శాకాహారిగా మారారు, గ్రామాలను దర్శించారు, ప్రజలలోకి వెళ్ళారు, వారిని సంధించారు, వారితో కలిసి నివసించారు, వారి యొక్క నమ్మకాన్ని గెలుచుకోవడానికి ప్రయత్నించారు, వారికి భౌతికపరమైన వైద్య సేవలను అందిస్తూ వారి హృదయములను స్వస్థపరచగల పరమ వైద్యుడిని వారికి పరిచయం చేశారు!
వైద్యశాస్త్ర విద్యాభ్యాసములో బంగారు పతకాన్ని పొందినటువంటి థియోడర్ పెన్నెల్, తన ముందున్న ఉజ్వలమైన భవిష్యత్తును విడిచిపెట్టి, చర్చి మిషనరీ సొసైటీ (సిఎంఎస్) కు తన సేవలను అందించుటకు సమర్పించుకున్నారు. తద్వారా అతను ఆంగ్లేయులు పరిపాలిస్తున్న కాలములో భారతదేశమునకు మిషనరీగా నియమించబడ్డారు. అప్పటిలో పాకిస్తాన్ కూడా భారతదేశంలో భాగంగా ఉంది. తన జీవితము ద్వారా ప్రజలకు సేవ చేయవలెనని ప్రేరణ కలిగిస్తూ అతనిని పెంచిన అతని తల్లియైన ఎలిజబెత్ కూడా అతనితో పాటు భారతదేశానికి ప్రయాణమయ్యారు. 1892వ సంll లో పాకిస్తాన్ భూభాగములోని డేరా ఇస్మాయిల్ ఖాన్ వద్ద తన సేవను ప్రారంభించిన పెన్నెల్, 1893వ సంll నాటికి పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వద్ద ఉన్న బన్నూ అనే ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ ఆఫ్ఘనిస్తానుకు వెళుతున్న లేదా అక్కడి నుండి వస్తున్న ప్రయాణికుల మధ్య అతను సువార్త సేవ జరిగించారు. బన్నూలో అతను ఒక పాఠశాలను మరియు ప్రతి సంవత్సరం వేలాది మంది రోగులకు సేవలందించిన ఒక ఆసుపత్రిని స్థాపించారు. అతను ఒకవైపు వైద్య సేవలను అందిస్తూనే, మరొకవైపు బన్నూ మరియు పరిసర గ్రామాలలో బహిరంగముగా సువార్తను ప్రకటించేవారు. అతని పరిచర్య యొక్క మొదటి ఫలమైన జహాన్ ఖాన్, విదేశాలకు మిషనరీగా వెళ్ళిన ఆఫ్ఘనిస్తానుకు చెందిన మొదటి వ్యక్తి. అతను గల్ఫ్ మరియు తూర్పు ఆఫ్రికాలకు వెళ్ళి సేవ చేశారు.
అయితే ఇస్లాం నాయకుల నుండి వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. వారు పెన్నెల్ ఇచ్చే మందులను వాడవద్దని ప్రజలను హెచ్చరించారు. క్రైస్తవులుగా మారినవారు పలు శ్రమలను ఎదుర్కొన్నారు. పెన్నెల్ సేవచేసినది కోపోద్రేకులు, సాధుస్వభావం లేని తెగలకు చెందినవారై తమ మతమంటే ఎంతో అంకితభావం గలవారైన ఇస్లాంవాదుల మధ్య. కానీ, అతను ఏనాడూ భయపడలేదు. పైగా ఏదైనా ప్రదేశం సువార్త సేవకు ప్రమాదకరమైనదిగా కనిపిస్తే, దానిలోకి ప్రవేశించుటకు అతను ప్రేరేపించబడేవారు. ఆఫ్ఘనిస్తాన్ దేశము పట్ల అతను ఎంతో భారము కలిగియుండేవారు. కాగా మిషనరీలు ప్రవేశించుటకు అనుమతించని ఆ దేశమునకు వెళ్ళుటకు అతను నిరీక్షించారు.
భారతదేశంలో సంఘసేవ చేసినందుకుగాను గౌరవార్థముగా ఇచ్చే ‘కైసర్-ఇ-హింద్’ పతకాన్ని అందుకున్న టి. ఎల్. పెన్నెల్, అంటు వ్యాధి ఉన్న ఒక వ్యక్తికి చికిత్స చేస్తుండగా తాను కూడా ఆ వ్యాధి బారిన పడి, 45 సంll ల వయసులో మరణించారు.
ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది :
ప్రియమైనవారలారా, మీ సౌకర్యవంతమైన స్థితిని విడిచిపెట్టి, ప్రజలలోకి వెళ్ళి వారితో సువార్తను పంచుకొనుటకు మీరు ముందుకు వచ్చెదరా?
ప్రార్థన :
"ప్రభువా, ఎటువంటి భయమూ లేకుండా ధైర్యము కలిగి మీ సువార్తను ప్రకటించుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"
దేవునికే మహిమ కలుగునుగాక!
No comments:
Post a Comment