Search Here

Jul 26, 2022

Esther Baldwin | ఎస్తేర్ బాల్డ్విన్

ఎస్తేర్ బాల్డ్విన్  జీవిత చరిత్ర



  • జననం: 08-11-1840
  • మహిమ ప్రవేశం: 26-02-1910
  • స్వస్థలం: న్యూజెర్సీ
  • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  • దర్శన స్థలము: చైనా


‘చైనీస్ ఛాంపియన్’ అని కూడా పిలువబడే ఎస్తేర్ బాల్డ్విన్ చైనాలో సేవ చేసిన ఒక అమెరికా మిషనరీ. ఒక క్రైస్తవ కుటుంబములో జన్మించిన ఆమె, పదేళ్ళ వయస్సులో ప్రభువును తన స్వరక్షకునిగా అంగీకరించారు మరియు స్థానిక సంఘములో చురుకైన సభ్యురాలిగా ఉన్నారు. న్యూజెర్సీలోని పెన్నింగ్టన్ సెమినరీ నుండి పట్టా పొందిన పిమ్మట, ఆమె వర్జీనియాలోని ఒక బైబిలు వేదాంత కళాశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ఫుజౌ మిషన్‌లో పనిచేసిన స్టీఫెన్ లివింగ్‌స్టన్ బాల్డ్విన్‌తో వివాహం జరిగిన తరువాత, మిషనరీగా  తన భర్తతో కలిసి పనిచేయుటకుగాను ఆమె 1862వ సంll లో చైనాకు వెళ్ళారు.


ఫుజౌలో ఆమె తన గృహసంబంధిత బాధ్యతలను నెరవేర్చడంతో పాటు అనేక పాఠశాలలను పర్యవేక్షించారు. అంతేకాకుండా తమ తోటి చైనా మహిళలకు బైబిలు చదివి వివరించునట్లు మరికొంత మంది స్త్రీలకు ఆమె శిక్షణనిచ్చారు కూడా. అక్కడి స్త్రీలు మరియు పిల్లల యొక్క పరిస్థితిని చూసిన ఆమె, చైనాలో క్రైస్తవ వైద్యుల కొరకు ఉన్న అవసరతను గ్రహించారు. వైద్య సేవలను అందించడం అనునది స్థానికుల యొక్క నమ్మకమును పొందుటకు మంచి మాధ్యమమనియు, చైనాలోని అంతర్భాగములకు సువార్తను తీసుకువెళ్ళుటకు ఒక చక్కటి మార్గమనియు ఆమె విశ్వసించారు. కాగా ఫుజౌలో మహిళలు మరియు పిల్లలకు ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేయుటలో ఆమె ఒక కీలక పాత్ర పోషించారు. సంవత్సరములు గడిచే కొద్దీ ఆ ఆసుపత్రి మూలముగా అనేక మంది స్త్రీలు మరియు పిల్లలు క్రీస్తు నొద్దకు నడిపించబడ్డారు. ఆమె సువార్తకు సంబంధించిన రచనలను చైనా భాషలోనికి అనువదించుటలోను మరియు వాటిని సవరించుటలోను కూడా సేవలందించారు.


తన బాల్యం నుండి కూడా శారీరకంగా బలహీనముగా ఉన్న ఎస్తేర్, చైనాలో ఉన్నంత కాలం అనారోగ్యముతో బాధపడవలసి వచ్చింది. చివరికి, చైనాలో పద్దెనిమిది సంవత్సరాలు పరిచర్య చేసిన తరువాత, తీవ్రమైన అనారోగ్యం కారణంగా ఆమె తన కుటుంబముతో కలిసి అమెరికాకు తిరిగి వెళ్ళారు. అక్కడ ఆమె అమెరికాలో అణచివేతకు మరియు వివక్షకు గురైన చైనా ప్రజల పక్షముగా నిలబడ్డారు. ఆమె తన రచనల ద్వారా అమెరికా చైనా దేశాల మధ్య సన్నగిల్లిపోయియున్న సంబంధాలను చక్కదిద్దుటకు ప్రయత్నించారు మరియు క్రీస్తును సేవించుచున్నప్పుడు జాతికి జాతీయతకు అతీతమైన దృష్టి కలిగియుండవలెనని క్రైస్తవ సమాజమును ప్రోత్సహించారు. అంతేకాకుండా, ‘ఉమెన్స్ ఫారిన్ మిషనరీ సొసైటీ’ అనే మహిళా మిషనరీ సంస్థ యొక్క అధ్యక్షురాలిగా కూడా పనిచేసిన ఎస్తేర్ బాల్డ్విన్, ఎంతో మంది మహిళలను మిషనరీ పరిచర్యలోకి నడిపించడంలో ఒక గొప్ప సాధనమయ్యారు.


ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, వివిధ సమాజములవారి మధ్య సన్నగిల్లిపోయియున్న సంబంధములను మీరు క్రీస్తు ప్రేమతో చక్కదిద్దుతున్నారా? 


ప్రార్థన :

"ప్రభువా, జాతికి, జాతీయతకు, కులమతాలకు మరియు సంస్కృతికి అతీతముగా నా దృష్టి ఉండునట్లు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • No comments:

    Post a Comment