హ్యాటీ జడ్సన్ జీవిత చరిత్ర
- జననం: -
- మహిమ ప్రవేశం: 1897
- స్వస్థలం: డాన్విల్లే, కనెక్టికట్
- దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
- దర్శన స్థలము: భారతదేశం
కీర్తనలు 116:15 లో బైబిలు ఇలా చెబుతోంది, “యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది.” వారి త్యాగపూరితమైన జీవితముల ద్వారా యేసు క్రీస్తు ప్రభువు మహిమపరచబడ్డారు మరియు క్రైస్తవ సంఘము అభివృద్ధి చెందింది. వారు ఎదురొంటున్న సవాళ్ళకు, పరీక్షలకు మరియు అనుభవిస్తున్న శ్రమలకు, కష్టాలకు మరణం ముగింపు తెచ్చినప్పటికీ, వారు చేసిన పరిచర్య మాత్రం ఈ లోకములో జీవించుచునే యున్నది. దేవుని పరిచర్య చేస్తూ ఆయన రాజ్యం నిమిత్తం మరణించిన అటువంటి మిషనరీలలో హ్యాటీ జడ్సన్ ఒకరు.
హ్యాటీ జడ్సన్ ప్రసిద్ధ మిషనరీయైన అడోనిరామ్ జడ్సన్ యొక్క దూరపు బంధువు. 1892వ సంll లో భారతదేశానికి చేరుకున్న హ్యాటీ, మధ్యప్రదేశ్‌లోని హర్దాలో తన మిషనరీ పనిని ప్రారంభించారు. ప్రారంభంలో ఆమె ఆ ప్రాంతంలోని ఒక బాలికల పాఠశాలకు పర్యవేక్షకురాలిగా పని చేశారు. అలుపెరుగని ఆమె శ్రమ కారణంగా ఆమె సంరక్షణలో ఆ పాఠశాల ఎంతో అభివృద్ధి చెందింది. అప్పటిలో ప్రబలంగా ఉన్న భారతీయ ఆచారాల ప్రకారం తల్లిదండ్రులు సాధారణంగా చాలా చిన్న వయస్సులోనే తమ కుమార్తెలకు బలవంతముగా వివాహం చేసేవారు. అయితే వారికున్న అటువంటి మనస్తత్వాన్ని మార్చుటకు హ్యాటీ ఎంతగానో ప్రయత్నించారు మరియు వారి కుమార్తెలు మంచి భవిష్యత్తును కలిగియుండునట్లు వివాహానికి ముందు వారు వారి చదువును పూర్తి చేయుటకు అనుమతించవలెనని ఆమె భారతీయులను ప్రోత్సహించారు. ఆమె కనుపరిచే ఉత్సాహం మరియు ఆమె శ్రమ వారి కుమార్తెలను పాఠశాలకు పంపునట్లు అనేక కుటుంబాలను ప్రోత్సహించడంతో త్వరలోనే ఆ పాఠశాలలోని విద్యార్థినీల సంఖ్య 10 నుండి 37 కి పెరిగింది.
కనికరము కలిగిన వ్యక్తిగాను మరియు ఎల్లప్పుడూ సంతోషమును కనుపరిచేవారిగాను పేరుపొందిన హ్యాటీ, తన సంరక్షణలో ఉంచబడిన ప్రభుని మందను భద్రపరచుటకు త్యాగపూరితమైన జీవితమును జీవించారు. 1897వ సంll లో మధ్య భారతదేశంలో భయంకరమైన కరువు కలిగింది మరియు తెగులు వ్యాపించింది. ఆ సమయములో సహాయ చర్యలను చేపట్టిన వారికి సహాయమందించుటకుగాను ఆమె మహోబా అనే ప్రాంతమునకు వెళ్ళారు. అక్కడ ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నవారికి మరియు పేదలకు ఆహారమందించుటలో తన శక్తినంతటినీ ఉపయోగించారు. ప్రజలు బ్రతుకుటకుగాను తన సంపాదన మొత్తాన్ని కూడా మిషన్ పనికి ఇచ్చారు హ్యాటీ. మహోబాలో ఆమె ఎంతగానో శ్రమించి సేవలను అందించగా, దాని వలన ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతింది. తత్ఫలితంగా ఆమె టైఫాయిడ్ జ్వరముతో బాధపడి, చివరికి 1897వ సంll లో పరమందు తన ప్రభువును చేరుకొనుటకు ఈ లోకమును విడిచి వెళ్ళారు. అనారోగ్యముతో బాధపడుతున్న సమయములో కూడా లేచి పిల్లలకు సంరక్షణ నందించవలెననునది ఆమెలో ఉన్న నిరంతర వాంఛ.
ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది :
ప్రియమైనవారలారా, మీ సంరక్షణలో ఉంచబడిన ఆత్మల యొక్క ఆత్మీయ ప్రయోజనం కొరకు మీరు త్యాగపూరితమైన జీవితమును జీవించుచున్నారా?
ప్రార్థన :
"ప్రభువా, పరిశుద్ధమును మీకు అంగీకారయుతమునైన త్యాగపూరితమైన జీవితమును జీవించుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"
దేవునికే మహిమ కలుగునుగాక!
No comments:
Post a Comment