Search Here

Jul 25, 2022

Henry Harris Jessup | హెన్రీ హారిస్ జెస్సప్

హెన్రీ హారిస్ జెస్సప్ జీవిత చరిత్ర



  • జననం: 1832
  • మహిమ ప్రవేశం: 1910
  • స్వస్థలం: పెన్సిల్వేనియా
  • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  • దర్శన స్థలము: సిరియా మరియు లెబానోను


అమెరికాకు చెందిన మిషనరీయైన హెన్రీ హారిస్ జెస్సప్ సిరియా మరియు లెబానోనులలో సువార్త వెలుగును తిరిగి ప్రజ్వలింపజేయుటకు దేవుడు వాడుకొనిన ఒక సాధనం. మొదటి నుండి కూడా అతని తల్లిదండ్రులు అతనిని దేవుని యొక్క వాక్యోపదేశముతో అతనిని పెంచారు. అతను 20ll సం ల వయసులో ఒక మిషనరీ సమావేశాన్ని నడిపిస్తున్నప్పుడు మొట్టమొదటి సారిగా తాను కూడా మిషనరీ కావాలనే ఆలోచన అతనికి కలిగింది. ఆ సమయంలో తాను మిషనరీగా వెళ్ళుటకు సిద్ధంగా లేకుండా ఇతరులకు మిషనరీ సేవ చేయమని చెప్పటం వేషధారితనమని అతనికి తోచింది. కాగా అతను దేవుడు ఏ స్థలమునకు తీసుకువెళ్ళినా అక్కడికి వెళ్ళి సేవచేయవలెనని ప్రార్థనాపూర్వకముగా తనను తాను సమర్పించుకున్నారు.


తత్ఫలితముగా 1856వ సంll లో సిరియాలోని స్ముర్న చేరుకున్నారు హెన్రీ. ‘ఏమి మేలు చేయగలం?’ మరియు ‘దానిని ఏ విధంగా చేయవచ్చు?’ అనే రెండు ప్రశ్నలు పునాదులుగా అక్కడ అతని పరిచర్య స్థాపించబడింది. తద్వారా, పాఠశాలలను స్థాపించడం, బైబిలు అనువాదం, ప్రసంగించడం మరియు క్రైస్తవ రచనలను ప్రచురించడం మొదలగు సేవలు ప్రారంభమయ్యాయి. అక్కడ హెన్రీ మరియు అతని సహచరులు ‘బైబిల్ మెన్’ (బైబిలు మనుషులు) అని పిలువబడేవారు. వారి పట్ల స్థానిక ఇస్లాం షేక్‌లు ద్వేష భావమును కలిగియుండేవారు. క్రైస్తవులు మరియు ముస్లింల మధ్య తరచూ జరిగే యుద్ధాల కారణంగా హెన్రీ ప్రాణాలకు అక్కడ నిరంతరం ముప్పు పొంచి ఉండేది. అక్కడి ముస్లింలు "మా హాలా, మా హాలా, కోట్లెన్ నసరా!", అనగా "ఎంత మధురం, ఎంత మధురం, క్రైస్తవులను చంపడం!" అని పాడేవారు. తన చుట్టూ ఉన్న సహపరిచారకులు మరియు విశ్వాసులు చంపబడుతున్నప్పటికీ, అటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల మధ్య కూడా అతను స్థిరముగా నిలబడి, నలభై సంవత్సరాలకు పైగా ప్రభు పరిచర్యలో ముందుకు సాగిపోయారు. 


అరబ్బు దేశాలలో మిషనరీ పనిని చేపట్టుటకు ఎంతో మంది మిషనరీలను ప్రభావితం చేయడంలో హెన్రీ ఒక ప్రాముఖ్యమైన పాత్ర పోషించారు. స్వదేశంలో కూడా సిరియాలోని మిషనరీ సేవ వైపుకు మరియు సిరియా ప్రజల అవసరతల వైపుకు ప్రజల దృష్టిని మరల్చుటకై అతను తాను చేయగలిగినదంతా చేశారు. సిరియాకు వెళ్ళేముందు నెవార్క్‌లో ఒక గొప్ప పిల్లల సమూహముతో మాట్లాడిన అతను, ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు ఒక తీర్మానం వ్రాయమని వారిని ఎంతగానో కోరారు. అదేమనగా, "దేవుడు నాకు కృపననుగ్రహించినట్లయితే నేను ఒక మిషనరీ అవుతానని తీర్మానించుకుంటున్నాను." ఆ సమూహంలో ఉన్న పిల్లలలో ఒకరు అరబ్బు దేశాలలో చెప్పుకోదగ్గ గొప్ప మిషనరీ పరిచర్యను జరిగించిన డాll జేమ్స్ డెన్నిస్!


సమర్పణ మరియు దీనత్వములను కలిగిన మిషనరీగా తాను సాధించినవాటి నుండి తనకు ఎటువంటి ఘనతనూ ఆశించని హెన్రీ హారిస్ జెస్సప్, 1910వ సంll లో ఈ లోకములో తన యాత్రను ముగించి ప్రభు సన్నిధానమును చేరుకున్నారు.


ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, మీరు ఏమి బోధించుచున్నారో దానిని మీరు ఆచరించుచున్నారా? 


ప్రార్థన :

"ప్రభువా, నీవు నాకు కృపననుగ్రహించినట్లయితే నేను ఒక మిషనరీ అవుతానని తీర్మానించుకుంటున్నాను ఆమేన్!" 

దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • No comments:

    Post a Comment