Search Here

Jul 25, 2022

Hope Masterton Waddell | హోప్ మాస్టర్టన్ వాడెల్

హోప్ మాస్టర్టన్ వాడెల్ జీవిత చరిత్ర




  • జననం: 14-11-1804
  • మహిమ ప్రవేశం: 18-04-1895
  • స్వస్థలం: డబ్లిన్
  • దేశం: ఐర్లాండ్
  • దర్శన స్థలము: జమైకా మరియు నైజీరియా


ఐర్లాండుకు చెందిన హోప్ మాస్టర్టన్ వాడెల్, జమైకా మరియు నైజీరియాలలో సేవ చేసిన ఒక వైద్య మిషనరీ. తన చిన్ననాటి నుండే దేవుని సేవ చేయాలనే బలమైన వాంఛ అతనిలో ఉన్నప్పటికీ, అతను కలిగియున్న మాట మాంద్యము అందుకు అడ్డంకిగా నిలిచింది. అయితే, లక్షలాది మంది ఇశ్రాయేలీయులను నడిపించుటకు నోటి మాంద్యము గల మోషేను వాడుకొనగలిగిన దేవుడు, వాడెల్‌ను కూడా వాడుకొనగలడు కాదా? అవును! వాడెల్ ఒక మందుల షాపులో సహాయకునిగా పనిచేస్తున్నప్పుడు మిషనరీ సేవ చేయుటకు దేవుడు అతనికి ఒక మార్గమును తెరిచాడు. కాగా ఈడెన్‌బర్గ్‌లో సేవ కొరకైన శిక్షణ పొందిన తరువాత ‘స్కాటిష్ మిషనరీ సొసైటీ’ మిషనరీ సేవ చేయుటకు అతనిని జమైకాకు పంపింది.


“ఐరోపావారి సమాధి” అని పిలువబడే జమైకా సేవ చేయుటకు మిగుల కష్టతరమైన ప్రదేశమని చెప్పవచ్చు. ఒకవైపు అక్కడి వాతావరణ పరిస్థితులు ఒక సవాలుగా నిలిస్తే, మరొకవైపు బానిస వ్యాపారమే ఆధారముగా నడిపించబడుచున్న సామాజిక పరిస్థితులు మరొక సవాలుగా మారాయి. వాడెల్ జమైకా యొక్క నలుమూలలకూ ప్రయాణించి అక్కడ స్థానికముగా ఉన్న అవసరతలను అర్థం చేసుకున్నారు. చివరకు కార్న్‌వాల్ వద్ద ఒక మిషన్ స్టేషన్‌ను స్థాపించిన అతను, అక్కడ బానిసల మధ్య పరిచర్య చేసి క్రీస్తులో దొరికే స్వాతంత్య్రమును అనుభవించునట్లు వారిలో అనేకమందికి సహాయం చేశారు. అయితే 1839వ సంవత్సరపు బానిసల తిరుగుబాటు వలన భయాందోళనకరమైన పరిస్థితులను కూడా అతను ఎదుర్కొనవలసి వచ్చింది. ఏలయనగా, పరదేశులుగా అక్కడికి వచ్చి ఆక్రమించుకొని నాయకత్వమును చేజిక్కించుకున్నవారు (కొలోనియలిస్టులు) స్వేచ్ఛ సమానత్వాల గురించిన ఆలోచనలను బానిసలకు కలిగిస్తున్నావంటూ అతనిని నిందించారు. అయినప్పటికీ, అనేక సవాళ్ళతో కూడిన పరిస్థితుల మధ్య కూడా బానిసలకు మరియు యజమానులకు ఇరువురికీ క్రీస్తు ప్రేమను చూపించారు వాడెల్. 


జమైకాలో 16 సంll ల పాటు పరిచర్య చేసిన తరువాత, నైజీరియాలోని కాలాబార్‌లో సేవ చేయుటకు అతను నియమించబడ్డారు. కాగా సంతోషముగా మరికొందరు మిషనరీలతో కలిసి 1846వ సంll లో కాలాబార్ చేరుకున్నారు వాడెల్. తదుపరి అతను ఎంతో అధికముగా మంత్రవిద్యను అభ్యసించే ప్రజలు గల క్రీక్ టౌన్ నగరములో స్థిరపడ్డారు. అక్కడ అతను మంత్రవిద్య, బహుభార్యాత్వం, నరబలి మరియు శిశుహత్య వంటి చెడు సామాజిక పద్ధతులను అంతం చేయుటకు ఎంతో కృషి చేశారు. రాజైన ఇయో యొక్క నమ్మకాన్ని సంపాదించగలిగిన వాడెల్, అతనికి పది ఆజ్ఞలను నేర్పించగా, ఆ ఆజ్ఞల ఆధారంగా ఇయో రాజు కాలాబార్ సమాజమును పూర్తిగా సంస్కరించాడు. ఒక వైద్య నిపుణుడైన వాడెల్, అక్కడ యెల్లో ఫీవర్ అనే జ్వరము వ్యాప్తి చెందకుండా ఉండుటకు కూడా ఎంతో శ్రమించారు. అతని మిషనరీ సేవా కార్యకలాపాలు అరోచుక్వు, ఓహాఫియా, అబిరిబా మరియు అఫిక్పో వంటి ఇతర ప్రాంతములకు కూడా వ్యాపించాయి.


కాలాబార్‌లో 12 సంll ల పాటు తీవ్రముగా మిషనరీ పరిచర్య జరిగించిన తరువాత తన స్వదేశానికి తిరిగి వెళ్ళిన హోప్ మాస్టర్టన్ వాడెల్, 1895వ సంll లో తాను మరణించేంత వరకు కూడా అక్కడ పరిచర్య చేస్తూ ప్రభు సేవలో ముందుకు సాగిపోయారు.


ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, మీరు శారీరక లోటుపాట్లను కలిగియున్నప్పటికీ మిమ్ములను వాడుకొనుటకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు. అయితే సేవ చేయుటకు మీరు సిద్ధమేనా? 


ప్రార్థన :

"ప్రభువా, నా బలహీనతలలో మీ బలము పరిపూర్ణమగునట్లు చేసి, మీ మహిమార్థమై నన్ను వాడుకొనుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • No comments:

    Post a Comment