డేవిడ్ లివింగ్‌స్టన్ గారి జీవిత చరిత్ర
- జననం : 19-03-1813
- మరణం : 01-05-1873
- స్వదేశం : స్కాట్లాండ్
- దర్శన స్థలము : ఆఫ్రికా
స్కాట్లాండుకు చెందిన డేవిడ్ లివింగ్‌స్టన్ ఒక వైద్యుడు, ఆఫ్రికా అన్వేషకుడు మరియు మిషనరీ. అతను బాల్యంలో ప్రత్తి మిల్లులలో కష్టపడి పనిచేస్తూ, సాయంకాలపు పాఠశాలలకు హాజరయ్యేవారు. అతను చదివిన మిషనరీ కథలు మరియు అతని సండే స్కూల్ (ఆదివారపు బైబిలు పాఠశాల) ఉపాధ్యాయుని బోధనలు యవ్వనస్థుడైన లివింగ్‌స్టన్‌పై తీవ్ర ఆధ్యాత్మిక ప్రభావాన్ని చూపాయి. చైనాకు వైద్య మిషనరీలు అవసరమని చేసిన విజ్ఞాపనతో ఆకర్షింపబడిన అతను, గ్లాస్గోలో వైద్య మరియు వేదాంతశాస్త్రములను అభ్యసించారు. అయితే, ఆఫ్రికాలోని మరొక మార్గదర్శక మిషనరీ అయిన రాబర్ట్ మోఫాట్‌ను ఒకసారి అతను సంధించడం జరుగగా, అది ఆఫ్రికాలోని పరిచర్యకు అతను సమర్పించుకొనుటకు కారణమయ్యింది. కాగా లండన్ నగరంలో సేవ చేయుటకు అర్హులుగా నియమింపబడిన పిమ్మట 1841వ సంll లో అతను ఆఫ్రికాలోని కేప్ టౌన్ నగరమునకు పయనమయ్యారు.
మొదటిలో రాబర్ట్ మోఫాట్ ఆధ్వర్యంలో ష్వానా ప్రాంతంలో కొంతకాలం సేవ చేసిన లివింగ్‌స్టన్, తరువాత జాంబియా మరియు మొజాంబిక్ వంటి ప్రదేశాలకు సువార్తను తీసుకువెళ్ళవలెనని ఉత్తర దిశగా ప్రయాణించారు. పిమ్మట బ్రిటన్ లో కొంతకాలం గడిపిన తరువాత, తిరిగి అతను సువార్తను జాంబేజీ నది మరియు మాలావి సరస్సు భూములకు తీసుకువెళ్ళుటకు తన మిషనరీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ సమయంలోనే అతను తన ప్రియమైన జీవిత భాగస్వామియైన మేరీ మోఫాట్‌ను కోల్పోవడం జరిగింది. అయినప్పటికీ, అతను తన పరిచర్యను కొనసాగించారు. అతని జీవిత ప్రాధాన్యత ఏమిటంటే బయటి ప్రపంచమునకు మరుగైయున్న చీకటి ఖండమైన ఆఫ్రికాలోని అంతర్గత ప్రదేశాలకు సువార్త వెలుగును కనుపరచి "క్రైస్తవ్యము మరియు నాగరికత" లను అందుబాటులోనికి తీసుకురాగలుగునట్లు అతను "దేవుని రహదారి" అని పిలిచే ఒక "మిషనరీ రోడ్డు" తెరువబడవలెననునదే.
లివింగ్‌స్టన్ వివిధ ప్రాంతాలను అన్వేషిస్తూ, తీరాలను చేరుకుంటూ, ఉపన్యాసాలు, ప్రసంగాలు, బోధలు మరియు వైద్యం చేస్తూ సంచరించేవారు. దర్శించిన ప్రతి స్థలము యొక్క భౌగోళిక లక్షణములను జాగ్రత్తగా పరిశీలించేవారు. నేటి మిషనరీ అన్వేషకులకు సూచనగా ఉండుటకై అతను అనేక దేశముల పటములను మళ్ళీ మళ్ళీ చిత్రీకరించారు. ఆ ఖండములోని బహు అంతర్గత ప్రాంతములలో నివసిస్తున్న ప్రజలకు క్రైస్తవ్యమును పరిచయం చేయుటకు అతను నరమాంసభక్షకులను, కౄరులను మరియు అక్కడ నెలకొనియున్న బానిసత్వం వంటి భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ, అతను సహనముతో అన్నింటినీ భరించారు మరియు అనేక కలవరపరిచే పరిస్థితులలో 'విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన' క్రీస్తు నుండి తన దృష్టిని ఎన్నడూ మళ్ళించలేదు. స్థానిక తెగల వారికి సువార్తను ప్రకటించుటకును మరియు ఆఫ్రికాలో బానిస వ్యాపారాన్ని నిర్మూలము చేయుటకును తన జీవితంలో ముప్పై సంవత్సరాల పాటు నిర్విరామంగా శ్రమించిన తరువాత 1873వ సంll లో దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించారు డేవిడ్ లివింగ్‌స్టన్.
ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది :
ప్రియమైనవారలారా, తెలియని ప్రదేశములకు వెళ్ళమని దేవుడు మిమ్ములను అడిగితే సాహసోపేతముగా ముందుకు వెళ్ళుటకు మీరు అంగీకరించెదరా?
ప్రార్థన : "ప్రభువా, మీరు నన్ను ఎక్కడ నిలువబెట్టెదరో అక్కడ మీ పని చేయునట్లు నన్ను బలపరచుము. ఆమేన్!"
దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !
No comments:
Post a Comment