పెర్సీ సి. మాథర్ గారి జీవిత చరిత్ర
- జననం : 09-12-1882
- మరణం : 24-05-1933
- స్వస్థలం : ఫ్లీట్‌వుడ్
- దేశం : ఇంగ్లాండ్
- దర్శన స్థలము : చైనా
పెర్సీ కన్నింగ్హమ్ మాథర్ మధ్య ఆసియాలో చైనా ఇంగ్లాండ్ మిషన్ స్థాపకులలో ఒకరైన ప్రొటెస్టెంట్ మిషనరీ. ఇంగ్లాండ్ దేశంలో జన్మించిన మాథర్ రైల్వేలో పనిచేశారు. నామ మాత్రపు క్రైస్తవునిగా వున్న అతను, జె. హెచ్.డాడ్రెల్ పరిచర్య ద్వారా క్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించి, తన జీవితమును దేవుని సేవ చేయుటకు సమర్పించుకున్నారు. ప్రారంభములో అతను చిన్న పిల్లల మధ్య పరిచర్య చేశారు మరియు తమ గ్రామములోను, చుట్టు ప్రక్కల ప్రాంతములలోను బోధించేవారు. తన నియామక అభిషేకం (ఆర్డినేషన్) కొరకు ఎదురు చూస్తున్న సమయంలో ‘చైనా ఇంన్లాండ్ మిషన్’ యొక్క పిలుపును విని, చైనాలో ప్రభువు సేవ చేయుటకు తనను తాను సమర్పించుకున్నారు మాథర్. గ్లాస్గో బైబిలు సంస్థలో వేదాంత శాస్త్రములో రెండు సంవత్సరాల పాటు శిక్షణ పొందిన పిమ్మట 1910వ సంll లో అతను చైనాకు పయనమయ్యారు.
మాథర్ చెైనా భాషను నేర్చుకొనుటకు అన్హుయ్ పరిధిలోని అంకింగ్ లో కొంత సమయం గడిపిన తరువాత జువాన్ జౌ నగరంలో తన మిషనరీ సేవను ప్రారంభించారు. తనకున్న వైద్య పరిజ్ఞానాన్ని ఉపయోగించి అతను స్థానిక ప్రజలకు వైద్య సహాయం అందిస్తూ, దానిని సువార్తను ప్రకటించుటకు అవకాశముగా మార్చుకున్నారు. మాథర్ ఎప్పుడూ ఒకే ప్రదేశంలో నివసించలేదు గానీ, ఒక ప్రదేశం నుండి మరియొక ప్రదేశానికి ప్రయాణిస్తూ అక్కడ నూతన మిషన్ క్షేత్రాలను ప్రారంభించారు. అతను తన సహోద్యోగియైన జార్జ్ హంటర్ తో కలిసి, మంగోలియా బాహ్య ప్రాంతములలో ప్రయాణిస్తూ, అక్కడి మంగోల్ తెగలు, చెైనా వ్యాపారులు మరియు సరిహద్దులలో స్థిరపడినవారి మధ్య 1914వ సంll వరకు సేవ చేశారు. ప్రయాణం వలన కలుగు ఇబ్బందులు మరియు తరచుగా మలేరియాతో బాధపడే మాథర్ యొక్క శారీరక అనారోగ్యం చైనాలోని వివిధ ప్రాంతాలకు సువార్తను తీసుకువెళ్ళుటలో అతనిని ఏమాత్రం ఆపలేకపోయాయి.
చైనా రిపబ్లిక్ యొక్క ప్రారంభ సంవత్సరాలలో ప్రజలకు సువార్త ప్రకటించుట చాలా కష్టమైంది. ఎందుకంటే వారు మూఢ నమ్మకాల బంధకాలలో ఉన్నవారుగా, విగ్రహాలను ఆరాధించేవారిగా మరియు నల్లమందుకి బానిసలుగా ఉన్నారు. అయిననూ ఆ ప్రజల హృదయములను మరియు ఆచారాలను అర్థం చేసుకున్న మాథర్, వారికి సువార్తను ప్రకటించుటకు సరియైన సమయం కొరకు ఎల్లప్పుడూ వేచియున్నారు. మాథర్ తన భాషా సామర్థ్యాలను సువార్త పత్రాలు, నిఘంటువులు, వ్యాకరణ పుస్తకాలు మరియు ఇతర భాషా అధ్యయన సహాయక పుస్తకాలను ప్రచురించుటకు ఉపయోగించారు. ఇవి వారి సేవలో వేగముగా ముందుకు సాగుటకు ఇతర మిషనరీలకు సహాయపడినవి. అయితే 1933వ సంll లో అనారోగ్య కారణంగా మాథర్ మరణించారు. అయినప్పటికీ అతని ప్రయాసము వ్యర్థము కాలేదు. ఏలయనగా అతని పరిచర్య మూలముగా సువార్త పరిచర్యకు ఎంతో అననుకూలమైన ప్రాంతమైన చెైనీస్ తర్కిస్తాన్ లో సువార్త ద్వారములు తెరువబడ్డాయి.
ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది :
ప్రియమైనవారలారా, దేవుడు మిమ్మును ఎక్కడ వుంచిననూ ఆయన చిత్తమును నెరవేర్చుటలో మీరు సంతోషించెదరా?
ప్రార్థన :
"ప్రభువా, అననుకూలమైన ప్రదేశాలకు కూడా సువార్తను తీసుకువెళ్ళుటకు నన్ను బలపరచుము. ఆమేన్!"
దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !
No comments:
Post a Comment