Search Here

May 13, 2023

Samuel S. Day | శామ్యూల్ ఎస్. డే

శామ్యూల్ ఎస్. డే గారి జీవిత చరిత్ర

Pictures shown are for illustration purpose only



  • జననం : 13-03-1808
  • మరణం : 17-09-1871
  • స్వస్థలం : బాస్టర్డ్ టౌన్‌షిప్, ఓంటారియో
  • దేశం  : కెనడా
  • దర్శన స్థలము : తెలుగు ప్రాంతం, భారతదేశం


"తెలుగు మిషన్" వ్యవస్థాపకుడైన శామ్యూల్ స్టెర్న్స్ డే అమెరికాకు చెందిన ఒక బాప్తిస్టు మిషనరీ. అతను తెలుగు మాట్లాడే ప్రజలకు వెలుగు తీసుకురావలెనని ఎంతో భారం కలిగి ఉన్నవారు. కాగా తన భార్యయైన రొయెన్నాతో కలిసి భారతదేశానికి వచ్చిన అతను, 1836వ సంll లో విశాఖపట్నంలో మిషనరీగా సేవను ప్రారంభించారు. తరువాత శ్రీకాకుళంకు వెళ్ళిన అతను, మరుసటి ఏడాది నాటికి మద్రాసుకు వెళ్ళారు. మద్రాసులో సేవ చేస్తున్న రోజులలో అక్కడి నుండి తెలుగువారి ప్రాంతానికి అనేక మార్లు పర్యటించారు శామ్యూల్. కాగా ఒక కోటికి పైగా ప్రజలు నివసిస్తున్న మద్రాసు మరియు విశాఖపట్నాలకు మధ్య ఉన్న ప్రాంతములో ఒక్క మిషనరీ కూడా లేరని గ్రహించిన అతని హృదయం ఎంతో భారముతో నిండిపోయింది. తత్ఫలితముగా 1840వ సంll లో అతను తెలుగువారి ప్రాంతమైన నెల్లూరుకు వచ్చి, అక్కడ “తెలుగు మిషన్” ను స్థాపించారు. నెల్లూరు ప్రాంతంలో సువార్తను ప్రకటించిన అతను, 1844వ సంll నాటికి కొద్దిమంది విశ్వాసులతో అక్కడ ఒక క్రెస్తవ సంఘమును ప్రారంభించారు. అప్పుడు ఉన్న తెలుగు బైబిలు యొక్క అనువాదాలను మెరుగుపరచడంలో కూడా అతను సహాయమందించారు. ఆ దంపతులిరువురూ కలిసి బాలురు మరియు బాలికల కొరకు పాఠశాలలను కూడా స్థాపించారు. అప్పుడే వికసిస్తున్న మొగ్గగా ఉన్న ఆ పరిచర్య అతి త్వరలోనే అడ్డంకులను ఎదుర్కొంది. ఏలయనగా 1846వ సంll లో అనారోగ్యం కారణంగా ఆ మిషనరీ దంపతులు వారి స్వదేశానికి తిరిగి వెళ్ళవలసి వచ్చింది.


వారు అమెరికాలో ఉన్నప్పుడు, 'మిషనరీ యూనియన్' 'తెలుగు మిషన్' ‌ను వదలివేద్దామా అనే ప్రశ్నను లేవనెత్తింది. అయితే దేవుడు నమ్మకమైనవాడు. ఆ మిషన్ కొనసాగించబడులాగున ఆయన లైమాన్ జ్యూవెట్‌ను లేవనెత్తాడు. తద్వారా 1849వ సంll లో జ్యూవెట్ దంపతులతో కలిసి శామ్యూల్ డే తిరిగి భారతదేశానికి రాగా, నెల్లూరు మిషన్ వద్ద పరిచర్య తిరిగి జీవం పోసుకుంది. ఆ మిషనరీలు అనేక  పాఠశాలలను ప్రారంభించారు, విస్తృతమైన సువార్త సేవ చేశారు. శామ్యూల్ డే ఒక కష్టతరమైన ప్రయాణాన్ని చేపట్టి, పశ్చిమ దిక్కుగా ఉదయగిరి వరకు ప్రయాణించి ఆ మార్గములోని ప్రాంతాలలో సువార్తను ప్రకటిస్తూ వెళ్ళారు. అయితే, క్రైస్తవులుగా మారిన వారి సంఖ్య అంత గణనీయంగా లేని కారణంగా, 1853వ సంll మిషనరీ యూనియన్‌లో  'తెలుగు మిషన్' ‌ను వదలివేద్దామా అనునది మళ్ళీ చర్చనీయాంశమయ్యింది. కానీ, విస్తారమైన ఆ ప్రాంతంలో ఉన్న ఏకైక మిషన్ ఇది మాత్రమే. ఆ సత్యాన్ని ఎత్తి చూపుతూ  'తెలుగు మిషన్' ‌ను ఒక 'ఒంటరి నక్షత్రం' గా వర్ణిస్తూ ఎస్. ఎఫ్. స్మిత్ వ్రాసిన "ది లోన్ స్టార్" అనే కవిత మిషనరీ యూనియన్‌లోని సభ్యుల హృదయాలను కదిలించింది. తత్ఫలితముగా జ్యూవెట్ ద్వారా ఆ మిషన్ కొనసాగించబడుటకు ఆమోదించబడింది. ఆరోగ్యం క్షీణించడం వలన శామ్యూల్ డే 1853వ సంll లో తిరిగి అమెరికాకు వెళ్ళినప్పటికీ, భారతదేశంలోని మిషనరీ సేవల కొరకు నిధులను సేకరించుటకు అతను అమెరికాలో వివిధ ప్రాంతాలకు విస్తృతంగా ప్రయాణించారు.

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, వెలుగు లేని ప్రదేశములో మీరు ఒక “ఒంటరి నక్షత్రం” గా ప్రకాశించెదరా?

ప్రార్థన :

"ప్రభువా, ఇంకా అంధకారంలోనే మగ్గిపోతున్న ఆత్మల గురించిన భారం నాలో కలిగించి, వారికి వెలుగును తెచ్చుటకు నేను ప్రకాశించునట్లు సహాయము చేయుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • No comments:

    Post a Comment