మే బ్రౌన్ | Leta Mae Brown
జననం: -
మహిమ ప్రవేశం: -
స్వస్థలం: కాన్సాస్
దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
దర్శన స్థలము: భారతదేశం
కాన్సాస్‌లోని లిన్ కౌంటీలో ఉన్న పార్కర్ అనే ప్రాంతంలో జన్మించారు లెటా మే బ్రౌన్. అయితే చదువుకునే రోజులలో ఎక్కువ కాలం కాన్సాస్ నగరంలోనే గడిపిన ఆమె, అక్కడ ఉన్న 'క్రిస్టియన్ చర్చ్ హాస్పిటల్ ట్రైనింగ్ స్కూల్' లో నర్సుగా శిక్షణ పొందారు. తదుపరి రెండు సంవత్సరాల పాటు 'కాలేజ్ ఆఫ్ మిషన్స్' లో ప్రత్యేక శిక్షణను పొందారు.
1912వ సంll లో మిషనరీ నర్సుగా భారతదేశానికి చేరుకున్నారు లెటా. అక్కడ ప్రారంభంలో ఒక ఏడాది స్థానిక భాషను నేర్చుకొనుటకు ప్రత్యేక అభ్యాసమును సాగించిన పిమ్మట బిలాస్‌పూర్‌లో ఉన్న ఒక ఆసుపత్రిలో ఒక వైద్యునికి సహాయకురాలిగా పనిచేశారు. మిస్ బ్రౌనీ అని ఆప్యాయంగా పిలువబడే ఆమె, భారతదేశంలో నర్సుల శిక్షణకు మార్గదర్శకురాలిగా మారారు. భారతీయ స్త్రీలకు నర్సులుగా శిక్షణనివ్వటం అప్పటిలో ఒక కొత్త ఆలోచనగా ఉంది మరియు అది అంత తేలికైన పని కాదు. అయితే భారతీయ నర్సుల కొరకు ఏర్పరచబడిన ఒక శిక్షణా పాఠశాల యొక్క బాధ్యతలు ఆమెకు అప్పగించబడ్డాయి. అది అప్పటి వరకు ఎవరూ ప్రయత్నించని మరియు క్లిష్టమైన పని అయినప్పటికీ ఆమె ఎంతో చక్కగాను మరియు శ్రద్ధతోను ప్రభువుకు చేసినట్లే తన విధులన్నింటినీ నిర్వర్తించేవారు. ఆమె భారతదేశంలో సేవ చేసిన కాలంలో అధిక పక్షం వైద్య సేవలను అందించుటలో వైద్యులకు సహాయం చేస్తూ గడిపారు. ఆమె ఒక నర్సు అయినప్పటికీ వ్యాధులను గుర్తించి వాటికి చికిత్స చేయగల సామర్థ్యమును కూడా కలిగియున్నారు. ఇది వైద్యులు అందుబాటులో లేనప్పుడు కూడా వైద్య సేవలను కొనసాగించుటకు ఆమెకు సహాయపడింది.
దామోలో ఉన్న క్రైస్తవ సంఘములో పిల్లల మధ్య జరుగుతున్న సేవకు బాధ్యత వహించిన ఆమె, అక్కడ పిల్లలు మరియు పెద్దల కొరకు ఒక క్రైస్తవ నాటకమును నిర్వహించుటలో తన సమయమును మరియు శక్తిని వెచ్చించారు. ఆమె అనేక ఇతర సంఘ కార్యకలాపాలలో కూడా పాలుపంచుకునేవారు. తన సంరక్షణలో ఉంచబడిన మంద యొక్క ఆత్మీయ సంక్షేమం కొరకు శ్రమించారు లెటా. అంతేకాకుండా కుల్‌పహార్‌లో ఆధారములేని క్రైస్తవ మహిళల కొరకు ఏర్పరచబడిన గృహము యొక్క బాధ్యతలు కూడా ఆమె చేపట్టారు. తదుపరి తన పరిచర్య యొక్క మూడవ భాగంలో ఆమె పెండ్రా రోడ్ అనే ప్రాంతంలో వృత్తి సంబంధ చదువు కొరకు బాలికల కొరకు ఏర్పాటుచేయబడిన పాఠశాల యొక్క బాధ్యతలు నిర్వర్తించారు. అక్కడ నర్సులుగా శిక్షణ పొందుటకు కావలసిన విద్యార్హతను పూర్తి చేయుటకు బాలికలకు ఆమె ఎంతో చురుకుగా సహాయమందించారు లెటా. పాఠశాల కార్యకలాపాలతో పాటు చిన్న పిల్లల ఆత్మీయ అవసరతలను సంధించుటపై మరియు సువార్త సేవపై కూడా ఆమె దృష్టి నిలిపారు. ఆమె మరొక సన్నిహిత వ్యక్తితో కలిసి ‘సుమన్‌ఖేతన్ విట్నెస్ బ్యాండ్’ (సుమన్‌ఖేతన్ సాక్షి బృందం) అను బృందమును ఏర్పరిచారు. ఈ బృందమువారు పాటలు పాడుతూ, ఆత్మీయ కథలు చెబుతూ, లేఖన ప్రతులను మరియు ఇతర క్రైస్తవ రచనలను విక్రయిస్తూ క్రమం తప్పక గ్రామాలను సందర్శించి సువార్త సేవ చేసేవారు.
తన సెలవు దినములలోనూ మరియు పదవీ విరమణానంతరం కూడా ఆమె ప్రసంగాలు మరియు రచనల ద్వారా అమెరికా ప్రజలు భారతదేశం గురించి మరియు అక్కడ జరుగుచున్న మిషనరీ పనిని గురించి తెలుసుకొనుటకు తోడ్పడ్డారు. తన పూర్ణ సమయమును, శక్తిని మరియు సామర్థ్యములను దేవుని పని కొరకు ఉపయోగించి అలుపెరుగక శ్రమించిన దైవ సేవకురాలు లెటా మే బ్రౌన్.
🚸 *ప్రియమైనవారలారా, మీ సమయమును మరియు శక్తి సామర్థ్యములను మీరు ఎలా వాడుతున్నారు?* 🚸
🛐 *"ప్రభువా, నేను కలిగియున్నవాటిని మీ రాజ్యము నిమిత్తం సమర్థవంతముగా ఉపయోగించుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"* 🛐
🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏
Nice
ReplyDelete