జాన్ హంట్ | John Hunt
జననం : 13-06-1812
మరణం : 09-10-1848
స్వస్థలం : లింకన్‌షైర్
దేశం : ఇంగ్లాడు
దర్శన స్థలము : ఫిజీ దీవులు
జాన్ హంట్ ఇంగ్లాండు దేశంలోని లింకన్‌షైర్‌కు చెందినవారు. అతని తండ్రి అక్కడి వ్యవసాయ క్షేత్రములో పర్యవేక్షకునిగా (ఫామ్ బెయిలిఫ్‌గా) పనిచేసేవారు. తన కుటుంబం యొక్క పేలవమైన ఆర్థిక పరిస్థితి కారణంగా తన చదువును కొనసాగించలేకపోయిన జాన్ హంట్, పదేళ్ళ వయస్సు నుండే పనిచేయడం ప్రారంభించారు. అతని తల్లి దేవునియందలి భయభక్తులు కలిగిన స్త్రీ అయినప్పటికీ, జాన్ కేవలం తాను ఏదైనా భయములో ఉన్నప్పుడు మాత్రమే తనను కాపాడమని దేవునిని ప్రార్థించేవారు. అయితే, అతనికి పదిహేడేళ్ళ వయస్సు ఉన్నప్పుడు తీవ్రమైన అనారోగ్యానికి గురై మరణిస్తారేమో అన్న పరిస్థితి కూడా కలిగింది. ఆ అనుభవం దేవుని పట్ల అతను కలిగియున్న దృక్పథమును మార్చివేసింది. అతను దేవుని సన్నిధిలో మోకరించి తన జీవితమును తన రక్షకునికి సమర్పించారు. కాగా ప్రార్థనలో ఎంతో కనిపెట్టిన పిమ్మట, మిషనరీ సేవ నిమిత్తం శిక్షణ పొందుట కొరకై లండన్ నగరంలోని వెస్లియన్ థియోలాజికల్ ఇన్‌స్టిట్యూషన్‌లో చేరారు జాన్. లండన్‌లో అతను తృణీకరించబడిన వారి మధ్యను, యవ్వనస్థుల మధ్యను సేవ చేసి, వారికి దేవుని వాక్యమును బోధించారు. సేవ చేయుటకు అర్హులుగా అతను నియమించబడిన తరువాత 1838వ సంll లో ఫిజీలో జరుగుతున్న ఒక మిషనరీ పరిచర్యలో చేరుటకు అతనికి అవకాశం వచ్చింది.
ఫిజి ద్వీపవాసులు దొంగలు, అబద్ధములు చెప్పెడివారు, ఆహారం కొరకు వారిలో రోగులను హతమార్చి, సమాధులను దోచుకొనెడివారు. అయితే జాన్ ధైర్యంగా తన భార్యతో కలిసి అటువంటి కౄర స్వభావులకు సువార్తను ప్రకటించుటకు పయనమయ్యారు. ప్రారంభ దినములు వారికి బహు కష్టతరముగా ఉన్నాయి. ఏలయనగా వారి ఇంటికి కనుచూపు మేరలోనే స్థానికులు తినుటకు మనుష్యులను మంటలపై కాల్చేవారు. ఏదేమైనప్పటికీ, జాన్ తన భద్రత కొరకు మరియు తన కుటుంబ భద్రత కొరకు కేవలం దేవుని పైనే నమ్మికయుంచి తన మిషనరీ పనిని కొనసాగించారు. అతను ఆ ద్వీపవాసుల స్థానిక భాషలో ప్రావీణ్యం సంపాదించి, వారి ఆచారాలకు అనుగుణంగా నడుచుకున్నారు. అది క్రీస్తును స్థానిక ప్రజలకు తెలియపరచుటకు సహాయపడింది. స్థానికులు క్రైస్తవులుగా మారుట ఎంతో నెమ్మదిగా జరుగుతున్నప్పటికీ, రైతు వర్షం కొరకు ఏవిధముగా సహనముతో ఎదురుచూచునో జాన్ కూడా అదే విధంగా ఓపికగా వేచిచూశారు. చివరికి రేవా, సోమోసోమో మరియు వివా దీవులలో ఉజ్జీవం ప్రారంభమైంది. అనేకమంది క్రీస్తును తమ రక్షకునిగా అంగీకరించారు. కాగా జాన్ స్థానిక భాషలోనికి క్రొత్త నిబంధనను అనువదించి, ప్రజలకు దానిని చదవడం నేర్పించారు.
జాన్ అసాధారణమైన ఉత్సాహంతో నిండుకొనియున్న దీనత్వము కలిగిన వ్యక్తి. చేయవలసిన పని ఉన్నప్పుడు ఎక్కువసేపు విశ్రాంతి తీసుకొనలేనటువంటి వారిలో అతను ఒకరు. అతను అంత ఎక్కువగా విద్యాభ్యాసాన్ని కలిగియుండకపోయినప్పటికీ, దేవుని వాక్య సత్యములను గురించి మంచి అవగాహన కలిగియున్నారు. అది క్రీస్తు కొరకు అనేక ఆత్మలను సంపాదించుటకు అతనికి తోడ్పడింది. తన శక్తి క్షీణించి పోయేంత వరకు విశ్రమించక పనిచేసిన జాన్ హంట్, 36 సంll ల వయస్సులోనే ఈ లోకములో తన యాత్రను ముగించారు.
🚸 *ప్రియమైనవారలారా, ప్రభువు ఏ స్థలమునకు మిమ్మును పంపునో అక్కడికి వెళ్ళి సేవ చేయుటకు మీరు సిద్ధముగా ఉన్నారా?* 🚸
🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏
No comments:
Post a Comment