విన్సెంట్ డి పాల్ | Vincent de Paul జీవిత చరిత్ర
- జననం : 24-04-1581
- మరణం : 27-09-1660
- స్వస్థలం : పౌయ్
- దేశం : ఫ్రాన్స్
- దర్శన స్థలము : ఫ్రాన్స్
సువార్తను క్రియారూపకముగా తన జీవితములో కనుపరచుట ద్వారా మానవజాతిని ఎంతగానో ప్రభావితం చేసిన మిషనరీలలో విన్సెంట్ డి పాల్ ఒకరు. ఫ్రాన్స్‌లోని పౌయ్‌లో ఒక వ్యవసాయ కుటుంబములో జన్మించిన అతను, డాక్స్‌లో ఫ్రాన్సిస్కాన్లు అనే క్రైస్తవ వర్గపు వారి నుండి విద్యాభ్యాసం పొందారు. కీర్తి సంపదలను పొందవలెననే తలంపుతో పాదిరిగా పనిచేయుటను తన ఉపాధిగా ఎంచుకున్నారు విన్సెంట్. అది తన కుటుంబ పరిస్థితులు మెరుగుపడుటలో సహాయపడుతుందని అతను ఆశించారు. తద్వారా అతను టౌలౌస్ విశ్వవిద్యాలయంలో వేదాంతశాస్త్రమును అభ్యసించగా, 19 సంll ల వయస్సులో పాదిరిగా నియమితులయ్యారు. ప్రారంభంలో పాదిరిగా సేవ చేసేటప్పుడు ఉన్నత వర్గాల సభ్యులతో పరిచయాలను పెంచుకొనుటకే అధిక సమయమును వెచ్చించారు విన్సెంట్.
అయితే అతను సముద్రపు దొంగలచే పట్టబడి ఆఫ్రికాలో బానిసగా అమ్మబడగా అతని జీవితములో పెనుమార్పు చోటుచేసుకుంది. అక్కడ అతను కడు బీదరికమును ముఖాముఖిగా ఎదుర్కొన్నట్లు అయ్యింది. కాగా, ఆ బానిసత్వము నుండి గనుక తప్పింపబడినట్లయితే తాను కలిగియున్న ఆశయాలను విడిచిపెట్టి పేదలకు సేవ చేసెదనని అతను దేవుని సన్నిధిలో ప్రమాణం చేశారు. చివరికి అతను అక్కడ నుండి బయటపడి ఫ్రాన్స్ చేరుకొనగలిగినప్పుడు తాను దేవునికి ఇచ్చిన మాట మీద అతను నిలబడ్డారు. తద్వారా పేదవారి మధ్య సువార్త సేవ చేయడం అతని పరిచర్య యొక్క కేంద్ర బిందువుగా మారింది.
అతను పారిస్ నగరమునకు వెళ్ళి వేలాదిమంది పేద ప్రజలకు చేయూతనిచ్చారు మరియు వేలాదిమంది పిల్లలను మరణకూపములో ఉన్నారన్నటువంటి పరిస్థితుల నుండి కాపాడారు. ఆత్మీయపరమైన పేదరికం కూడా ప్రజలలో ప్రబలంగా ఉన్నదని గ్రహించిన విన్సెంట్, దేవుని వాక్యాన్ని బోధించడం మరియు సేవా కార్యక్రమాలను నిర్వహించడం ప్రారంభించారు. అక్కడ కొంతకాలం ఒక పారిష్‌కు పాదిరిగా సేవలందించిన అతను, తదుపరి ఖైదు చేయబడిన ఓడలో పనిచేసే బానిసలకు ప్రార్థనా మందిర అధికారిగా (చాప్లైన్) సేవలందించారు. "సువార్త ప్రకటన అంటే కేవలం వాక్యం ప్రకటించుటకే పరిమితం కాదు, అది క్రియలలో బయలుపరచబడవలెను" అనునది అతని అభిప్రాయం. అందువలన అతను ‘కాంగ్రిగేషన్ ఆఫ్ ది మిషన్’ అనే క్రైస్తవ మత బృందమును ప్రారంభించారు. ఆకలితో అలమటిస్తున్న వారికి ఆహారం అందించుట తమ ప్రధాన లక్ష్యముగా పనిచేసిన ఈ బృందం, అదే సమయములో వారు జీవాహారమును కూడా పొందుకొనగలుగునట్లు క్రీస్తును గురించి వారికి బోధించింది.
పాదిరులు మరియు క్రైస్తవ పరిచారకులలో పెరుగుతున్న అజ్ఞానము మరియు నిక్కచ్చిగా ఉండుటలో ఉదాసీనతలను గురించి విన్సెంట్ ఎంతో ఆందోళన చెందారు. అందునుబట్టి అతను సంఘము యొక్క భవిష్యత్తు నాయకులకు సరియైన శిక్షణ ఇవ్వవలెనని దేవుని వైపుకు తిరుగమని పిలుపునిస్తూ పలు కూటములను, శిక్షణా కేంద్రములను నిర్వహించారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొనుటకు మహిళలను అతను ప్రోత్సహించగా, అది ‘డాటర్స్ ఆఫ్ ఛారిటీ’ (ప్రేమాదాతృత్వ పుత్రికలు) అనునది ఏర్పడుటకు దారితీసింది.
*దేవునికే మహిమ కలుగునుగాక!*
*ప్రియమైనవారలారా, కీర్తి సంపదలను వెంటాడుతున్న మీ ఆశయములను దేవుని సేవ నిమిత్తం విడిచిపెట్టుటకు మీరు సిద్ధముగా ఉన్నారా?*
🛐 *"ప్రభువా, ఇతరుల సంతృప్తిలో నా సంతోషమును కనుగొనునట్లు నాకు సహాయము చేయుము. ఆమేన్!"* 🛐
No comments:
Post a Comment