జార్జ్ లీల్ | George Liele జీవిత చరిత్ర
జననం : 1750
మరణం : 1828
స్వదేశం : అమెరికా సంయుక్త రాష్ట్రాలు
దర్శన స్థలము : అమెరికా సంయుక్త రాష్ట్రాలు
ఆఫ్రికా జాతికి చెందిన అమెరికన్లలో మొట్టమొదటి మిషనరీలలో ఒకరు జార్జ్ లీల్. అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఒక దేశంగా ఏర్పడుటకు ముందు బానిసల వ్యాపారంలో జార్జ్ కూడా బాధితులే. వర్జీనియాలో జన్మించిన అతను జార్జియాకు బానిసగా కొనిపోబడ్డారు. అక్కడ యేసు క్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించిన అతనిలో అతి త్వరలోనే తన తోటి బానిసల ఆత్మీయ స్థితిని గురించిన చింత కలిగింది. కాగా అతను వారికి బోధించడం ప్రారంభించారు. సేవ కొరకైన శిక్షణ పొందకపోయినప్పటికీ దేవుని వాక్యమును చదవడం నేర్చుకొనిన అతను, లేఖనములను ఇతర బానిసలకు వివరించేవారు. కీర్తనలను పాడమని వారిని ప్రోత్సహించి, వాటి భావమును వారికి వివరించి చెప్పేవారు జార్జ్. బానిసత్వం నుండి అతని యజమాని అతనికి విడుదలనిచ్చిన వెంటనే సేవ చేయుటలో అతను కలిగియున్న ఆత్మ వరమును బట్టియు, దేవుని వాక్యము పట్ల అతనికున్న ఆసక్తిని బట్టియు జార్జియాలోని ఒక బాప్తిస్టు సంఘం అక్కడ బోధించుటకు అతనిని ఆహ్వానించింది.
పిమ్మట రెండేళ్ళ పాటు నూతన విశ్వాసులైన నల్లజాతీయుల సమాజానికి దేవుని వాక్యమును బోధించారు జార్జ్. తరువాత ఇది అమెరికాలో ఏర్పడిన మొట్టమొదటి నల్లజాతీయుల సంఘముగా మారింది. తన యజమాని మరణించగా, తిరిగి తాను బానిసగా చేయబడకుండునట్లు అతను తన భార్యయైన హన్నాతో కలిసి జార్జియాలోని సవన్నాకు వెళ్ళారు. అక్కడ అతను బాప్తిస్టులైన నల్లజాతి బానిసలు మరియు స్వతంత్రుల కొరకు ఒక సమాజమును స్థాపించారు. అతని పరిచర్య మరింత ఫలభరితమవ్వగా, ఈ సమాజం సవన్నాలోని మొదటి ఆఫ్రికన్ బాప్తిస్టు సంఘముగా మారింది.
ఏ క్రైస్తవ సంఘము ద్వారా గానీ లేదా మిషన్ సంస్థ ద్వారా గానీ ఎటువంటి మద్దతు అతనికి లేనప్పటికీ, ఒక విదేశీ మిషన్‌ను స్థాపించిన మొట్టమొదటి ప్రొటెస్టెంట్ మిషనరీ అయ్యారు జార్జ్. తన పూర్వపు యజమాని యొక్క వారసులు కొందరు అతనిని తిరిగి వారికి బానిసగా చేసుకొనవలెనని ప్రయత్నించడంతో అతను 1783వ సంll లో జమైకాకు వెళ్ళారు. జమైకాలో అతను స్వతంత్రులకును మరియు సాధారణంగా పేదరికంలోనే ఉండే బానిసలకును సువార్తను ప్రకటించారు. "... మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశమువారైనను అనేకులు పిలువబడలేదు గాని..." అని 1 కొరింథీ 1:26లో చెప్పబడినదానిని అతనిచే నడిపింపబడిన క్రైస్తవ సమాజం ప్రతిబింబిస్తుంది.
జార్జ్ ఏనాడూ తన పరిచర్యకు వేతనమును తన కొరకు తీసుకొనలేదు. అందులో అధిక మొత్తం బానిసలకు పంపబడేది. ఒక బానిసగా తన జీవితమును ప్రారంభించినప్పటికీ అతను 1828వ సంll లో తన మరణము వరకు కూడా క్రీస్తులో స్వతంత్రునిగా జీవించారు. అంతేకాకుండా వారి ప్రభావం ద్వారా నేటికీ ఈ ప్రపంచానికి స్వేచ్ఛను తీసుకువస్తున్న అనేకమంది ధైర్యముతో నిండుకొనిన దైవ సేవకులను లేవనెత్తారు జార్జ్ లీల్.
🚸 *ప్రియమైనవారలారా, మీ జీవితాలలో పాప నియమం నుండి మీరు విముక్తి పొందియుండగా, వారి పాపముల నుండి ఇతరులకు విడుదల కలిగించుటకు మీరు ముందుకు వెళ్ళెదరా?* 🚸
🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏
No comments:
Post a Comment