ఫార్చ్యూనాటస్ హెన్రీ కామన్ట్ | Fortunatus Henri Caumont
- జననం: 10-12-1871
- మహిమ ప్రవేశం: 04-04-1930
- స్వస్థలం: టూర్స్
- దేశం: ఫ్రాన్స్
- దర్శనము: భారతదేశం
ఫార్చ్యూనాటస్ హెన్రీ కామన్ట్ భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో సేవ చేసిన ఒక ఫ్రెంచ్ మిషనరీ. మొదటి నుండి దేవునియందలి భయభక్తులతో పెరిగిన ఫార్చ్యూనాటస్, తన బాల్యం నుండే దేవునికి సేవ చేయాలనే లోతైన వాంఛను కలిగియున్నారు. అయితే చాలా చిన్న వయస్సులోనే తన తండ్రిని కోల్పోవడంతో కుటుంబాన్ని పోషించే బాధ్యతను తాను చేపట్టవలసి వచ్చింది. కాగా అతను ఎంతో కష్టపడి పనిచేశారు, కష్టాల మధ్య కూడా ప్రశాంతంగా ఉండి, తన కుటుంబానికి మంచి ఆధారంగా నిలిచారు. అయితే, ఒకానొక దశలో అతను దేవునికి సేవ చేయాలని తనలో అంతర్గతముగా ఉన్న తీవ్రమైన వాంఛను ఏ మాత్రం ఇక అణచివేయలేక సేవ కొరకైన శిక్షణ పొందుటకు వెళ్ళారు. 1896వ సంll లో అతను నియామక అభిషేకం పొంది, మరుసటి సంవత్సరం భారతదేశంలోని రాజ్‌పుతానా మిషన్‌లో సేవ చేయుటకు పంపబడ్డారు.
రాజస్థానీ ప్రజలు ఆత్మీయముగాను మరియు భౌతికముగాను బీడు పడిపోయియున్న దుస్థితిని చూసిన హెన్రీ కనికరముతో చలించిపోయారు. తల్లి ఉత్తమ గురువు అని మరియు తల్లులందరూ తమ పిల్లలకు నిజమైన దేవుని గురించి బోధించగలిగినట్లయితే తరువాతి తరము యొక్క ఆత్మీయ స్థితి సురక్షితంగా ఉంటుందని అతను విశ్వసించారు. కావున, అతను ప్రధానంగా మహిళలకు సువార్తను అందించడంపై దృష్టి నిలిపారు. అయితే, భారతదేశంలో ప్రబలంగా ఉన్న పర్దా వ్యవస్థ వలన పురుషులు స్త్రీలతో మాట్లాడుటకు అనుమతించబడని కారణముగా అతనికి గొప్ప ఆటంకము ఏర్పడింది. కాగా, మహిళలు మాత్రమే ఇతర మహిళలను సంప్రదించగలరని గ్రహించిన హెన్రీ, 1906వ సంll లో అజ్మీర్‌లో ‘ప్రభుదాసి సిస్టర్స్’ (ప్రభువు యొక్క మహిళా పరిచారకులు) అనే సంఘమును ప్రారంభించారు. ఈ సంఘం రాజస్థాన్‌లోనే కాకుండా ఉత్తర భారతదేశం యొక్క ఇతర ప్రాంతాలలో కూడా సువార్త ప్రకటించుటకు ఒక సమర్థవంతమైన సాధనంగా మారింది.
రాజపుత్ర వంశమునకు చెందిన పురుషులకు విద్యను పొందుటకు మంచి అవకాశాలు ఉన్నాయి గానీ, మహిళలకు కాదు. కావున, రాజస్థాన్ బాలికలకు విద్యను అందించవలెనని పూనుకొనిన హెన్రీ, ‘మిషన్ సిస్టర్స్ ఆఫ్ అజ్మీర్’ అనే సంఘమును స్థాపించి, ఆ సంఘం ద్వారా అనేక పాఠశాలలను స్థాపించారు. ఆ పాఠశాలలు నేడు రాజస్థాన్‌లో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలుగా నిలిచియున్నాయి.
హెన్రీ దేవుని కొరకు ఎంతో రోషము కలిగిన మిషనరీగా ఉన్నారు. తన ఆరోగ్యమును కూడా లెక్క చేయకుండా అతను సువార్తను ప్రకటించుటకు ఎప్పుడూ ప్రయాణిస్తూనే ఉండేవారు. ఆ విధంగా ఒకసారి మధ్యప్రదేశ్‌లోని ఝాబువాకు వెళ్ళినప్పుడు అతను ఎంతో బలహీనమయ్యారు. “యేసూ, ఎటువంటి ఆక్షేపణలు లేకుండా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆమేన్!” అని పలుకుతూ, 1930వ సంll ఏప్రిల్ మాసం 4వ తారీఖున తన తుది శ్వాస విడిచారు ఫార్చ్యూనాటస్ హెన్రీ కామన్ట్.
ప్రియమైనవారలారా, ఎలాంటి ఆక్షేపణలు లేకుండా మీరు క్రీస్తును ప్రేమిస్తున్నారా?
"ప్రభువా, నీవు నన్ను ప్రేమించినంతగా నేను కూడా ఇతరులను పేమించునట్లు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"
దేవునికే మహిమ కలుగునుగాక!
No comments:
Post a Comment