ఫ్రెడరిక్ విలియం సావిడ్జ్ | Frederick William
- జననం: 1862
- మహిమ ప్రవేశం: 28-09-1935
- స్వస్థలం: కేంబ్రిడ్జ్‌షైర్
- దేశం: ఇంగ్లాండు
- దర్శన స్థలము: ఈశాన్య భారతదేశం
మిజోరాంలోని మిజో తెగలు ఒకప్పుడు నిరాశాజనకమైన కౄరులుగా పేరుగాంచారు. ఆంగ్లేయులు కూడా లుషాయ్ కొండలలోకి వెళ్ళుటకు సాహసించలేదు. రాక్షసులకు బలులను అర్పించే ఆ తెగలు నిరంతరం ఒకరితో ఒకరు పోరాడుతూ ఉండేవారు. అయితే, నేడు మిజోలలో 87 శాతం మంది క్రైస్తవులు అని చెబితే మీరు నమ్మగలరా? అవును, వారు దేవుని దృష్టిలో నిరాశాజనకమైన ప్రజలు కారు. వారు కూడా పాప బంధకముల నుండి విమోచన పొందుటకు ఆయన తన సేవకులను పంపాడు.
మిజో తెగల మధ్య సేవ చేసిన మొదటి మిషనరీలలో ఒకరు ఫ్రెడరిక్ విలియం సావిడ్జ్. డాక్టరేటు పట్టాను కలిగియున్న అతను, లండన్‌లో పాఠశాల ఉపాధ్యాయునిగా పని చేసేవారు. అక్కడ అతను ఈశాన్య భారతదేశంలో మిషనరీల కొరకు ఉన్న అవసరం గురించి తెలుసుకున్నారు. వెంటనే అతను తన ఉద్యోగానికి రాజీనామా చేసి, 1891వ సం లో బెంగాల్ చేరుకున్నారు. కానీ, మిజోరాం చేరుకొనుటకు అతనికి దాదాపు మరో మూడు సంవత్సరాలు పట్టింది. క్రీస్తు యొక్క శాంతి సందేశాన్ని వ్యాపింప చేయుటకు అతను తన స్నేహితుడైన జేమ్స్ హెర్బర్ట్ లోరైన్‌తో కలిసి ప్రమాదకరమైన ప్రయాణాన్ని ప్రారంభించారు.
మొదట అతను త్రిపురలో మిషనరీ పనిని ప్రారంభించాల్సి ఉంది గానీ స్థానిక మహారాజు తన భూభాగంలోకి అడుగుపెట్టుటకు అతనిని అనుమతించలేదు. కాబట్టి, అతను చిట్టగాంగ్‌కు వెళ్ళి మిజోరామ్‌లోకి ప్రవేశించుటకు అనుమతి కొరకు వేచి యున్నారు. అయితే లుషాయ్ తెగలు నిరంతరం పోరాడుతూ ఉన్నందున ఆ భూభాగంలోకి ప్రవేశించలేకపోయిన అతను సమీపంలోని కసలాంగ్ గ్రామంలో స్థిరపడాల్సి వచ్చింది. అక్కడ అతను ఆకలి బాధను, అరణ్యము యొక్క భయానక పరిస్థితులను మరియు తీవ్రమైన అనారోగ్యమును అనుభవించారు. అతని ఆరోగ్యం దృష్ట్యా అతను ఇంగ్లాండుకు తిరిగి వెళ్ళడం మంచిదని ఇతరులు సూచించినప్పటికీ వెనుకంజ వేయని ఈ మిషనరీ అక్కడే ఉండుటకు నిర్ణయించుకున్నారు. చివరికి 1894వ సంll జనవరి మాసంలో వారు మిజోరాంలోని ఐజ్వాల్‌కు వచ్చారు.
సావిడ్జ్ వెంటనే విద్యకు సంబంధించిన పనులను చేపట్టారు. అతని మొదటి ప్రాధాన్యత మిజో భాషకు అక్షరమాలను తయారుచేయడం. 1894వ సంll ఏప్రిల్ నాటికి స్థానికులకు విద్యను నేర్పించుటకు ఒక చిన్న పాఠశాలను ప్రారంభించారు సావిడ్జ్. తరువాత కొద్దికాలం అతను అరుణాచల్ ప్రదేశ్‌లో సేవ చేసి, తిరిగి దక్షిణ మిజోరాంకు వచ్చారు. అక్కడ తీవ్రమైన సువార్త సేవతో పాటు అతను అలుపెరుగకుండా పాఠశాలలను నడిపించారు, సామాజిక సేవలను అందించారు మరియు చిన్నపాటి ఔషధ వైద్యశాలలను నడిపారు. దేవుని రాజ్యము అభివృద్ధి చెందుటతో పాటు ఆ ప్రాంతము అన్ని విధాలా అభివృద్ధిని సంతరించుకుంది.
35 సంవత్సరాల పాటు తీవ్రమైన పరిచర్య జరిగించిన తరువాత 1925వ సంll లో పదవీ విరమణ పొందిన ఫ్రెడరిక్ విలియం సావిడ్జ్, 1935వ సంll లో పరమందు తన ప్రభువును చేరుకొన ఇహలోకము విడిచి వెళ్ళారు.
ప్రియమైనవారలారా, దేవుని సేవించుటకుగాను మీ విలువైన మరియు ఉన్నతమైన విద్యార్హతలను వదులుకొనుటకు మీరు సిద్ధముగా ఉన్నారా?
ప్రభువా, మిషనరీ సేవ చేయుటకు ఎదురుపడిన అవకాశములను నేను ఉపయోగించుకొనునట్లు నాకు సహాయము చేయుము. ఆమేన్
దేవునికే మహిమ కలుగునుగాక!
No comments:
Post a Comment