Search Here

Sep 13, 2021

James Shepard Dennis | జేమ్స్ షెపర్డ్ డెన్నిస్

జేమ్స్ షెపర్డ్ డెన్నిస్  | James Shepard Dennis


  • జననం: 15-02-1842
  • మహిమ ప్రవేశం: 21-03-1914
  • స్వస్థలం: న్యూజెర్సీ
  • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  • దర్శన స్థలము: సిరియా

 క్రీస్తును ఎరుగుటకు పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మనకు ప్రాథమిక మార్గమై యున్నది. అంతేకాదు, పాపమును జయించుటకు పోరాడుటలో మనకు అది అత్యంత అవసరమైన ఆయుధం. బైబిలుతో పాటు ఇతర క్రైస్తవ రచనలు కూడా మనము ఆత్మీయ పరిపక్వత పొందునట్లు దేవునిలో మరింత లోతుగా ఎదుగుటకు మనకు సహాయపడేవిగా ఉన్నాయి. క్రైస్తవ ఆధ్యాత్మిక పుస్తకాలు అన్యజనుల మనోనేత్రాలను వెలిగింపజేశాయి, విశ్వాసులకు ప్రోత్సాహమందించాయి మరియు పలు విధాలుగా మిషనరీలను ఐక్యపరిచాయి. దేవుడు తన సేవకులలో అనేక మందిని అటువంటి రచనా పరిచర్య కొరకు వాడుకున్నారు. అటువంటి వారిలో ఒకరే జేమ్స్ షెపర్డ్ డెన్నిస్.

 పద్నాలుగేళ్ల వయసులో డెన్నిస్ క్రీస్తుపై తన విశ్వాసాన్ని వెలిపరిచారు. ఉన్నత విద్యావంతుడు అయినప్పటికీ, క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించాలనే భారం ఉన్న అతను, 'ప్రిన్స్‌టన్ థియోలాజికల్ సెమినరీ' లో బైబిలు వేదాంత శాస్త్రములో శిక్షణ పొంది, 1868 వ సంll లో సేవ చేయుటకు నియామక అభిషేకం పొందారు. పిమ్మట 'అమెరికన్ బోర్డ్ ఆఫ్ కమిషనర్స్ ఫర్ ఫారిన్ మిషన్స్' సంస్థ బీరుట్ సమీపంలోని సిడాన్‌లో ఉన్న తమ యొక్క మిషనుకు అతనిని పంపింది. అక్కడ క్రొత్తగా స్థాపించబడిన 'బీరుట్ థియోలాజికల్ సెమినరీ' లో ప్రిన్సిపాల్‌గాను మరియు వేదాంత శాస్త్ర ఆచార్యునిగాను (థియాలజీ ప్రొఫెసర్‌గా) డెన్నిస్ సేవలందించారు. అతను అరబిక్ భాషను నేర్చుకొనడమే కాకుండా కళాశాల తరగతులలో ఉపయోగించుట కొరకు ఆ భాషలో మూడు పాఠ్యపుస్తకములను కూడా రచించారు.

 అయితే కుటుంబ పరిస్థితుల కారణంగా 1892వ సంll లో అతను మిషనరీగా తాను నియమింపబడిన స్థలము నుండి రాజీనామా చేయవలసి వచ్చింది. అయినప్పటికీ, రచనల ద్వారా మిషనరీ సేవలో పాలుపొందవలెనని అతను నిశ్చయించుకున్నారు. కాగా, అమెరికాకు తిరిగి వెళ్ళిన తరువాత అతను ప్రపంచవ్యాప్తంగా 300కు పైగా మిషనరీలతో చర్చించుటలో విలువైన సమయమును గడిపారు. పిమ్మట అతను మూడు సంపుటములుగా 'క్రిస్టియన్ మిషన్స్ అండ్ సోషల్ ప్రోగ్రెస్' అనే పుస్తకమును ప్రచురించారు. మిషనరీ పనికి ఒక గొప్ప కావ్యముగా పరిగణించబడిన ఈ పుస్తకం, తరువాతి మిషనరీలకు విలువైన వనరుగాను మరియు వారిని ప్రోత్సహించేదిగాను ఉపయోగపడింది.

 తన పుస్తకములను తయారు చేసి, ప్రచురించుటకు డెన్నిస్ తన స్వంత ధనమునే వెచ్చించారు. పైగా వాటిపై వచ్చే రాబడిని కూడా తీసుకోలేదు. అరబిక్ భాష మాట్లాడే ప్రజల మధ్య జరిగే మిషనరీ సేవలో ఉపయోగించుటకుగాను అతను అనేక క్రైస్తవ వ్యాసాలను వ్రాశారు. అతని రచనలు మిషనరీ సమావేశాలలో మార్గదర్శక వనరులుగా ఉపయోగించబడగా, అది ప్రపంచవ్యాప్తంగా వివిధ మిషనరీ సంస్థల మధ్య సన్నిహిత సంబంధములను మరియు పరస్పర సహకారమును ఏర్పరిచింది.

 1914వ సంll లో ఇహలోకమును విడిచి తన పరమ వాసమునకు పయనమయ్యారు జేమ్స్ షెపర్డ్ డెన్నిస్. అయినప్పటికీ, అతని రచనలు ఈనాటికి కూడా ఆత్మీయ జ్ఞానమును మరియు ప్రోత్సాహమును అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలను ఐక్యపరచుచున్నవిగా ఉన్నాయి!

🚸 *ప్రియమైనవారలారా, మీ క్రైస్తవేతర స్నేహితులు మరియు బంధువులకు మీరు ఆధ్యాత్మిక పుస్తకములను ఇస్తున్నారా?* 🚸

🛐 *"ప్రభువా, నేను మిషనరీ పరిచర్య జరుగు స్థలములో లేనట్లయితే, నేను ఉన్న స్థలములోనే సాధ్యమైన ప్రతి మార్గములోను నేను మీకు సేవ చేయుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"* 🛐

🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏
*******
  • WhatsApp
  • No comments:

    Post a Comment