Search Here

Sep 12, 2021

Robert Terrill Rundle | రాబర్ట్ టెర్రిల్ రండెల్


రాబర్ట్ టెర్రిల్ రండెల్  | Robert Terrill Rundle


  • జననం: 11-06-1811
  • మహిమ ప్రవేశం: 04-02-1896
  • స్వస్థలం: మైలర్
  • దేశం: ఇంగ్లాండు
  • దర్శన స్థలము: కెనడా

  పశ్చిమ కెనడాలోని ‘క్రీ’ మరియు ‘నకోడా’ అనే తెగల మధ్య పరిచర్య చేయుటలో తొలి అడుగులు వేసిన ఒక మార్గదర్శక మిషనరీగా పేరు గాంచారు రాబర్ట్ టెర్రిల్ రండెల్. క్రైస్తవ బోధకుల వంశంలో జన్మించిన రండెల్‌ సహజముగానే పరిచర్య వైపు మొగ్గు చూపారు. బోస్కాజిల్‌లో చదువుకుంటున్న సమయములో అతను స్థానిక వెస్లియన్ మెథడిస్ట్ చర్చి వ్యవహారాలలో ఎంతో చురుకుగా పాల్గొనేవారు. చివరికి 1839వ సంll లో అతను పూర్తి సమయము పరిచర్య చేయవలెనని తన జీవితమును సమర్పించుకున్నారు. త్వరలోనే హడ్సన్ బే కంపెనీ (హెచ్.బి.సి.) తరపున కెనడాలో సేవ చేసే అవకాశమును అతను అందిపుచ్చుకున్నారు.

  1840వ సంll లో కెనడాలోని ఎడ్‌మంటన్‌కు చేరుకున్నారు రండెల్. అక్కడి పరిస్థితులు అతను ఊహించిన దానికంటే ఎంతో కఠినంగా ఉన్నాయి. స్థానికులలో అనేక మంది కాథలిక్కులు అయినందున అతను నిర్వహించే కూడికలకు ప్రజలను సమకూర్చడం అతనికి క్లిష్టమైంది. అంతేకాకుండా వారిలో చాలామంది ఆదివారం నాడు కూడా పని చేయడం చూసి అతను ఆశ్చర్యపోయారు. దేవుని ఆజ్ఞను క్రైస్తవులే గౌరవించకపోతే, అన్యజనులు వాటిని అనుసరించుటను తాను ఎలా ఆశించగలనని అతను తలంచారు. ప్రభువు దినమైన ఆదివారమును దేవుని మహిమార్థమై గడపవలెనని స్థానిక క్రైస్తవులను కోరినప్పుడు అతను వారిచే అపహసించబడ్డారు. అయితే అతను ఏమాత్రం కలవరపడక, నిరాశచెందక, ప్రజలను మందలించి, ప్రోత్సహించి, ఒప్పింపజేయుటకు ఎంతో సహనముతో తన ప్రయత్నములను కొనసాగించారు.

  త్వరలోనే ఎడ్‌మంటన్‌ సరిహద్దులను దాటి తన పరిచర్యను విస్తరింపజేసి, ఇతర ఆదివాసీ తెగలను కూడా సంధించారు రండెల్. అతను తెగల యొక్క ఒక స్థావరం నుండి మరొకదానికి సువార్తను ప్రకటించుచూ కఠినంగా ప్రయాణించారు. తన సహపరిచారకుడైన జేమ్స్ ఇవాన్స్ ‘క్రీ’ భాషకు రూపొందించిన అక్షరాలను అతను వారికి నేర్పించారు. ఆంగ్లమునకు బదులుగా వారి స్వభాషలోనే కూడికలను నిర్వహించడం ప్రారంభించారు రండెల్. అంతేకాకుండా, అతను ప్రార్థన పుస్తకాన్ని క్రీ భాషలోకి అనువదించారు. ఆ ఆదివాసులు అతనిపై ఎంతటి అభిమానమును పెంచుకున్నారంటే, అతను తన మిషనరీ ప్రయాణంలో వారిని విడిచి ముందుకు సాగిపోవుటకు వారు అతనిని అనుమతించేవారు కాదు.

  రండెల్ తన మిషనరీ ప్రయాణాలలో తరచుగా గుర్రంపై ప్రయాణించేవారు. 1847వ సంll లో అటువంటి ఒక ప్రయాణంలో అతను గుర్రంపై నుండి క్రిందపడడంతో అతని చేతికి తీవ్ర గాయమైంది. ఆ చేయి సరిగా నయం కాకపోవడంతో 1848వ సంll లో అతను చికిత్స పొందుట కొరకు ఇంగ్లాండుకు వెళ్ళారు. తదుపరి అతను కెనడాలోని తన ప్రియమైన ప్రజల వద్దకు తిరిగి రావాలని కోరుకున్నారు గానీ, వెళ్ళలేకపోయారు. కాగా, 1896వ సంll లో తాను మహిమలోకి పిలువబడే వరకు కూడా ఇంగ్లాండులో పరిచర్య చేస్తూ ప్రభువుకు సేవలో ముందుకు సాగిపోయారు రాబర్ట్ టెర్రిల్ రండెల్.

🚸 *ప్రియమైనవారలారా, ఆదివారమున మీ సమయమును దేవుని మహిమ కొరకే మీరు వెచ్చించున్నారా?* 🚸

🛐 *"ప్రభువా, అన్యజనులు మిమ్మును వెంబడించుటకు నేను ఒక ఆటంకముగా ఉండకుండునట్లు మీ ఆజ్ఞలను నేను గౌరవించి అనుసరించుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"* 🛐

🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏

  • WhatsApp
  • No comments:

    Post a Comment