Search Here

Sep 11, 2021

Pliny Fisk | ప్లినీ ఫిస్క్

ప్లినీ ఫిస్క్ | Pliny Fisk

  • జననం: 24-06-1792
  • మహిమ ప్రవేశం: 23-10-1825
  • స్వస్థలం: మసాచుసెట్స్
  • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  • దర్శన స్థలము: పాలస్తీనా, ఆసియా మైనర్
 ‘అమెరికన్ బోర్డ్ ఆఫ్ కమిషనర్స్ ఫర్ ఫారిన్ మిషన్స్’ (ఎ.బి.సి.ఎఫ్.ఎమ్.) అనే మిషనరీ సంస్థ తరపున పాలస్తీనాలో మొట్టమొదటిగా సేవ చేసిన మిషనరీలలో ప్లినీ ఫిస్క్ ఒకరు. ఫిస్క్ మతపరంగా క్రైస్తవుడే అయినప్పటికీ, అతని హృదయం దేవునికి దూరంగా ఉండేది. అయితే, అతనికి 16 సంll ల వయస్సు వచ్చినప్పుడు, మరణానంతరం ఉండే జీవితము గురించిన ప్రశ్నలు మరియు భయాలు అతనిలో ప్రారంభమయ్యాయి. ఆ స్థితి అతను దేవుని సన్నిధిలో మోకరిల్లేలా చేసింది. తత్ఫలితముగా అతను మారుమనస్సు పొందారు. తిరిగి జన్మించిన తరువాత, ఇతరులను కూడా క్రీస్తు వద్దకు నడిపించాలనే బలమైన వాంఛ అతనిలో కలిగింది. ఆ వాంఛ తదుపరి మిషనరీ సేవ పట్ల ఆసక్తిగా మారింది. కావున, బైబిలు వేదాంత శాస్త్రమును అభ్యసించుటకు ‘ఆండోవర్ థియోలాజికల్ సెమినరీ’ లో చేరిన అతను, అక్కడ పాలస్తీనా మిషన్ వ్యవస్థాపక సభ్యులయ్యారు.

  అప్పటిలో పాలస్తీనాలో కాథలిక్కులు మరియు మహమ్మదీయుల ప్రభావం బలంగా ఉండేది. అనేక ప్రొటెస్టెంట్ సంస్థలు పాలస్తీనాను పరిచర్య ప్రారంభించుటకు ఒక ప్రమాదకరమైన మరియు ఎంతో నిరుత్సాహకరమైన ప్రదేశముగా పరిగణించాయి. కావున, కూలంకుషంగా సుదీర్ఘమైన చర్చలు జరిపిన తరువాత మరియు దేవుని నడిపింపు కొరకు తీవ్రముగా ప్రార్థించిన తరువాత, ప్లినీ ఫిస్క్ మరియు లేవి పార్సన్స్ ఆ పవిత్ర భూమిలో సువార్త ప్రకటించుటకుగాను ఎ.బి.సి.ఎఫ్.ఎమ్. సంస్థతో కలిసి పని చేయుటకు తమను తాము సమర్పించుకున్నారు. తద్వారా 1819వ సంll లో మధ్యప్రాచ్య ప్రాంతానికి (మిడిల్ ఈస్ట్) పయనమైన ఫిస్క్, మొదట స్ముర్నలో స్థిరపడ్డారు. హెబ్రీ మరియు గ్రీకు భాషలను నేర్చుకుంటున్న సమయంలో అతను ఆసియాలోని ఏడు సంఘములకు పర్యటించి, ప్రజల అవసరతలను తీర్చుటకు తనను తాను సిద్ధపరచుకున్నారు. యెరూషలేములో అతను యూదులు, గ్రీకులు, రబ్బీలు మరియు మహమ్మదీయులను యేసు క్రీస్తును గురించిన సత్యమును గురించి ఒప్పింపచేయుటకు వారితో బహుగా చర్చిస్తూ, సువార్త కరపత్రములను పంచుతూ వారి మధ్య సేవ చేశారు. మారుమనస్సు పొందిన వారు ఎవరూ బహిర్గతముగా కనిపించకపోయినప్పటికీ, అక్కడ అతను సువార్త పనిని కొనసాగించారు.

  ఈజిప్టులో పార్సన్స్ ఆకస్మికముగా మరణించడంతో కొంతకాలం ఈజిప్ట్ మిషన్‌ యొక్క బాధ్యతలను చేపట్టిన ఫిస్క్, తదుపరి తిరిగి యెరూషలేమునకు వచ్చారు. భౌతిక దాడులు, క్రైస్తవ రచనలను తగులబెట్టడం మరియు కాథలిక్కులు మరియు మహమ్మదీయులు కుట్రలు చేయటం మొదలగు వాటినన్నింటినీ ఎదుర్కొంటున్నప్పటికీ క్రీస్తు కొరకు ఆ శ్రమలన్నింటినీ సహించడం తగిన కార్యమేనని ఫిస్క్ భావించారు. తదుపరి 1824వ సంll లో ఒక మిషన్ స్టేషన్‌ను స్థాపించుటకు బీరుట్‌కు వెళ్ళిన ఫిస్క్, అక్కడ జ్వరం బారినపడి కేవలం 33 ఏళ్ళ లేత ప్రాయంలోనే తనువు చాలించారు.

  తన జీవితములో తన పరిచర్య ద్వారా మారుమనస్సు పొందినవారిని బహు కొద్దిమందిని మాత్రమే చూడగలిగారు ప్లినీ ఫిస్క్. అయితే ఒక చిన్న నిప్పురవ్వ అడవి మొత్తాన్నీ కాల్చగల అగ్నిజ్వాలలను రేపగలదు. తరువాతి కాలంలో ఎంతోమంది ఫిస్క్ అడుగుజాడలను వెంబడించగా, అది యూదులు నిజమైన మెస్సీయను కనుగొనుటకు కారణమయ్యింది. 

🚸 *ప్రియమైనవారలారా, ఇతరులను క్రీస్తు నొద్దకు నడిపించవలెననే బలమైన వాంఛ మీలో నున్నదా?* 🚸

🛐 *"ప్రభువా, నా మిగిలిన జీవితమును నశించుచున్న ఆత్మలను వెదుకుటకు నేను జీవించుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"* 🛐

*******
🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏l

  • WhatsApp
  • No comments:

    Post a Comment