Search Here

Sep 25, 2021

Levi Parsons | లేవి పార్సన్స్

Levi Parsons | లేవి పార్సన్స్


  • జననం: 18-07-1792
  • మహిమ ప్రవేశం: 10-02-1822
  • స్వస్థలం: మసాచుసెట్స్
  • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  • దర్శన స్థలము: పాలస్తీనా, ఆసియా మైనర్ మరియు ఈజిప్ట్

 సమూయేలు ప్రవక్త వలెనే లేవి పార్సన్స్‌ని కూడా అతని తల్లి జీవిత కాలమంతా దేవుని సేవ చేయుటకు సమర్పించారు. అతను క్రైస్తవ భక్తితో పెంచబడినప్పటికీ, ఒక వేషధారిగానే జీవించారు. అతను దేవుని వాక్యాన్ని చదివేవారు, దానికి భయపడేవారు కూడా. కానీ, వాక్యానుసారముగా తన జీవితమును మలుచుకొనలేకపోయారు. కాగా, అతను బాధాకరమైన అంతర్గత సంఘర్షణలతో నలిగిపోయారు. ఒకసారి అతను ఒక ఉజ్జీవ కూడికకు హాజరవ్వగా, అక్కడ దేవుడు అతనితో “ఇశ్రాయేలూ, ... నిన్ను నీవే నిర్మూలము చేసికొనుచున్నావు.” (హోషేయ 13:9) అనే వచనం ద్వారా మాట్లాడాడు. వెంటనే తన దుష్ట పాపస్వభావమును బట్టి వేదన చెందిన లేవి, విమోచన కొరకు మొఱ్ఱపెట్టారు. నమ్మకమైన దేవుడు అతనిని తన క్షమహస్తాలతో చేర్చుకున్నాడు.

 పట్టభద్రులైన తరువాత, 1817వ సంll లో అతను ఎవరూ వెళ్ళుటకు సాహసం చేయనటువంటి పాలస్తీనాలో సేవ చేయుటకు తనను తాను సమర్పించుకున్నారు. కాగా తన స్నేహితుడు ప్లినీ ఫిస్క్‌తో కలిసి అతను 1819వ సంll లో స్ముర్నాకు చేరుకున్నారు. ఒకప్పుడు యేసు క్రీస్తు ప్రభువే స్వయంగా లేఖను వ్రాసిన సంఘమును కలిగియున్న ఆ నగరమును చూసి అతను సంతోషముతో ఉప్పొంగిపోయారు. కానీ, అక్కడ క్రైస్తవ్యం కేవలం వేడుకలు మరియు ఆచారాలుగా దిగజారిపోయిన స్థితిని చూసినప్పుడు ఆ సంతోషం దుఃఖంగా మారింది. అబద్ధ ప్రవక్తలు క్రైస్తవ సంఘములను నడిపించుట చూచి అతను ఆత్మలో కలత చెందారు. అప్పుడు పార్సన్స్ అక్కడి పరిస్థితులను సరిచేయటమో లేదా మరణమో అని నిశ్చయించుకున్నారు. మహమ్మదీయులు మరియు కాథలిక్కులు ఇతర క్రైస్తవుల పట్ల కలిగియున్న ద్వేషమును మరియు వారి నుండి పొంచియున్న ప్రాణహానిని విస్మరించి, అతను పునరుత్థానుడై లేచిన క్రీస్తును ధైర్యముగా ప్రకటించారు. అంతేకాకుండా అతను ఆత్మీయముగా అంధులుగా ఉన్న క్రైస్తవ నాయకులను దర్శించి, క్రైస్తవ సంఘములో వారు చేస్తున్న తప్పులను వారు అంగీకరించేలా చేశారు. చాలామంది అతనిని అపహసించినప్పటికీ, తన కర్తవ్యం మీద అతను దృష్టి సారించారే గానీ, దాని ఫలితం పై కాదు. 

 ప్లినీ ఫిస్క్‌తో కలిసి అతను బైబిలులోని ప్రకటన గ్రంథములో పేర్కొనబడిన ఏడు సంఘములకు వెళ్ళారు. అతను ఈజిప్టులో ఒక మిషన్ స్థావరమును (మిషన్ స్టేషన్) కూడా స్థాపించారు. 1820వ సంll ఆఖరిలో అతను యెరూషలేమును సందర్శించి, ఒక రోజున అక్కడ మిషన్ స్థావరమును ఏర్పాటు చేయాలనే నిరీక్షణతో కరపత్రములను మరియు బైబిళ్ళను పంచిపెట్టారు. ఆ పవిత్ర భూమిలో జరిగిన పరిచర్యను గురించిన అతని నివేదికల ద్వారా ప్రోత్సహించబడిన అనేక మంది అమెరికన్లు తరువాత పాలస్తీనాలో సేవచేయుటకు వారి సిలువను ఎత్తుకొని వెళ్ళారు.

 1821వ సంll లో తీవ్రమైన అనారోగ్యంతో బాధపడిన లేవి పార్సన్స్, మరుసటి సంవత్సరం 29 సంll ల లేత ప్రాయములోనే పరలోకములో తన ప్రభువును చేరుకొన్నారు. 

ప్రియమైనవారలారా, మీరు ఆచారాలకు వ్యతిరేకంగా నిలబడి క్రైస్తవ సంఘములో దైవిక క్రమమును పునరుద్ధరిస్తున్నారా?

ప్రభువా, మీ సంఘములో ఉజ్జీవమును తీసుకువచ్చే సాధనముగా నన్ను వాడుకొనుము. ఆమేన్!

దేవునికే మహిమ కలుగునుగాక!

  • WhatsApp
  • No comments:

    Post a Comment