Search Here

Sep 24, 2021

Emma Cushman | ఎమ్మా కుష్మన్

ఎమ్మా కుష్మన్ | Emma Cushman


Emma Cushman


  • జననం: 1863
  • మహిమ ప్రవేశం: 1931
  • స్వస్థలం: బర్లింగ్టన్, న్యూయార్క్
  • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  • దర్శన స్థలము: కొనియా, ఆసియా మైనర్


 మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిన అర్మేనియన్ మారణహోమం ప్రపంచ చరిత్రలో అత్యంత కౄరమైన సంఘటనలలో ఒకటి అని చెప్పవచ్చు. టర్కీవారు దాదాపు పది లక్షల మంది అర్మేనియన్లను చంపి, స్త్రీలను మరియు పిల్లలను బలవంతముగా ఇస్లాం మతంలోకి మార్చారు. వేలాది మంది క్రైస్తవులు తమ ప్రాంతాలను విడిచిపెట్టి వెళ్ళవలసిన పరిస్థితులు నెలకొనగా, వారు ఎడారి గుండా నడిచీ నడిచి తమ ప్రాణాలను కోల్పోయారు. అయితే, అటువంటి ద్వేషం మరియు కౄరత్వంతో నిండినవారికి కూడా తనను సేవించే మిషనరీల ద్వారా తన పరమ ప్రేమను కనుపరచటం దేవుని దృష్టిలో యుక్తమైనదిగా కనబడింది. అందుకొరకై ఆయన ఎన్నుకొనినవారిలో ఎమ్మా కుష్మన్ ఒకరు.


 అమెరికాకు చెందిన నర్సు అయిన ఎమ్మా డార్లింగ్ కుష్మన్ ఆసియా మైనర్‌లోని గొప్ప నగరమైన కొనియాలోని ఒక ఆసుపత్రిలో సేవచేశారు (ఈ నగరం అపొస్తలుడైన పౌలు కాలంలో ఉన్న ‘ఈకొనియ’ నగరం). అక్కడి ఆసుపత్రిలో హెడ్ నర్సుగా ఉన్న ఆమె, అమెరికన్లను మరియు అర్మేనియన్లను ద్వేషించే అదే టర్కులు గాయపడియున్నప్పుడు వారికి పరిచర్య చేశారు. ఒకసారి గాయపడిన ఒక టర్కీ వ్యక్తి ఆమె పనిచేస్తున్న ఆసుపత్రిలో చేర్చబడ్డాడు. అతను అక్కడ గోడపై వ్రేలాడుతున్న యేసుక్రీస్తు చిత్రపటమును తీసివేయాలని పట్టుబట్టాడు. అప్పుడు కుష్మన్ "కుదరదు, అది యేసు యొక్క చిత్రపటం. ఆయన దేవుడు ప్రేమయైయున్నాడని జనులకు బోధించిన గొప్ప వైద్యుడు... ఆయన దానిని నాకు బోధించడం వలనను మరియు ఆయన అడుగుజాడలను అనుసరించి ఆయనను వెంబడించమని నన్ను పిలుచుట వలననే మీరు స్వస్థతనొందునట్లు సహాయపడుటకు నేను ఇక్కడ ఉన్నాను." అని నిక్కచ్చిగా సమాధానమిచ్చారు. కావున, తాను స్వస్థత పొందిన తరువాత ఆ చిత్రపటం సంగతి గురించి ఆలోచించవచ్చునని ఆ వ్యక్తి తలంచాడు. అయితే, ఆసుపత్రిలో గడిపిన సమయంలో అతను కుష్మన్ మరియు ఇతర అర్మేనియన్ నర్సులలో క్రీస్తు ప్రేమను చూశాడు. కాగా అతను ఆసుపత్రి నుండి వెళ్ళిపోయే సమయం వచ్చేటప్పటికి అతని హృదయం పూర్తిగా మారిపోయింది. అంతటి ధైర్యవంతురాలు మరియు ప్రేమ నిండిన హృదయం గలిగిన స్త్రీ కుష్మన్!


 మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో భయంకరమైన మారణహోమం నెలకొనియున్న పరిస్థితుల మధ్య, కుష్మన్ మరియు ఆమె యొక్క నర్సుల బృందం గాయపడిన టర్కులకు మరియు అర్మేనియన్లకు సేవ చేశారు. ఒకవైపు ఆమె ప్రాణాలే మరణచ్ఛాయలో ఉన్నటువంటి పరిస్థితులలో ఆమె ఎంతోమంది అర్మేనియా బాలబాలికలను మరణపుటంచులలో నుండి వెలికితీసి రక్షించారు. యుద్ధ సమయంలో అనాథలైన అనేక మంది పిల్లల సంరక్షణా బాధ్యతలను చేపట్టిన ఆమె వారికి చదవడం, రాయడం నేర్పించడమే కాక వారు తమ కాళ్ళ మీద తాము నిలబడగలుగునట్లు కుట్టుపని మరియు తోలు కత్తిరించడం వంటి ఇతర నైపుణ్యములను నేర్చుకొనుటకు కూడా వారికి సహాయపడ్డారు. ఆ విధముగా తన సేవలో ఇతరులకు దేవుని ప్రేమను కనుపరిచిన ఎమ్మా కుష్మన్, చివరి వరకు కూడా తన యొక్క మిషనరీ పిలుపులో నమ్మకముగా నిలిచారు.


ప్రియమైనవారలారా, మీరు మీ శతృవులను ప్రేమించుచున్నారా?


ప్రభువా, మీ కొరకు నేను ధైర్యముగా నిలబడగలుగునట్లు నాకు సహాయము చేయుము. ఆమేన్!"


దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • No comments:

    Post a Comment