Search Here

Sep 23, 2021

Alphonso Francois Lacroix | అల్ఫాన్సో ఫ్రాంకోయిస్ లాక్రోయిక్స్

అల్ఫాన్సో ఫ్రాంకోయిస్ లాక్రోయిక్స్ | Alphonso Francois Lacroix



  • జననం: 10-05-1799
  • మహిమ ప్రవేశం: 08-07-1859
  • స్వస్థలం: న్యూచాటెల్
  • దేశం: స్విట్జర్లాండ్
  • దర్శన స్థలము: బెంగాల్, భారతదేశం

 స్విట్జర్లాండుకు చెందిన అల్ఫాన్సో ఫ్రాంకోయిస్ లాక్రోయిక్స్ భారతదేశంలోని బెంగాల్‌లో సేవ చేసిన ఒక మిషనరీ. పుట్టిన వెంటనే తన తండ్రిని కోల్పోయిన లాక్రోయిక్స్, తన తల్లి సోదరుడైన ఎమ్. చానెల్ యొక్క సంరక్షణలో పెరిగారు. చిన్ననాటి నుండి చురుకైనవాని గాను మరియు ధైర్యవంతునిగాను ఉన్న అతను, తాను ఒక సైనికుడిగా మారాలని కోరుకునేవారు. అయితే అతను ఆత్మీయ యుద్ధములో పోరాడే సైనికుడిగా ఉండవలెననునది దేవుని సంకల్పమై యున్నది. అతనికి 17 సంll ల వయసు ఉన్నప్పుడు అతను పాఠాలు చెప్పేవానిగా (ట్యూటర్‌గా) పనిచేయుటకు ఆమ్‌స్టర్‌డామ్‌కు వెళ్ళారు. అక్కడ అతను ఒక ప్రార్థన కూడికకు హాజరైనప్పుడు తాహితీ ప్రజల మధ్య జరుగుతున్న అద్భుతమైన మిషనరీ సేవను గురించి వినడం జరిగింది. ఆ రోజు అతను, “పని చాలా విస్తారంగా ఉంది; అది చేయుటకు ముందుకు వచ్చేవారు చాలా తక్కువ మంది; నేనెందుకు వారి శ్రమలో పాలుపంచుకొనకూడదు?” అని యోచించారు.

 ఆ విధమైన భావోద్వేగాల ప్రేరణపై ఆధారపడి కాకుండా దేవుని నడిపింపు ద్వారా అడుగు ముందుకు వేయవలెనని ఆరు నెలల పాటు ప్రార్థించి చివరకు ‘నెదర్లాండ్స్ మిషనరీ సొసైటీ’ లో చేరారు అల్ఫాన్సో. అతను 1821వ సంll లో భారతదేశంలోని కలకత్తా నగరమునకు సమీపంలో ఉన్న చిన్సురా అనే ప్రాంతమును చేరుకున్నారు. అక్కడ అతను సమాజములో లోతుగా పాతుకుపోయిన సతీసహగమనం మరియు మాంత్రిక విద్య వంటి సాంఘిక దురాచారాలను చూసి భయభ్రాంతులకు గురయ్యారు. ఎంతో సుదీర్ఘమైన మరియు తీవ్రమైన అభ్యర్థనల తరువాత కూడా చనిపోయిన తన భర్తతో పాటు భార్య కాల్చివేయబడకుండా ఆమెను కాపాడుటలో అతను విఫలమైన సందర్భాలు ఉన్నాయి. అయితే అటువంటి నిరాశాజనకమైన సంఘటనలు నిజమైన దేవుని కొరకు భారతీయుల ఆత్మలను సంపాదించవలెననే అతని కోరికను మరింత బలపరిచాయి. 25 డచ్ పాఠశాలల యొక్క బాధ్యతలను చేపట్టిన అతను, వాటిని సాధారణ విద్యాభ్యాసమునిచ్చుటకు మాత్రమే కాక ఆత్మీయ విద్యను కూడా అందించే కేంద్రాలుగా మార్చారు.

 లాక్రోయిక్స్ పరిచర్యలో సువార్త సభలు ఒక ముఖ్యమైన భాగముగా ఉన్నాయి. యేసు క్రీస్తు కేవలం నగరాలకు మాత్రమే రక్షకుడు కాదు, గ్రామాలకు కూడా అని విశ్వసించిన అతను, హూగ్లీ, ఇచమతి, మరియు మఠభంగ నదుల తీరాలలో ఉన్న గ్రామాలలో సువార్త సభలను నిర్వహించారు. అధికారికంగా ఉండే అతని స్వరము, అనర్గళమైన బెంగాలీ భాష మరియు ఇతరుల గురించి అక్కర కలిగియున్నారనిపించే మర్యాదతో కూడిన అతని ప్రవర్తన సువార్త వినుటకు ప్రజలను ఆకర్షించాయి. సంచరిస్తూ సేవ చేయడంతో పాటు కలకత్తాలోని తన మందను కూడా అతను నమ్మకముగా నడిపించారు.

 1833వ సంll లో బెంగాల్‌లో పెను తుఫాను సంభవించగా, దాదాపు 20,000 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఆ పరిస్థితులలో లాక్రోయిక్స్ మరియు అతని సంఘము ఎంతో ప్రయాసతో అవసరతలలో ఉన్నవారికి సహాయమందించారు. అంతేకాకుండా బెంగాలీ భాషలోని లేఖన భాగములను సవరించుటలోను మరియు స్థానిక బోధకులకు శిక్షణ ఇచ్చుటలోను అతను పాలుపంచుకున్నారు. అనేక త్యాగాలు మరియు అత్యంత కష్టతరమైన పోరాటాలతో కూడిన 40 సంll ల తీక్షణమైన పరిచర్య తరువాత, 1859వ సంll లో ప్రభువు నందు నిద్రించారు అల్ఫాన్సో ఫ్రాంకోయిస్ లాక్రోయిక్స్.

ప్రియమైనవారలారా, ఇతర మిషనరీల శ్రమలో పాలుపంచుకొనుటకు మీరు సిద్ధముగా ఉన్నారా?

"ప్రభువా, ఎటువంటి త్యాగాలు చేయవలసి వచ్చినా, ఎన్ని పోరాటాలు ఎదురైనా మీ పని చేయుటలో నేను స్థిరమైన సమర్పణ కలిగియుండునట్లు నాకు సహాయము చేయుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక!

  • WhatsApp
  • No comments:

    Post a Comment