రాబర్ట్ క్లార్క్ | Robert Clark
- జననం: 04-07-1825
- మహిమ ప్రవేశం: 16-05-1900
- స్వస్థలం: లింకన్‌షైర్
- దేశం: ఇంగ్లాండు
- దర్శన స్థలము: పూర్వపు పంజాబ్ మరియు కాశ్మీర్
రాబర్ట్ క్లార్క్ పూర్వపు పంజాబ్ మరియు కాశ్మీర్‌లో మొదటిగా పరిచర్య చేసి మార్గదర్శకులుగా నిలిచినవారిలో ఒకరు. అతను కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైన పిమ్మట, తాను చదువుకున్న విశ్వవిద్యాలయంలోనే బోధించుటకు మంచి భవిష్యత్తునిచ్చే ఉద్యోగం అతని కొరకు వేచియుంది. అయితే, దానికంటే అన్యజనుల దేశాలలో క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించుటకు దేవుని పరిచారకుల కొరకు ఉన్న అవసరతను గురించిన చింతయే క్లార్క్‌లో ఎక్కువగా ఉంది. కాగా, అతను ‘చర్చి మిషనరీ సొసైటీ’ లో చేరగా, ఆ సంస్థ అతనిని భారతదేశంలోని పంజాబ్ మిషన్‌లో పరిచర్య చేయుటకు నియమించింది.
1852వ సంll లో పంజాబులోని అమృత్‌సర్‌లో ఒక మిషన్ స్థావరమును స్థాపించారు క్లార్క్. భారతదేశంలో భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొనిన తరువాత, భారతదేశమును పరిపాలిస్తున్న ఆంగ్లేయులు కనుబరచుచున్న క్రైస్తవమతం నిజమైన క్రైస్తవ్యం కాదనే విషయముపై స్థానికులకు అవగాహన కల్పించవలెనని క్లార్క్ నిర్ణయించుకున్నారు. అందుకొరకు అతను బహిరంగ ప్రచారానికి బదులుగా మొదట వ్యక్తిగతముగా సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. స్థానికుల యొక్క సాక్ష్యాలు అత్యుత్తమ సువార్త సాధనాలు అని విశ్వసించిన అతను, మొదటిలో మారుమనస్సు పొందినవారు తమ కుటుంబీకులతో ఆరంభించి ఇతరులకు సాక్ష్యమివ్వడం ప్రారంభించవలెనని వారిని ప్రోత్సహించారు. ఎంతో వ్యతిరేకత మరియు అనేక విధములైన బెదిరింపులు కలిగినప్పటికీ రెండేళ్ళలో 20 మందికి పైగా విశ్వాసులను అతను సంపాదించగలిగారు.
ఆ విధంగా స్థానికులకు పరిచర్య కొరకు శిక్షణ ఇచ్చి, వారికి సువార్త పరిచర్య బాధ్యతలను అప్పగించిన తరువాత, క్లార్క్ 1854వ సంll లో పెషావర్‌లో ఒక మిషన్ స్థావరమును స్థాపించారు. తరువాతి పది సంవత్సరాలు అతను లాహోర్ మరియు టిబెట్ వరకు ఉన్న కొండలు మరియు లోయలలోని ప్రజలను చేరుకొనుటకు అతను ప్రమాదకరమైన భూభాగాలను దాటుకుంటూ ప్రయాణించారు. ఆ సమయంలోనే అతను తన పరిచర్యలో ఉత్తమ భాగస్వామి అయిన ఎలిజబెత్ మేరీ బ్రౌన్‌ను వివాహం చేసుకున్నారు.
1864వ సంll లో ఈ మిషనరీ దంపతులు మిషన్ స్థావరమును స్థాపించుటకు కాశ్మీర్‌కు వెళ్ళారు. ఆ కాలంలో డోగ్రావారి పాలనలో ఉన్న కాశ్మీర్ ప్రాంతం పేదరికం, తెగుళ్ళు మరియు దుర్మార్గంతో కొట్టుమిట్టాడుతోంది. అక్కడి రాజు కాశ్మీర్‌లో పని చేయుటకు క్లార్క్‌ను అనుమతించినప్పటికీ, క్లార్క్‌పై కుట్ర పన్ని అతను వచ్చినప్పుడు అతనిపై దాడి చేయమని తన సహచరులకు ఆజ్ఞ ఇచ్చాడు. దేవుని హస్తం వారికి తోడైయుండక పోయినట్లయితే, ఆ దంపతులు అక్కడికి వచ్చిన రోజుననే చంపబడియుండేవారు. అయితే, ఎలిజబెత్ యొక్క వైద్య మిషనరీ సేవలతో శతృవులు మితృలయ్యారు. త్వరలోనే కాశ్మీర్‌లో అనేక వైద్య మిషన్ స్థావరములు ఏర్పడ్డాయి మరియు దానితో పాటు క్రైస్తవ సమాజం కూడా అభివృద్ధి చెందింది.
అలుపెరుగని ఉత్సాహంతో, తన చివరి శ్వాస వరకు కూడా వైద్య మరియు విద్యా సంబంధ సేవలను అందించుట ద్వారా ఉత్తర భారతదేశంలో ఆత్మీయ మరియు సామాజిక మార్పుకు కారకునిగా నిలిచారు రాబర్ట్ క్లార్క్.
ప్రియమైనవారలారా, లాభదాయకమైన ఈ ప్రాపంచిక ఉద్యోగాల కంటే క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించడం మరి ప్రశస్తమైనదని మీరు ఎరిగియున్నారా?
ప్రభువా, విలువలేని వ్యర్థమైన విషయముల పైనుండి నా కనుదృష్టిని మరల్చుకొని మీకు సేవ చేయుటలో ఉన్న మహిమను నేను చూడగలుగుటకు నాకు సహాయము చేయుము. ఆమేన్!"దేవునికే మహిమ కలుగునుగాక!
No comments:
Post a Comment