Search Here

Oct 11, 2021

Alice Marval | ఆలిస్ మార్వాల్

ఆలిస్ మార్వాల్  | Alice Marval


  • జననం: 26-01-1865
  • మహిమ ప్రవేశం: 05-01-1904
  • స్వదేశం: ఇంగ్లాండు
  • దర్శనము: కాన్పూర్, భారతదేశం

 1857వ సంవత్సరపు సిపాయిల తిరుగుబాటు భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ఒక ప్రసిద్ధ సంఘటన. ఇరు వైపులా వందలాది మంది అమాయకులు మరణించారు. పేష్వా నానా సాహెబ్ వందలాది మంది బ్రిటిష్ మహిళలను కాన్పూర్‌లో బీబీఘర్ అని పిలువబడే ఒక పెద్ద ప్రాంగణంలో బంధించి, కనికరం లేకుండా వారిని చంపుటకు తన సిపాయిలకు ఆదేశాలను జారీ చేశాడు. ఆ మారణకాండ ముగిసిన తరువాత అక్కడికి చేరుకున్న బ్రిటిష్ సైన్యం చేయగలిగింది ఆ ప్రాంగణములో మోకాళ్ళ లోతు రక్తంలో తేలియాడుతున్న మృతదేహాలను చూడటమే!

 తరువాత బ్రిటిష్ వారు ప్రతీకారం తీర్చుకున్నప్పటికీ, “సొసైటీ ఫర్ ప్రొపెగేషన్ ఆఫ్ గోస్పెల్ ఇన్ ఫారిన్ పార్ట్స్” (ఎస్.పి.జి.) సంస్థ కూడా మరణించిన వారి కొరకు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంది. అయితే అది హింసా మార్గంలో కాదు. అందుకొరకుగాను ఆ సంస్థ వందలాది మంది బ్రిటిష్ మహిళలు చంపబడిన అదే ప్రదేశంలో మహిళల కొరకు ఒక ఆసుపత్రిని స్థాపించుటకై ఆలిస్ మార్వాల్‌ను పంపింది.

 ఆలిస్ తన యవ్వనం నుండి కూడా ఎంతో శ్రద్ధాసక్తులు కలిగిన క్రైస్తవురాలిగా ఉన్నారు. తన విద్యాపరమైన ప్రయత్నాల వలన తన ఆత్మీయ అనుభవాలు మందగించకుండునట్లు ఆమె చూసుకున్నారు. మంచి జ్ఞానమును కలిగియున్న ఆమె తన తోటివారికి చదువులో సహాయపడుతూ, ఆ అవకాశాలను వారితో క్రీస్తు ప్రేమను పంచుకొనుటకు ఉపయోగించేవారు. తన చదువు వలన తాను పొందే పరిజ్ఞానం తన కొరకు ఉపయోగించుకొనుటకు కాదు గానీ, క్రీస్తు యొక్క పరిచర్య కొరకు వాడవలెను అనేది ఆమె ఎల్లప్పుడూ తన మనసులో ఉంచుకునేవారు. కావున, తాను పట్టభద్రురాలైన తరువాత, ఒక మిషనరీగా సేవ చేయవలెనని ఆమె ఎస్.పి.జి. సంస్థలో చేరగా, ఆ సంస్థ ఆమెను కాన్పూర్‌కు పంపింది.

 కాన్పూర్ యొక్క పరిస్థితిని మరియు ఒక బ్రిటిష్ మిషనరీగా తనకు కలిగే అపాయమును బాగుగా ఎరిగియున్న ఆలిస్, 1899వ సంll లో ధైర్యముగా అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఆమె స్థానిక మహిళలకు వైద్యం అందించుటకు “సెయింట్ కేథరీన్స్ హాస్పిటల్‌” ను స్థాపించారు. ప్రారంభంలో ఆమె వైద్యశాలను నిర్మించడంలోను మరియు స్థానికులకు వైద్య సంరక్షణ అందించడంలోను నిమగ్నమయ్యారు. అయితే, త్వరలోనే కాన్పూర్‌లో తెగులు విజృంభించింది.

 తెగులు కారణంగా రోగులతో నిండిపోయిన ఆసుపత్రిలో పగలంతా నిర్విరామంగా పనిచేసినప్పటికీ, బయటికి వచ్చుటకు అనుమతించబడని మహిళలకు సేవలందించుటకు రాత్రి వేళల్లో ఆమె ఇంటింటికీ వెళ్ళేవారు. ఆమె నిద్రలేని రాత్రులు గడిపి, ఆ ప్రాణాంతక వ్యాధి నుండి కోలుకొనుటకు అనేక మందికి సహాయపడ్డారు. అయితే, సున్నితమైన ఆమె శరీరం అధికమైన ఒత్తిడిని తట్టుకొనలేకపోయింది. పైగా ఆ తెగులు ఆమెపై కూడా దాడి చేసింది.

 1904వ సంll జనవరి 5న అది తన అంతమని గ్రహించిన ఆలిస్ మార్వాల్, శారీరకంగా ఒకవైపు ఎంతో బాధననుభవిస్తూ కూడా “నేను ఇక్కడ ఉన్నంత కాలం చాలా సంతోషంగా ఉన్నాను” అని పలికి ఈ లోకములో తన పరుగును కడముట్టించారు.

ప్రియమైనవారలారా, మీ జ్ఞాన పరిజ్ఞానములు క్రీస్తు యొక్క ఉద్దేశ్యములు నెరవేర్చబడుటకు వాడబడవలెనని మీరు గుర్తుంచుకుంటున్నారా?

"ప్రభువా, మీ ప్రేమను విస్తరింపజేయుటకు నా తలాంతులను వాడగలిగే అవకాశములను చూడగలుగునట్లు నా కన్నులు తెరువుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp
  • No comments:

    Post a Comment