డాన్ రిచర్డ్‌సన్ | Don Richardson
- జననం: 23-06-1935
- మహిమ ప్రవేశం: 23-12-2018
- స్వస్థలం: షార్లెట్‌టౌన్
- దేశం: కెనడా
- దర్శన స్థలము: న్యూ గినియా దీవులు, ఇండోనేషియా
ఇండోనేషియాలోని సావి తెగ తమ నమ్మకద్రోహానికి మరియు మోసపూరితతనమునకు పేరుగాంచింది. వారు శతృ తెగలతో స్నేహం నటిస్తారు, వారిని విందుకు ఆహ్వానిస్తారు, వారి యొక్క నమ్మకమును గెలుచుకున్న తరువాత వారు అక్కడికి వచ్చిన అతిథులను చంపి వారి మాంసాన్ని తింటారు. డాన్ రిచర్డ్‌సన్ సేవ చేయుటకు ఎంచుకున్న తెగ ఇది.
పదిహేడేళ్ళ వయసులో తన జీవితమును యేసు క్రీస్తు ప్రభువుకు సమర్పించిన డాన్, అప్పటి నుండి తాను ఒక మిషనరీ కావాలని పూర్ణహృదయముతో నిశ్చయించుకున్నారు. కాగా అల్బెర్టాలోని ప్రైరీ బైబిల్ ఇనిస్టిట్యూట్ నుండి పట్టా పొందిన తరువాత అతను సావి తెగవారి మధ్య సేవ చేయుటకు ఇండోనేషియాలోని కాముర్ గ్రామానికి వెళ్ళారు.
అతను సువార్తను ప్రకటించుటకు ప్రయత్నించినప్పుడు ఇస్కరియోతు యూదా యొక్క నమ్మకద్రోహ స్వభావం కారణంగా వారు యేసు క్రీస్తు కంటే ఎక్కువగా యూదాను ఇష్టపడ్డారు. వారు సరియైన భావమును గ్రహించగలిగేలా వారికి సువార్తను చెప్పడం డాన్‌కు కష్టతరమైంది. అనేక సంవత్సరాల పాటు పరిచర్య చేసినప్పటికీ క్రైస్తవులుగా మారిన వారెవరూ లేకపోవడంతో, క్రీస్తు కొరకు ఆ ఆటవికులను గెలుచుకొనగలననే నిరీక్షణను డాన్ దాదాపు కోల్పోయారు. ఆ బాధకు తోడు అన్నట్లు అక్కడ తెగల మధ్య భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది.
ఆ యుద్ధ సమయంలో ఒక బాణం డాన్ కుమారుడు స్టీఫెన్‌ని దాదాపు చంపి ఉండేది. అక్కడి పరిస్థితులకు విసిగిపోయిన డాన్ మేలు కొరకు ఆ స్థలాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. సావీలు సువార్తను అర్థం చేసుకొనలేకపోయినప్పటికీ వారు అందించిన వైద్య సేవలను బట్టి డాన్ కుటుంబము పట్ల అభిమానం కలిగియున్నారు. కావున డాన్ కుటుంబము అక్కడి నుండి వెళ్లిపోవుటకు ఆ తెగ ప్రజలు ఇష్టపడలేదు. తదుపరి వారు ఏమి చేశారో చూసి డాన్ ఆశ్చర్యపోయారు. ఆ తెగ నాయకుడు తన కుమారుడిని శతృ తెగకు ఇచ్చాడు. సంధి చేసుకొని శాంతిని నెలకొల్పుటకు అది వారు అనుసరించే పద్ధతి. దాని అర్థమేమంటే, తెగ నాయకుని కుమారుడు శతృ భూభాగంలో సురక్షితంగా ఉన్నంత వరకు వారి మధ్య యుద్ధం ఉండదు. వెంటనే డాన్ ఆ పరిస్థితిని తనకు అనుగుణంగా మలచుకొని, నరులకు దేవునికి మధ్య సమాధానమును తీసుకువచ్చుటకు పరలోకపు తండ్రి తన కుమారుడైన యేసు క్రీస్తును ఈ లోకానికి ఎలా పంపించాడో వారికి సందర్భోచితంగా వివరించారు.
ఆ రోజు అతను ఇచ్చిన సందేశం అక్కడి పరిస్థితిలో గొప్ప మార్పును తీసుకువచ్చింది. అప్పటి నుండి వందలాది మంది సావీలు యేసు క్రీస్తు ప్రభువును తమ రక్షకునిగా అంగీకరించారు. డాన్ క్రొత్త నిబంధనను అక్కడి స్థానిక భాషలోకి అనువదించారు. అతని కృషి వలన కేవలం సావీలు మాత్రమే కాదు, ప్రస్తుతం ఆ తెగకు పొరుగున ఉన్న మరో ఐదు తెగలవారు కూడా అధికశాతం క్రైస్తవులే!
1977వ సంll లో తన కుటుంబముతో కెనడాకు తిరిగి వచ్చిన డాన్ రిచర్డ్‌సన్, 2018వ సంll లో తాను మరణించే వరకు కూడా బోధించుచూ మరియు ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో మిషనరీ కార్యకలాపాలను నడిపించుచూ దేవుని సేవలో ముందుకు సాగిపోయారు.
ప్రియమైనవారలారా, సువార్తను ప్రకటించుటకు మీరు పరిస్థితులను అనుకూలముగా మలుచుకుంటున్నారా?
"ప్రభువా, వివిధ వర్గాల ప్రజలకు సరియైన భావమును విశదపరుచునట్లు సందర్భోచితంగా సువార్తను చెప్పగలుగుటకు నాకు జ్ఞానము దయచేయుము. ఆమేన్!"
దేవునికే మహిమ కలుగునుగాక!
No comments:
Post a Comment