Search Here

Oct 7, 2021

George Dana Boardman | జార్జ్ డానా బోర్డ్‌మాన్

జార్జ్ డానా బోర్డ్‌మాన్  | George Dana Boardman




  • జననం: 08-02-1801
  • మహిమ ప్రవేశం: 11-02-1831
  • స్వస్థలం: లివర్‌మోర్
  • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  • దర్శన స్థలము: బర్మా
 బర్మాలో మొదటిగా సేవ చేసి మార్గదర్శకులుగా నిలిచిన మిషనరీలలో ఒకరు జార్జ్ డానా బోర్డ్‌మాన్. అతను బర్మాలో మిషనరీ పరిచర్యకు పేరుగాంచిన అడోనిరామ్ జడ్సన్ యొక్క సమకాలీనుడు. ప్రతిభావంతుడైన యువకుడైనందున తాను చదువుకున్న కోల్బీ కళాశాలలోనే బోధించడానికి నియమించబడ్డారు బోర్డ్‌మాన్. అతను ఉపాధ్యాయునిగా మంచిగానే రాణించినప్పటికీ, తాను క్రైస్తవ విలువలతో పెరిగిన విధానమును బట్టి తన అంతిమ కర్తవ్యం సువార్తను ప్రకటించడమని అతను మరచిపోలేకపోయారు.

 మిషనరీలు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి బోర్డ్‌మాన్ బాగుగా ఎరిగియున్నప్పటికీ, ఈ లోకసంబంధమైన వృత్తిలో తన విజయవంతమైన భవిష్యత్తు యొక్క సంపద కంటే క్రీస్తుని రాయబారిగా ఉండటమే విలువైనదిగా ఎంచారు. కావున, అతను తన వృత్తిని విడిచిపెట్టి, పరిచర్య కొరకు శిక్షణ పొందుటకుగాను వాటర్‌విల్లే సెమినరీలో చేరారు. అక్కడ ఉన్నప్పుడు బర్మాలో సేవచేస్తున్న రెవ. జేమ్స్ కోల్మన్ యొక్క అకాల మరణం గురించి విన్న బోర్డ్‌మాన్, అతని స్థానంలో సేవ చేయుటకు బాప్తిస్టు బోర్డుకు దరఖాస్తు పెట్టుకున్నారు.

 1825వ సంll మార్చి మాసంలో శారా హాల్‌తో వివాహం జరిగిన ఒక వారంలోనే బోర్డ్‌మాన్ కలకత్తాకు వెళ్ళే ఓడలో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అక్కడి నుండి వారు 1827వ సంll లో మౌల్‌మైన్‌కు చేరుకున్నారు. హంతకులు మరియు బందిపోటు దొంగలతో నిండుకొనియున్న ప్రమాదకరమైన ప్రదేశం మౌల్‌మైన్. కాగా సురక్షితముగా సైనిక శిబిరంలో (ఆర్మీ కంటోన్మెంట్‌) ఉండుటకు అతనికి చోటు ఇవ్వబడినప్పటికీ, సాధారణ ప్రజల మధ్యలో నివసించుటకే ఇష్టపడ్డారు బోర్డ్‌మాన్‌. ఊహించినట్లుగానే వారి ఇంటిపై దాడి చేసి, దోపిడీ చేశారు. అయినప్పటికీ నిరాశ చెందకుండా అతను సువార్తను ప్రకటించుచూ గ్రామగ్రామానికి విస్తృతంగా ప్రయాణించారు. మరొకవైపు శారా విద్యా సంబంధ పనులను నిర్వహించారు. వారు విత్తిన కృపా విత్తనములు వేరు తన్ని అభివృద్ధి చెందినవై సమృద్ధిగా ఆత్మీయ ఫలాలను ఫలించాయి.

  తన శ్రమ యొక్క ఫలాలను ఆస్వాదించకముందే, టావోయ్ వద్ద మరొక మిషన్ కేంద్రమును స్థాపించుటకు బోర్డ్‌మాన్ పంపబడ్డారు. అయినప్పటికీ, ఎటువంటి సంకోచం లేకుండా, అతను బలమైన విగ్రహారాధికులైన కరెన్ తెగల మధ్య పరిచర్య చేయుటకు టావోయ్‌కు వెళ్ళారు. అక్కడ అతను స్థానికుల నుండి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. కానీ, బోర్డ్‌మాన్‌లో తేజోవంతముగా ప్రకాశిస్తున్న క్రీస్తుని ప్రేమ ఆ వ్యతిరేక పరిస్థితులన్నింటినీ జయించింది. సువార్తను ప్రకటించుటకుగాను అతను కాలినడకన వందలాది మైళ్ళు ప్రయాణించారు మరియు ఎంతో క్లిష్టమైన పర్వతాల గుండా ధైర్యముగా సాగిపోయారు.

  తన నాలుగు సంవత్సరాల పరిచర్యలో అతను తన పిల్లలిద్దరినీ కోల్పోయారు. అటువంటి హృదయ వేదనతో నిండిన పరిస్థితుల మధ్య అతను “ఇవేవీ నన్ను కదిలింపవు” అనే అపొస్తలుడైన పౌలు యొక్క మాటలను వల్లె వేసేవారు. బోర్డ్‌మాన్ కూడా నిర్విరామముగా చేసిన పరిచర్యతో ఎంతో అలసి కృశించిపోయినవారై, కేవలం 30 సంll ల వయస్సులోనే ప్రభువు చెంతకు చేరుకున్నారు.

ప్రియమైనవారలారా, ఈ లోక సంపద కంటే క్రీస్తు కొరకు శ్రమననుభవించుటయే మిగుల విలువైనదని మీరు నమ్ముతున్నారా?

"ప్రభువా, నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. నా పరుగును నేను సంతోషముతో తుదముట్టించుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp
  • No comments:

    Post a Comment