Search Here

Oct 6, 2021

John Patteson | జాన్ పాటెసన్

జాన్ పాటెసన్ | John Patteson


  • జననం: 01-04-1827
  • మహిమ ప్రవేశం: 20-09-1871
  • స్వస్థలం: డెవాన్
  • దేశం: ఇంగ్లాండు
  • దర్శన స్థలము: దక్షిణ పసిఫిక్ దీవులు

 ఇంగ్లాండుకు చెందిన జాన్ కోల్రిడ్జ్ పాటెసన్ దక్షిణ పసిఫిక్ దీవులలో హతసాక్షిగా మరణించిన ఒక మిషనరీ. పాటెసన్ తన చదువులో బాగా రాణించారు మరియు యవ్వనంలో ఉన్నప్పుడు ఒక మంచి క్రికెట్ ఆటగానిగా ఉన్నారు. అతను ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నప్పుడు, బిషప్ అయిన జార్జ్ సెల్విన్ ద్వారా దక్షిణ పసిఫిక్ దీవులలో సేవ చేయుటకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే క్రైస్తవుల కొరకు ఉన్న అవసరతను గురించి విన్నారు. అప్పటివరకు కూడా క్రైస్తవ సంఘములో శ్రద్ధాసక్తులు కలిగి పరిచర్యలో సహకరించేవానిగా ఉన్నందున, అతను వెంటనే మెలనేసియా దీవులలోని కౄర స్వభావులైన ప్రజల మధ్య దేవునికి సేవ చేయుటకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.

 1855వ సంll లో ఆక్లాండుకు చేరుకున్న పాటెసన్, మెలనేసియా మిషన్ యొక్క బాధ్యతలను స్వీకరించారు. అక్కడ అతను ‘సదరన్ క్రాస్’ అనే ఓడను అద్దెకు తీసుకొని, సువార్తను ప్రకటిస్తూ ద్వీపం నుండి ద్వీపానికి నిరంతరమూ ప్రయాణాలను సాగించారు. కొంతమంది ద్వీపవాసులు అతని రాకడ పట్ల సుముఖతను చూపించేవారు గానీ, చాలామంది శతృ భావంతో చూసేవారు. భాషలలో నిష్ణాతుడైన పాటెసన్, త్వరలోనే ఆ ద్వీపాలలో మాట్లాడే ఇరవై మూడు భాషలను నేర్చుకున్నారు. ప్రశాంతతో నిండుకొని సున్నితముగా ఉండే అతని ప్రవర్తన ద్వారా అతను కొంతమంది క్రూరమైన స్వభావం కలిగిన వారిని కూడా మచ్చిక చేసుకొనగలిగారు. ద్వీపవాసుల కొరకు అతను అనేక పాఠశాలలను కూడా స్థాపించారు.

 ఆ కాలంలో కొంతమంది ఐరోపావారు బానిస వ్యాపారము కొరకు ఆ ద్వీపవాసులను బలవంతంగా బంధించేవారు. బానిసల వ్యాపారాన్ని అరికట్టడానికి పాటెసన్ నిర్విరామంగా శ్రమించారు. 1871వ సంll సెప్టెంబరు మాసంలో నూకాపు దీవి నుండి ఐదుగురు యువకులను కొంతమంది బలవంతంగా తీసుకెళ్ళారు. అయితే, దాని గురించి ఎరిగియుండని పాటెసన్‌ కొన్ని రోజుల తరువాత సువార్త ప్రకటించుటకు ఆ దీవికి వచ్చారు.

 ‘రక్తానికి రక్తం’ అనే నినాదంతో ఉండే నూకాపు ప్రజలకు శ్వేతజాతీయులందరూ ఒకటే. కాగా, పాటెసన్ తన ఓడను దిగగానే, అతను కూడా బానిస వ్యాపారస్థులలో ఒకరని భావించి వందలాది మంది ఆదివాసులు అతని వైపు బాణాలతో పరుగెత్తి వచ్చారు. పాటెసన్ మరియు అతని సహచరులు తాము స్నేహభావంతో వచ్చామని, ఎవరినీ అపహరించుటకు కాదని స్థానికులకు విశదపరచుటకు ప్రయత్నించారు. కానీ ప్రతీకారం తీర్చుకోవాలని ఆగ్రహంతో నిండియున్న కౄర స్వభావులైన ఆ ప్రజలు వారి పైకి విషం పూసిన బాణాలను వేసి, పాటెసన్‌ను మరియు అతని బృందాన్ని చంపేశారు.

 దక్షిణ పసిఫిక్ దీవులలో రాలిపోయి ఇప్పుడు అధికముగా ఫలించిన ఒక గోధుమ గింజ జాన్ పాటెసన్. అతని గౌరవార్థం ‘సదరన్ క్రాస్’ అనే పేరు గల ఓడల సమూహం సువార్తను ప్రకటిస్తూ నేటికీ దక్షిణ పసిఫిక్ దీవులను సందర్శిస్తున్నాయి.

ప్రియమైనవారలారా, భూమిలో పడి చనిపోయిన గోధుమ గింజవలె మీరు కూడా దేవుని కొరకు మీ జీవితములను అర్పించి అధికముగా ఫలించెదరా?

"ప్రభువా, ఒంటిగానే మిగిలిపోవలెనని నేను కోరుకొనుట లేదు గానీ, గోధుమ గింజ వలె చనిపోయి మీ కొరకు అధికముగా ఫలించవలెనని వాంఛిస్తున్నాను. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp
  • No comments:

    Post a Comment