లూసిల్ ఫోర్డ్ | Lucile Ford
- జననం: 12-05-1883
- మహిమ ప్రవేశం: 25-05-1973
- స్వస్థలం: నెబ్రాస్కా
- దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
- దర్శన స్థలము: భారతదేశం
లూసిల్ జెనీవా ఫోర్డ్ ఒక భక్తిగల క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి ఫ్రెడ్రిక్ ఫోర్డ్ స్థానిక క్రైస్తవ సంఘములో ఆదివారపు బైబిలు పాఠశాల యొక్క నిర్వాహకులుగా (సండే స్కూల్ సూపరింటెండెంట్) ఉండేవారు. 1883వ సంll లో లూసిల్ జన్మించినప్పుడే ఆమె తల్లి మేరీ సలీనా ఆమెను దేవుని సేవకు సమర్పించారు. ఒకవైపు తన చదువును కొనసాగిస్తూనే, ఎప్పటికైనా పరదేశానికి మిషనరీగా వెళ్ళాలనే తన లక్ష్యము పై ఎల్లప్పుడూ ఆమె గురి ఉంచేవారు. అయితే, నెబ్రాస్కాలోని కాట్నర్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలో ఆమె తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. తత్ఫలితముగా ఆమె శారీరక స్థితి విదేశాలలో సేవ చేయుటకు తగిన స్థితిలో లేనిదిగా భావించారు. కావున ఆమె సెయింట్ లూయిస్‌లోని ఒక క్రైస్తవ ఆసుపత్రిలో పనిచేశారు.
అటువంటి పరిస్థితులలో ఏ సగటు వ్యక్తి అయినా స్వదేశంలో మంచి జీతంతో కూడిన ఉద్యోగంలో స్థిరపడుటకు కోరుకుంటాడు. కానీ, లూసిల్ ఫోర్డ్ అటువంటి సగటు వ్యక్తి కాదు. తన ఆరోగ్యం మెరుగుపడిన వెంటనే, ఆమె మిషనరీ శిక్షణ కొరకు ‘కాలేజ్ ఆఫ్ మిషన్స్’ అనే కళాశాలలో చేరారు. తదుపరి ‘యునైటెడ్ క్రిస్టియన్ మిషనరీ సొసైటీ’ తరపున భారతదేశంలో సేవ చేయుటకు ఆమెకు అవకాశం లభించింది. తద్వారా 1915వ సంll లో భారతదేశానికి చేరుకున్న ఆమె, వెంటనే తొంభై ఐదు మంది బాలికలకు వసతి కల్పించే మహోబా బాలికల అనాథాశ్రమము యొక్క నిర్వహణా బాధ్యతలను చేపట్టారు. నాలుగు సంవత్సరాలలో ఆ అనాథాశ్రమం దాదాపు 200 మంది బాలికలకు సంరక్షణ కల్పించేదిగా అభివృద్ధి చెందింది. ఆ అనాథాశ్రమం ఒక పెద్ద కుటుంబమైతే, లూసిల్ దానికి కరుణ, ప్రేమలతో నిండుకొనియున్న తల్లి అయ్యారు. అంతేకాకుండా, అక్కడి బాలికలు సరైన విద్యాభ్యాసమును మాత్రమే కాకుండా, ఆత్మీయపరమైన శిక్షణను పొందేలా చూశారు లూసిల్.
తదుపరి ఒక సంవత్సరం పాటు హర్దాలో సేవ చేసిన లూసిల్, పిమ్మట కుల్‌పహార్‌కు వెళ్ళారు. మహోబాలో వలెనే తన అద్భుతమైన సేవలను కొనసాగిస్తూ, ఆమె కుల్‌పహార్‌లో మహిళల కొరకు ఏర్పరచబడిన ఒక ధార్మిక గృహము మరియు బాలికల కొరకు ఏర్పరచబడిన శిక్షణా కేంద్రము యొక్క బాధ్యతలను చేపట్టారు. తమ కాళ్లపై తాము నిలబడగలిగినప్పుడే మహిళలు గౌరవించబడతారని ఆమె విశ్వసించారు. ప్లేగు వ్యాధి వ్యాపిస్తున్న సమయంలో, ఆమె అనాథాశ్రమం ఆ పట్టణపు వందలాది మంది ప్రజలకు కులమత బేధాలు లేకుండా ఆశ్రయమిచ్చింది. మరణానికి కులంతో సంబంధం లేదని మరియు యేసు క్రీస్తు ప్రభువు కూడా కులంతో సంబంధం లేకుండా సమస్త మానవాళి కొరకు తన ప్రాణము పెట్టారని ఆ ప్రజలకు బోధించుటకు ఆమె ఆ అవకాశమును సద్వినియోగపరచుకున్నారు.
1948వ సంll లో ఆమె పదవీ విరమణ పొందారు. అయినప్పటికీ, 1973వ సంll లో తాను మహిమనందు ప్రవేశించు వరకు కూడా కాలిఫోర్నియాలోని స్థానిక క్రైస్తవ సంఘము యొక్క కార్యకలాపాలలో చురుకుగా పాలుపంచుకుంటూ ప్రభువు సేవలో ముందుకు సాగిపోయారు లూసిల్ ఫోర్డ్.
ప్రియమైనవారలారా, మంచి జీతంతో కూడిన ఉద్యోగములో సౌకర్యముగా ఉంటూ సేవ కొరకైన మీ పిలుపును మీరు మరిచిపోయారా?
"ప్రభువా, మిమ్మును సేవించాలనే అంతిమ లక్ష్యముపైనే ఎల్లప్పుడూ నా గురి నిలుపుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"
దేవునికే మహిమ కలుగునుగాక!
No comments:
Post a Comment