మార్గరెట్ నికోల్ లైర్డ్ | Margaret Nicholl Laird జీవిత చరిత్ర
- జననం: 31-07-1897
- మహిమ ప్రవేశం: జూన్ 1983
- స్వస్థలం: కొలరాడో
- దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
- దర్శన స్థలము: మధ్య ఆఫ్రికా రిపబ్లిక్
పరిశుద్ధ గ్రంథమైన బైబిలును వివిధ భాషలలోనికి అనువదించుటకు ప్రేరణ కలిగించునవి అనేకం ఉన్నాయి. 25 సంll ల వయసున్న ఒక యువ మిషనరీ మధ్య ఆఫ్రికా రిపబ్లిక్‌లోని బంగాసౌ ప్రజలకు చదవడం మరియు రాయడమును నేర్పిస్తున్నారు. నిర్విరామంగా అలుపులేకుండా సలిపిన ఎంతో కృషి తరువాత ఆమె విద్యార్థులలో ఒకరు యోహాను 3:16వ వచనమును చదవగలిగారు. వెంటనే ఆ విద్యార్థి "కాగితం నాతో మాట్లాడింది!" అని ఆశ్చర్యముతో అరిచారు. అప్పుడు ఆ మిషనరీ "అవును, అది మీ కొరకు దేవుని ప్రేమ సందేశం." అని సమాధానమిచ్చారు. "దేవుడు నా భాషను మాట్లాడుతాడా?" అనేది ఆ విద్యార్ధి తదుపరి ప్రశ్న. బైబిలును సాంగో భాషలోకి అనువదించుటకు ఆ ప్రశ్న ఆమెను ప్రేరేపించింది. యవ్వనస్థురాలైన ఆ మిషనరీ మార్గరెట్ నికోల్ లైర్డ్.
దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబములో పెరిగిన మార్గరెట్, తాను ఒక వైద్య మిషనరీ కావాలని కోరుకున్నారు. ఆమె డెన్వర్‌లో నర్సింగ్ కోర్సును అభ్యసించారు. విశ్వాసము పైనే ఆధారపడి దేవుని సేవించవలెనని హడ్సన్ టేలర్ నుండి ప్రేరణ పొందినవారై ఆమె బాప్టిస్ట్ మిడ్-మిషన్‌లో చేరగా, ఆ సంస్థ ఆమెను మధ్య ఆఫ్రికాలోని ఉబాంగి-షారీ అనే ప్రాంతమునకు పంపింది. అక్కడ ఆమె మరొక మిషనరీయైన గై లైర్డ్‌ని వివాహం చేసుకున్నారు. ఆ దంపతులిరువురు కలిసి తరువాతి 30 సంll లు బైబిలుని సాంగో భాషలోకి అనువదించారు.
అప్పటిలో అక్కడ అధికారంలో ఉన్న ఫ్రెంచ్ ప్రభుత్వం ఆ మిషనరీ దంపతుల ధైర్యానికి ముగ్ధులై, ఇప్పీలోని బండా తెగల మధ్య పని చేయమని వారిని అభ్యర్థించింది. బండా తెగలు గతంలో ముగ్గురు ఫ్రెంచ్ మిషనరీలను తినివేసిన కౄరమైన నరమాంస భక్షకులు. అయినప్పటికీ, ఆ కౄర జనుల మధ్య పని చేయుటకు ప్రార్ధనపూర్వకముగా అంగీకరించారు లైర్డ్ దంపతులు.
ఇప్పీలో మార్గరెట్ యొక్క మొదటి అనుభవం భయానకమైనది. ఆ గ్రామస్థులు తమ నాయకుడిని అతని 300 మంది భార్యలతో పాటు ప్రాణాలతో ఉండగానే సమాధి చేయుటను ఆమె ప్రత్యక్షంగా చూశారు. అయినప్పటికీ, ఆమె నిర్భయముగా ఎంతో ప్రేమతో స్థానికులను తన ఇంటిలోనికి మరియు జీవితంలోనికి ఆహ్వానించారు. ఆమె అనారోగ్యంతో ఉన్నవారికి మరియు చావుబ్రతుకులలో ఉన్నవారికి చికిత్స చేస్తూ వైద్య సహాయం అందించేటప్పుడు తన భద్రత కొరకై ఆమె దేవుని సార్వభౌమత్వ అధికారము పైనే విశ్వాసముంచారు. ఒకసారి ఆమె ఒక గ్రామాధికారికి చికిత్స చేసి స్వస్థత చేకూర్చగా, తదుపరి ఆ అధికారి తన గ్రామస్థులను రక్షణ మార్గములోనికి నడిపించుటలో కీలక పాత్ర పోషించారు.
ఆ ప్రాంతంలో ఆసుపత్రులు లేకపోవడంతో మార్గరెట్ తన భర్తను కోల్పోయారు. అది ఆమెను నిరాశపరచలేదు కానీ "దేవా, నాకు ఇప్పీలో ఒక ఆసుపత్రిని ఇవ్వండి" అని ప్రార్ధించేలా చేసింది. 40 సంll ల పరిచర్య ముగిసే సమయానికి ఆమె అక్కడ ఒక ఆసుపత్రిని నడపడమే కాదు, ఒక నర్సింగ్ శిక్షణా కార్యక్రమమును కూడా ప్రారంభించారు. తదుపరి 1964వ సంll లో ఆమె అమెరికాకు తిరిగి వచ్చారు. "కోట మామా" (పెద్ద తల్లి) అని తాను సేవ చేసిన ఆఫ్రికా ప్రజలచే ఆప్యాయంగా పిలువబడే మార్గరెట్ నికోల్ లైర్డ్, 1983వ సంll లో ప్రభువునందు విశ్రమించారు.
ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది :
ప్రియమైనవారలారా, దేవుడు మాట్లాడుతున్నాడు! ఇతరులు ఆయన స్వరమును వినగలుగుటకు మీరు సహాయం చేస్తున్నారా?
ప్రార్థన
"ప్రభువా, ఇతరులు మీ మెల్లని స్వరమును వినగలుగుటకు నేను సహాయపడులాగున నాకు కృపననుగ్రహించుము. ఆమేన్!"
దేవునికే మహిమ కలుగునుగాక!
No comments:
Post a Comment