జాకబ్ చాంబర్‌లైన్ | Jacob Chamberlain జీవిత చరిత్ర
- జననం: 13-04-1835
- మహిమ ప్రవేశం: 02-03-1908
- స్వస్థలం: షారోన్
- దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
- దర్శన స్థలము: నిజాం సంస్థానం, భారతదేశం
హైదరాబాద్‌లోని ఒక మార్కెట్‌లో సువార్త పత్రికలను విక్రయించుటకు ప్రయత్నిస్తున్న ఒక మిషనరీ వైద్యుడిని మరియు అతని సహచరులను ఆగ్రహంతో ఉన్న కొంతమంది ముస్లింలు మరియు హిందువులు చుట్టుముట్టారు. ఆ పత్రికలను పంది తోలులో చుట్టిపెట్టినట్లు ముస్లింలకు, ఆవు తోలులో చుట్టిపెట్టినట్లు హిందువులకు చెప్పబడింది. కావున ఆ రెండు గుంపులవారు ఆగ్రహముతో నిండుకొనినవారై ఆ మిషనరీలపై రాళ్ళు వేయుటకు సిద్ధమయ్యారు.
అప్పుడు ఆ మిషనరీ వైద్యుడు తాను ఒక కథ చెబుతానని, అటు తరువాత వారు తనను చంపవచ్చునని వారిని కోరారు. తెలుగు మాట్లాడే విదేశీయుడి నుండి కథ వినాలనే ఆలోచన కొంతమందిలో ఆసక్తిని రేకెత్తించింది. వెంటనే మిషనరీ వైద్యుడు పాపం మరియు దాని పరిహారం గురించి వేదాలలో వ్రాసి ఉన్నవాటిని చెప్పి, పాపానికి మీయొద్ద పరిష్కారం ఉందా అని వింటున్నవారిని అడిగారు. ఒక విదేశీయుడు వేదాలను చెప్పటం చూసి ఆశ్చర్యపోయిన కొంతమంది బ్రాహ్మణులు తమ యొద్ద ఎటువంటి పరిష్కారం లేదని చెప్పారు.
అప్పుడు ఆ మిషనరీ యేసు క్రీస్తు మరియు ఆయన సిలువ కథను విపులముగా వివరించి చెప్పడం ప్రారంభించారు. అది విని అక్కడ ఏడ్వనివారంటూ ఎవరూ లేరు. చివరిగా అతను ఇదీ నేను చెప్పాలనుకున్న కథ, ఇప్పుడు మీరు నన్ను చంపవచ్చు అని చెప్పి ముగించారు. కానీ వారు - లేదు! మేము యేసు క్రీస్తు గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నాము అని చెప్పి అతని వద్దనున్న సువార్త పత్రికలనన్నింటిని కొనుగోలు చేశారు. ఆ మిషనరీ వైద్యుడు ఎవరంటే, తెలుగు ప్రజల మధ్య సేవ చేసి ఒక మార్గదర్శక మిషనరీగా నిలిచిన జాకబ్ చాంబర్‌లైన్.
వైద్యపరమైన వృత్తిని చేపట్టి స్థిరమైన భవిష్యత్తును కొనసాగించడానికి బదులుగా, 26 ఏళ్ళ జాకబ్ అన్యదేశాలలో దేవుని సేవ చేయుటకు ఎంచుకున్నారు. 1861వ సంll లో భారతదేశానికి చేరుకున్న అతను, భారతీయ సాహిత్యాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తరువాత 1865వ సంll లో మదనపల్లెలో తన పరిచర్యను ప్రారంభించారు. అతను అక్కడ పాశ్చాత్య వైద్యమును ప్రవేశపెట్టి, ఆసుపత్రులు మరియు విద్యాసంస్థలను నిర్మించారు. అతను నిజాం సంస్థానం మరియు మధ్య భారతదేశమంతటా ప్రయాణించి సువార్తను ప్రకటించారు.
పరిచర్య చేస్తున్న కాలంలో అతను మనుష్యులు మరియు అడవి జంతువుల నుండి కలిగిన మరణాపాయల నుండి అనేక సార్లు తప్పించుకున్నారు. పరిచర్య చేయుటకు అతనికి అంతటి ధైర్యమును ఇచ్చేది ఏమిటని అతనిని అడిగినప్పుడు, “ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను అనే నా పరమ యజమానుని వాగ్దానమును నేను విశ్వసిస్తాను” అని అతను సమాధానమిచ్చారు. తన వృద్ధాప్యం వరకు కూడా స్ఫూర్తిదాయకమైన పరిచర్య చేసిన పిమ్మట, 1908వ సంll లో పరమ విశ్రాంతిలో ప్రవేశించిన జాకబ్ చాంబర్‌లైన్, సేవ చేయుటకు తాను ఎంచుకున్న అదే గడ్డ పై భూస్థాపనం చేయబడ్డారు.
ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది :
ప్రియమైనవారలారా, దేవుని వాగ్దానాల ద్వారా మీరు ధైర్యాన్ని పొందుతున్నారా?
ప్రార్థన :
"ప్రభువా, దేనిని గురించి చింతించక మీ వాగ్దానాలపై స్థిరముగా నిలబడుటకు నాకు శాంతి సమాధానములను దయచేయుము. ఆమేన్!"
దేవునికే మహిమ కలుగునుగాక!
No comments:
Post a Comment